CM Chandrababu: నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువాళ్లు మరింత ఉన్నతస్థితికి ఎదగాలి
ABN , Publish Date - Jan 03 , 2025 | 07:17 PM
అమెరికా కాదు ఏ దేశం వెళ్లినా అక్కడ తెలుగు వారు ఉన్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమెరికాకు ఏడాదిలోనే 1.5 లక్షల మంది వరకు తెలుగు వారు చదువుకునేందుకు వెళ్లారని చెప్పారు. అవకాశాల కోసం విదేశాలకు వెళ్లడంలో తప్పులేదని.. కానీ. మాతృదేశాన్ని మర్చిపోకూడదని సీఎం చంద్రబాబు తెలిపారు.
హైదరాబాద్: ‘‘థింక్ గ్లోబల్లి, యాక్ట్ లోకల్లీ ఇప్పుడు ఇదే మన స్లోగన్’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువాళ్లు మరింత ఉన్నతస్థితికి ఎదగాలని అన్నారు. ప్రపంచంలో ఉండే తెలుగు వారు అందరిని ఇక్కడ చూస్తున్నామని అన్నారు. తెలుగువాడిగా మీ అందరికి స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఈ మహాసభను ప్రారంభించారని గుర్తుచేశారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడ ఉన్నా తెలుగు జాతి మనదని తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ(HICC)లో ఇవాళ(శుక్రవారం) ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మూడు రోజుల పాటు తెలుగు మహాసభలు జరుగనున్నాయి. తెలుగు ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాకారులు, కృష్ణ ఎల్ల, మురళీమోహన్, ఎంపీ మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావు, తదితరులు హాజరయ్యారు. ప్రపంచ తెలుగు మహా సభల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను విడి విడిగా సందర్శించి నిర్వాహకులతో సీఎం చంద్రబాబు నాయుడు , భువనేశ్వరిలు ముచ్చటించారు.
జీరో ప్రాపర్టీ మన లక్ష్యం కావాలి..
బ్రెయిన్ డ్రైన్ ఏ బ్రెయిన్ గైన్ అవుతుందని గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. ఏపీ, తెలంగాణలో ఉండే వారి కంటే విదేశాల్లో ఉండే వారు భాష, సంప్రదాయాన్ని ఎక్కువగా గౌరవిస్తున్నారని ఉద్ఘాటించారు. రాళ్లు రప్పలున్న ఈ ప్రాంతాన్ని మేటి సిటీగా అప్పట్లోనే తీర్చిద్దానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలని చెప్పుకొచ్చారు. పెట్టుబడుల కంటే ఐడియాలు చాలా ముఖ్యమని తెలిపారు. చిన్న ఆలోచనతో ర్యాపిడో స్థాపించి గొప్పగా రాణించారని అన్నారు. కోవర్కింగ్ స్పేస్ ద్వారా వేలమందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. వినూత్నంగా ఆలోచిస్తే తెలుగువాళ్లు మరింత రాణిస్తారన్నారు. జీరో ప్రాపర్టీ మన లక్ష్యం కావాలని సూచించారు. 90 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత మనదని చెప్పారు. పీపీపీ విధానంలో అనేక ప్రాజెక్టులు కట్టుకున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పీపీపీ విధానం.. భవిష్యత్‌లో మరింత విస్తరించాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాం..
‘‘ఆర్థిక ఇబ్బందులతో ఒక దశలో 3 నెలలకు ఒకసారి వేతనాలు ఇచ్చాను. అందరం కలిస్తే ఏదైనా సాధించగలం. సైబరాబాద్‌ను నిర్మించడమే కాదు ప్రపంచంలోనే మేటిగా తీర్చిదిద్దటంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది. తెలుగు వారికి ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉన్నాయి. అప్పట్లో వేసిన పునాదులతో ఇప్పుడు తెలంగాణ అత్యధిక పర్ క్యాపిటల్ ఉన్న రాష్ట్రంగా ఎదిగింది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎదిగాడు అంటే అది తెలుగు వారి ఘనత. ఐటీకి ప్రాధాన్యత ఇస్తే చాలామంది ఎగతాళి చేశారు. అమెరికా కాదు ఏ దేశం వెళ్లినా అక్కడ తెలుగు వారు ఉన్నారు. అమెరికాకు ఏడాదిలోనే 1.5 లక్షల మంది వరకు తెలుగు వారు చదువుకునేందుకు వెళ్లారు. అవకాశాల కోసం విదేశాలకు వెళ్లడంలో తప్పులేదు. మాతృదేశాన్ని మర్చిపోకూడదు ... అలాగే పని చేస్తున్న దేశాలకు కూడా సేవ చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి ఐటీ ఉద్యోగి ఉండటమే కాదు ప్రతి ఇల్లు ఏఐను వినియోగించుకోవాలి. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త రావాలి. డబ్బు కంటే గొప్ప వ్యాపార ఆలోచన ముఖ్యం. తెలుగు జాతి ఒకరికి ఒకరు పరస్పరం సహకరించుకోవాలి. 2047కు భారత్ ప్రపంచంలోనే మొదటి, రెండో స్థానంలో ఉంటుంది. విజన్ 2047ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ కోసం నేను చేస్తున్నాను. కో వర్కింగ్ స్పేస్ ద్వారా ఏపీలో 5 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పేదరికం లేని సమాజం కోసం అందరం కృషి చేయాలి’’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
జనాభా విషయంలో జాగ్రత్త..
‘‘బయోటెక్నాలజీ గురించి మాట్లాడితే అప్పట్లో కృష్ణా ఎల్లా మాత్రమే గుర్తుకు వచ్చేవారు.కొందరు ధనవంతులు అవుతుంటే పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు. ప్రతి ఒక్కరూ పేదరికంలో ఉన్న కనీసం 10 కుటుంబాలను గైడ్ చేసి పైకి తీసుకు రావాలి. దక్షిణ భారత్‌లో జనాభా తగ్గుతోంది. జనాభా విషయంలో జాగ్రత్త పడాలి. డబుల్ ఇన్ కం నో కిడ్స్ అనే ఆలోచన పెరుగుతోంది. భార్య భర్త ఇద్దరి సంపాదన, పిల్లలు వద్దు అనే ఆలోచన సరైంది కాదు. మనం తయారు చేసే ఉత్పత్తుల క్వాలిటీ పెరగాలి, ఆ దిశగా కృషి చేస్తున్నాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేస్తున్నాం. డీప్ టెక్ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుంది. ఆంద్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి. తెలుగు వారికి మొదటిసారి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. పొట్టి శ్రీరాములు ఆత్మర్పణ చేసిన తర్వాత ఏపీ ఏర్పడింది. అలాంటి వారిని గుర్తుపెట్టుకోవాలి’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Govt: ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్.. లక్ష్యం ఇదే
DK Aruna: సీఎం చంద్రబాబుపై డీకే అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Atchannaidu: జగన్‌వి అన్నీ ప్రగల్భాలే.. రాష్ట్రాన్ని భష్టు పట్టించారు.. అచ్చెన్న ఫైర్
Read Latest AP News And Telugu news