Share News

TDP Minister : మా వాళ్లే వదిలేయ్‌!

ABN , Publish Date - Jan 12 , 2025 | 04:00 AM

వైసీపీ అక్రమార్కులు చేసిన, చేస్తున్న మట్టి మాఫియాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్వయానా ఓ టీడీపీ మంత్రి అండదండలు అందిస్తున్నారు. బిల్లులు ఇప్పించే దగ్గరి నుంచి, దొంగ రవాణా బిల్లుల జారీ వరకు సకలం మంత్రిగారే స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు.

TDP Minister : మా వాళ్లే వదిలేయ్‌!

  • వైసీపీ అక్రమార్కులకు మంత్రి అండ

  • ఉమ్మడి కృష్ణాలో విచిత్ర బంధం

  • నాడు అడ్డగోలుగా మట్టి దందా

  • వల్లభనేని, కొడాలి అనుచరుల పాత్ర

  • కూటమి ప్రభుత్వం వచ్చాక వెలుగులోకి

  • 75 కోట్లు జరిమానా వేయాలని నివేదిక

  • నోటీసులు ఇవ్వకుండా అడ్డుకుంటున్న మంత్రి

  • కూటమి ప్రమాణ స్వీకార సభకూ వల్లభనేని అనుచరులు మట్టి తరలింపు

  • 4.8 కోట్ల బిల్లులు చేయించిన మంత్రి

  • ఇప్పటికీ వంశీ అనుచరుడి అక్రమ మైనింగ్‌

  • 18 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తరలింపు

  • లారీలు సీజ్‌ చేస్తే.. విడిపించిన మంత్రి

  • జగన్‌ జమానాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు అక్రమంగా కొండలు, భూములు తవ్వి మట్టిని ఎత్తుకెళ్లిపోయారు. కూటమి సర్కారు వచ్చాక ఫిర్యాదులు రావడంతో గనుల శాఖ అధికారులు అక్రమాలను గుర్తించారు. వైసీపీ నేత వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు కె.సతీష్‌ మట్టి మైనింగ్‌పై రూ.35 కోట్లు, మాజీ మంత్రి కొడాలి అనుచరుడి మైనింగ్‌పై రూ.40 కోట్లు పెనాల్టీ వేయాలని నివేదికలు సిద్ధం చేశారు. అయితే గనుల శాఖతో సంబంధం లేని ఓ టీడీపీ మంత్రి వారికి నోటీసులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు.

  • కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వల్లభనేని వంశీ అనుచరుడు కె.సతీష్‌ అక్రమ మైనింగ్‌ ఆగడం లేదు. తవ్వకాలు జరిపేది తిరువూరు నియోజకవర్గంలో అయితే... ట్రాన్సిట్‌ పర్మిట్లు చూపుతోంది నూజివీడు నియోజకవర్గంలో..! దీనికి కూడా తెరవెనుక సారథి సదరు మంత్రి గారే. అధికారులు అక్రమ మైనింగ్‌ లారీలను పట్టుకుంటే వెంటనే మంత్రి రంగంలోకి దిగిపోతారు. స్వయంగా ఫోన్‌ చేసి లారీలను విడిపిస్తున్నారు.

  • గన్నవరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకార సభకు వల్లభనేని వంశీ అనుచరులు కె.సతీష్‌, రఘు మట్టి, ఇతర వనరులు సమకూర్చారు. ఇందుకుగాను వారికి రూ.4.8 కోట్ల బిల్లులు మంజూరు చేయించారు. ఈ ఘనత కూడా సదరు మంత్రి గారిదే.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ అక్రమార్కులు చేసిన, చేస్తున్న మట్టి మాఫియాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్వయానా ఓ టీడీపీ మంత్రి అండదండలు అందిస్తున్నారు. బిల్లులు ఇప్పించే దగ్గరి నుంచి, దొంగ రవాణా బిల్లుల జారీ వరకు సకలం మంత్రిగారే స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు.


అక్రమ మైనింగ్‌ వాహనాలను రెవెన్యూ, గ నుల శాఖ విజిలెన్స్‌ విభాగాలు సీజ్‌ చేస్తుంటే మంత్రి ఆగమేఘాల మీద కదిలిపోతున్నారు. అవి తమ మనుషుల వాహనాలేనని, వాటిని వదిలేయాలంటూ స్వయంగా ఫోన్లు చేస్తున్నారు. ఇక ఆయన పేషీ అయితే మట్టి మాఫియా సేవలో తరించిపోతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చిచ్చురేపుతున్న మట్టి మాఫియాకు సారథిగా సదరు మంత్రి వ్యవహరిస్తుండటం కలకలం రేపుతోంది.

విజిలెన్స్‌ విచారణకు మోకాలడ్డు

జగన్‌ జమానాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. కొండలు, సాగు భూములు ఏవీ వదల్లేదు. ఇటు పర్యావరణానికి హాని చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు ఈ మట్టి మాఫియాలో కీలకమని ప్రజలే బాహాటంగా చెబుతున్నారు. వీరి అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా నాడు తెలుగుదేశం పార్టీ ఎన్నో పోరాటాలు చేసింది. ఈ క్రమంలో ఎందరో టీడీపీ కార్యకర్తలు, నేతలు.. వైసీపీ నేతల చేతుల్లో దారుణమైన భౌతికదాడులకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నాడు వల్లభనేని వంశీ అనుచరులు కె.సతీష్‌, ఎల్‌.కిశోర్‌, కొడాలి నాని అనుచరులు భారీగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. దీంతో అక్రమ మైనింగ్‌పై గనుల శాఖ విజిలెన్స్‌ దాడులు కొనసాగాయి. భారీగా మట్టి తవ్వకాలు జరిగాయని, ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం చేకూర్చారని గనుల అధికారులు గుర్తించారు.


ఈ నేపథ్యంలో కె.సతీష్‌ మట్టి మైనింగ్‌పై రూ.35 కోట్లు.. కొడాలి నాని అనుచరుడి మైనింగ్‌పై రూ.40 కోట్లు పెనాల్టీ విధించేలా గనుల శాఖ నివేదికలు సిద్ధం చేసింది. అంతే.. సదరు మంత్రి వారిని కాపాడుతానని వైసీపీ నేతలకు అభయం ఇచ్చారు. విజిలెన్స్‌ విచారణను ముగించ కుండా పెండింగ్‌లో పెట్టాలని, డిమాండ్‌ నోటీసులు తయారు చేయవద్దని గనుల అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నారు. దీంతో గత ఆరు నెలలుగా విచారణ సా..గుతూనే ఉంది. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియనంతగా మంత్రి ఒత్తిళ్ల పర్వం కొనసాగుతోంది.

విడదీయరాని బంధం

గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార సభ జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకోసం పెద్ద ఎత్తున సభావేదికను ఏర్పాటు చేశారు. దీనికి వల్లభనేని వంశీ అనుచరులు కె.సతీష్‌, రఘు మట్టి, ఇత ర వనరులు సమకూర్చిపెట్టారు. రఘు అనే వ్యక్తి రైల్వే వర్క్‌లకు మాత్రమే గ్రావెల్‌ తరలించాలి. అలాంటిది సీఎం ప్రమాణ స్వీకార సభకు ఆయనతో మట్టి తరలింపచేశారు. ఆ తర్వాత టీడీపీ మంత్రి తన పలుకుబడి ఉపయోగించి అందరికంటే ముందుగా ఈ ఇద్దరికి కలిపి రూ.4.8 కోట్ల బిల్లులు విడుదల చేయించారు. ఇదీ మంత్రి ఘనత. ఒకవైపు సతీష్‌ చేసిన అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్‌ విచారణ కొలిక్కి రాకుండా చేయడంతో పాటు ప్రభుత్వంలో ఆయనకు రావాల్సిన బిల్లులు సత్వరమే విడుదల చేయించడం గమనార్హం.


తెరవెనుక సారథి ఆయనే..

కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు కె.సతీష్‌ అక్రమ మైనింగ్‌ ఆగడం లేదు. తిరువూరు నియోజకవర్గంలోని కొండపరలో 28 ఎకరాల భూమిలో గ్రావెల్‌ తవ్వకాలు చేస్తున్నారు. దానికి గనుల శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదు. పర్యావరణ అనుమతులు కూడా లేవు. జగన్‌ జామానా నుంచి అప్రతిహతంగా మైనింగ్‌ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా గత ఆరు నెలలుగా దర్జాగా మట్టి దోపిడీ సాగుతోంది. దీనికి కర్త, కర్మ, క్రియ సతీష్‌ అయితే, ఆయన్ను తెరవెనుక నడిపిస్తున్న సారథి టీడీపీ మంత్రినే. తిరువూరు నియోజకవర్గం కొండపర గ్రామంలో 28 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌ చేస్తూ, నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామంలో మట్టితవ్వకాలు చేస్తున్నట్లుగా వాటికి ట్రాన్సిట్‌ పర్మిట్లు ఇప్పించారు. అంటే.. అక్రమంగా తవ్వుతున్నది కొండపరలో.. దానికి ట్రాన్సిట్‌ పర్మిట్లు చూపిస్తోంది చిల్లబోయినపల్లిలో. ఇటీవలి కాలంలో ఈ విషయం రచ్చకెక్కడంతో టీడీపీలోని కొందరు నేతలు అక్రమ మైనింగ్‌ వాహనాలను అడ్డుకొనే ప్రయత్నాలు చే శారు. గనుల శాఖ విజిలెన్స్‌ విభాగం కొన్ని వాహనాలను నిలిపివేసింది. రెవెన్యూ అధికారులు కొన్ని లారీలను సీజ్‌ చేశారు. వెంటనే సదరు మంత్రి రంగంలోకి దిగారు. ‘ఆ లారీలు మా వాళ్లవే. వాటిని వదిలేయండి’ అని రెవెన్యూ అధికారులకు మంత్రి నేరుగా ఫోన్‌ చేసి ఒత్తిడి చేశారు. ‘అక్రమంగా మైనింగ్‌ చేసి తప్పుడు ట్రాన్సిట్‌లతో గ్రావెల్‌ సరఫరా చేస్తున్నారు.


ఇందులో వైసీపీ నేత కె.సతీష్‌ పాత్ర ఉంది. లారీలు ఆయనవే. గతంలో ఈ వాహనాలనే వైసీపీ మాజీ మంత్రి కోసం తిప్పారు’ అని మంత్రికి రెవెన్యూ అధికారి వివరించారు. దీంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వైసీపీ ఏమిటి? టీడీపీ ఏమిటి? ఆ లారీలు మా వాళ్లవే. అతను మా మనిషే. వైసీపీ అని ఎవరు చెప్పారు నీకు? లారీలు వదిలేయ్‌. ఇంకోసారి ఈ సమస్య రావొద్దు’ అని మంత్రి తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో అధికారులు మట్టి మాఫియా లారీలను వదిలేశారు. దీంతో గనుల శాఖ అధికారులు జోక్యం చేసుకొని ఆ తర్వాత ఆరు లారీలను పట్టుకున్నారు. ఈ సారి అంతే. మంత్రి, ఆయన పేషీ జోక్యం చేసుకుని ఆ లారీలు వదిలేయాలని ఒత్తిళ్లు చేశారు. దీంతో గనుల విజిలె న్స్‌ అధికారులు కూడా ఆ లారీలను విడిచిపెట్టారు.

Updated Date - Jan 12 , 2025 | 04:00 AM