AP Budget Reactions: ఏపీ బడ్జెట్‌పై అధికార, విపక్ష నేతలు ఏమన్నారంటే..
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:06 PM
AP Budget Reactions: ఏపీ బడ్జెట్‌పై అధికార, విపక్ష నేతలు పలు రకాలుగా స్పందించారు. బడ్జెట్ అద్బుతం అని అధికార పక్షం నేతలు చెబుతుండగా.. బడ్జెట్‌లో అంతా అరకొరకే నిధులు కేటాయించారని.. హామీలు పూర్తిగా విస్మరించారని విపక్ష నేతలు వ్యాఖ్యలు చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 28: ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై (AP Budger 2025) అధికారపక్షం నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. విపక్ష నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని మంత్రులు తెలిపారు. తల్లికివందనం, అన్నదాత సుఖీభవన పథకాలకు నిధులు కేటాయించడం హర్షనీయమన్నారు. బీసీలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రులు చెప్పుకొచ్చారు. అయితే బడ్జెట్ అంతా అంకెల గారడీ, అంతా అరకొరకగా నిధులు కేటాయించారంటూ విపక్ష నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పలు హామీలపై బడ్జెట్‌లో ప్రస్తావనే లేదని వారు మండిపడుతున్నారు. బడ్జెట్‌పై ఎవరెవరు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం.
బీసీల తరపున ధన్యవాదాలు: మంత్రి కొల్లు రవీంద్ర
2025-26 బడ్జెట్ పట్ల రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ది, సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతున్నాయని తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లకు బడ్జెట్ కేటాయింపులు అభినందనీయమని కొనియాడారు. గతంలో సంక్షేమానికి నిధులు కేటాయించి ఇతర అవసరాలకు మళ్లించి బడుగు బలహీనర్గాలను దగా చేశారని మండిపడ్డారు. కానీ నేటి బడ్జెట్‌లో ప్రధానంగా బడుగు బలహీనర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
Botsa on Budget: ఏపీ బడ్జెట్‌పై బొత్స హాట్ కామెంట్స్
బడ్జెట్‌లో బీసీల కోసం చేసిన కేటాయింపులు కూటమి ప్రభుత్వం బీసీలకు ఏ స్థాయి ప్రాధాన్యం ఇస్తుందో మరోసారి నిరూపించారని తెలిపారు. బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు, ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు కేటాయించడం శుభపరిణామమన్నారు. గత ఐదేళ్లు బీసీ సంక్షేమాన్ని గాలికి వదిలేశారని వ్యాఖ్యలు చేశారు. చేతివృత్తుల వారికి అండగా నిలిచే ఆదరణ పథకాన్ని నిలిపివేసి బీసీలను అన్యాయం చేశారన్నారు. నేడు మళ్ళీ ఆదరణ పథకానికి బడ్జెట్ కేటాయించి, పథకాన్ని పునఃప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. బీసీల అభివృద్ధికి దోహదం చేసేలా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చిన ముఖ్యమంత్రికి రాష్ట్రంలోని బీసీలందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. పోలవరం, అమరావతి వంటి అభివృద్ది, గృహ నిర్మాణం, రోడ్ల నిర్మాణాలకు బడ్జెట్ కేటాయింపులు అభినందనీయమన్నారు. సారా రహిత రాష్ట్రమే లక్ష్యంగా చేపట్టిన నవోదయం 2.0 కార్యక్రమం కోసం కూడా ప్రత్యేకంగా నిధుల కేటాయింపు సంతోషంగా ఉందని అన్నారు. ప్రజల అభివృద్ది సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని విజన్ 2047లక్ష్యం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుందనే నమ్మకం పెరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
బడ్జెట్ అద్భుతం: మంత్రి అనగాని
అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ అద్భుతంగా ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సీఎం చంద్రబాబు ప్రజల అకాంక్షలను బడ్జెట్‌లో పొందుపరిచారన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు హామీల అమలుకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రైతే ముందు అనే నినాదాన్ని బడ్జెట్‌లో కేటాయింపుల ద్వారా ఆచరణలో చూపించారని చెప్పారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు బడ్జెట్ కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చేలా జలవనరుల శాఖకు అధిక కేటాయింపులు చేశారని తెలిపారు. బీసీల సంక్షేమానికి సబ్ ప్లాన్ ద్వారా బడ్జెట్‌లో పెద్ద పీట వేశారని... అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి బాటలు వేశారని మంత్రి అనగాని వెల్లడించారు.
ఆరోగ్యశాఖకు ప్రాధాన్యత: మంత్రి సత్యకుమార్
అమరావతి: ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆరోగ్యశాఖకు బడ్జెట్‍లో ప్రాధాన్యత ఇచ్చారని.. మొత్తం బడ్జెట్‍లో దాదాపు 6 శాతం ఆరోగ్యం, వైద్యవిద్యకు కేటాయించారని చెప్పారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కేటాయింపులు చేశారన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తే.. వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి ఊదుతూ బడ్జెట్‍లో కేటాయింపులు చేశారని చెప్పారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు నిధులు కేటాయించారని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
విపక్షాల విమర్శలు...
విజయవాడ: కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సంఖ్య ఘనం - కేటాయింపులు శూన్యమంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శలు గుప్పించారు. అంతా అంకెల గారడి అని - అభూత కల్పనగా చెప్పుకొచ్చారు. దశ - దిశ లేని.. పస లేని బడ్జెట్ ఇది అంటూ వ్యాక్ష్క్యలు చేశారు. రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ అంతా డొల్ల అని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారంటూ మండిపడ్డారు. ఇతర హామీలకు ఎగనామం పెట్టారని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని.. ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్‌తనే నిరూపితం అయ్యిందని తెలిపారు. సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్ అంటూ దుయ్యబట్టారు. అన్నదాత సుఖీభవ పథకానికి కేవలం రూ.6,300 కోట్లు కేటాయించడం అరకొరనే అని అన్నారు. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు ఎదురుచూస్తుంటే రూ.11 వేల కోట్లు నిధులు కావాల్సి ఉంటే.. కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కోసం రైతులను నిరీక్షణకు గురి చేయడం అన్యాయమన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే ..ము ష్టి రూ.300 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇవ్వడం ద్రోహమే అని అన్నారు.
తల్లికి వందనం పథకానికి నిధుల్లో కోత పెట్టారని. రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులకు కావాల్సింది రూ.12,600 కోట్లు అయితే.. రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. అంటే దాదాపు రూ.3 వేల కోట్ల మేర విద్యార్థుల సంఖ్య తగ్గించదలుచుకున్నారా అని ప్రశ్నించారు. దీపం 2 పథకానికి ఏడాదికి అవసరం అయిన నిధులు సంఖ్య రూ.4500 కోట్లుఅని తెలిపారు. బడ్జెట్‌లో ఉచిత సిలిండర్ల పథకానికి కేటాయింపులు రూ.2601 కోట్లు అని.. అంటే కోటిన్నర లబ్ధిదారులు ఉండగా సగం మేర కోత పెట్టదలుచుకున్నారా అని నిలదీవారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదన్నారు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌లో నెలకు రూ.350 కోట్లు కేటాయించే పథకానికి నిధులు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి మనసు రాలేదన్నారు. నెలకు రూ.1500 ఇచ్చే మహాశక్తి పథకాన్ని మాయం చేశారన్నారు. కోటిన్నర మంది మహిళలను అన్యాయం చేశారని కామెంట్స్ చేశారు.
రూ.10 లక్షల వరకు ఉచిత రుణాలు అని చెప్పి ఒక్క రూపాయి కేటాయించకుండా డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి పథకం ఊసే లేదని... జాబ్ క్యాలెండర్ ప్రస్తావనే లేదన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానికి ఒక్క రూపాయి కేటాయించకుండా అప్పులతోనే అమరావతి కట్టాలని చూడటం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసి , ఎన్నికల హామీలను గాలికి వదిలేసి మసి పూసి మారేడు కాయ చేశారన్నారు. ఈ బడ్జెట్‌లో విజన్ లేదని.. విజ్డం లేదని.. కేవలం ఇంద్రజాలమే అని అన్నారు. మిషన్ లేదు మీనింగ్ లేదు కేవలం మహేంద్రజాలమే అంటూ షర్మిల వ్యాఖ్యలు చేశారు.
బాబు నేను చెప్పినట్లు చేయండి: కేఏపాల్
ఏపీ బడ్జెట్ నిరాశపరిచిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను బడ్జెట్‌లో కనబడలేదన్నారు. ‘‘మోడీని నమ్ముకోవద్దు చంద్రబాబు... నేను చెప్పినట్లు చేస్తే మీరు కష్టాలు నుంచి బయటపడతారు’’ అని అన్నారు. సనాత ధర్మం అంటూ పవన్ కల్యాణ్ దేశమంతా తిరుగుతున్నారన్నారు.
జగన్‌పై కీలక వ్యాఖ్యలు
అలాగే వైసీపీ అధినేత జగన్‌పై కేఏపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విషయంలో జగన్ చేసింది చాలా తప్పే అని అన్నారు. ‘‘అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బాయికాట్ చేయడం కాదు. జగన్ తమ్ముడూ అసెంబ్లీకి వెళ్ళు.. ఎమ్మెల్యే అయింది అసెంబ్లీకి వెళ్లడానికే . జగన్ ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీ రాకుండా ఉండడం చాలా తప్పు. అసెంబ్లీకి వెళ్లి పోరాటం చేయాలి... ప్రజా సమస్యలను లేవనెత్తాలి. ఆరు నెలలకు ఒకసారి జగన్ అసెంబ్లీకి వెళ్లి హాజరు వేసుకోవడం వలన లాభం లేదు’’ అని వ్యాఖ్యలు చేశారు.
డిలిమిటీషన్‌పై..
డిలిమిటీషన్ పెద్ద డ్రామా అని.. బీజేపీ చేస్తున్న కుట్ర అంటూ మండిపడ్డారు. ఉత్తర భారతదేశంలో ఎంపీ స్థానాలు పెంచి దక్షిణ భారతదేశంలో ఎంపీ స్థానాలు తగ్గిస్తున్నారన్నారు. డిలిమిటేషన్‌ను అందరూ వ్యతిరేకించాలన్నారు. 2027 లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని కేఏపాల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
MLC Election: పోటెత్తిన టీచర్లు
AP Budget 2025: అభివృద్ధి పథకాలకు భారీగా కేటాయింపులు..
Read Latest AP news And Telugu News