Tadepalli : జగన్ నివాసం వద్ద గడ్డి ‘దహనం’పై సందేహాలు
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:22 AM
జగన్ నివాసం వద్ద ఉన్న రెండు సీసీ కెమెరా ఫుటేజీ ఇవ్వాలని పోలీసులు రెండు దఫాలు నోటీసులు ఇచ్చినా ఇంతవరకు ఇవ్వకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.

పోలీసులు రెండుసార్లు నోటీసులిచ్చినా సీసీ ఫుటేజీ ఇవ్వని వైసీపీ కార్యాలయం
కెమెరాలు సరిగా పని చేయడం లేదని ఆ పార్టీ నేతల వివరణ
(గుంటూరు-ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం వద్ద గడ్డి దహనం ఘటనలో సొంత పార్టీ వారి ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ నివాసం వద్ద ఉన్న రెండు సీసీ కెమెరా ఫుటేజీ ఇవ్వాలని పోలీసులు రెండు దఫాలు నోటీసులు ఇచ్చినా ఇంతవరకు ఇవ్వకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈ నెల 5న జగన్ నివాసం బయట గార్డెనింగ్ వద్ద ఎండిపోయిన గడ్డి కాలిపోయింది. దీనిపై వైసీపీ నాయకులు రాద్ధాంతం చేశారు. ఏదో కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. వైసీపీ నేతల ఆరోపణలపై ప్రభుత్వం కూడా సీరియ్‌సగా స్పందించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, అందుకు కారణాలు వెలికితీసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటన మిస్టరీ ఛేదించాలని ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఆ రోడ్డులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలన్నింటిని క్షుణ్నంగా పరిశీలించారు. గడ్డి దహనమైన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ ఘటనకు దారి తీసిన కారణాలు వెల్లడి కాలేదు. ఈ నెల 7న జగన్ నివాసం వద్ద ఉన్న రెండు సీసీ కెమెరా ఫుటేజీలను ఇవ్వాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే వైసీపీ నుంచి కాని, జగన్ నివాసం నుంచి కాని ఏ స్పందనా రాలేదు. దీంతో ఈ నెల 10న మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ మరుసటి రోజు 11వ తేదీన వైసీపీ నాయకులు పోలీసులను కలిసి జగన్ నివాసం వద్ద ఉన్న సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని చెప్పారు. ఐదో తేదీన జగన్ నివాసం వద్ద విజయవాడ కార్పొరేటర్ల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు ఎవరెవరు వచ్చారో తెలియజేశారు. ఏవైనా వివరాలు కావాలంటే చెబుతామని, సీసీ కెమెరా ఫుటేజీ మాత్రం లేదని చెప్పారు. దీంతో వైసీపీ నేతల వ్యవహారంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హై సెక్యూరిటీ జోన్‌లో...
మాజీ సీఎం జగన్ నివాసం హై సెక్యూరిటీ జోన్‌లో ఉంది. అక్కడ ఆకతాయిలు లేదా రాజకీయ ప్రత్యర్థులు గడ్డి దహనం చేసేందుకు సాహసం చేసే అవకాశమే ఉండదు. అంతేగాక మాజీ సీఎం ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు తప్పనిసరిగా పని చేస్తాయని పోలీసులు అంటున్నారు. గడ్డి దహనానికి సంబంధించిన దృశ్యాలు తప్పనిసరిగా రికార్దయి ఉంటాయని భావిస్తున్నారు. గడ్డి దహనం జరిగిన దృశ్యాలను ఇప్పటికే వారు చూసి ఉంటారని, అందువల్లే ఆయా ఫుటేజీలను ఇవ్వడానికి వెనుకాడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..