Reservoir Conditions : జలాశయాలకు వేసవి గండం!
ABN , Publish Date - Mar 03 , 2025 | 04:33 AM
శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన గొట్టా బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 38.10 మీటర్లు కాగా.. ప్రస్తుతం 35.45 మీటర్లు ఉంది. ఒడిశా కొండల నుంచి(క్యాచ్‌మెంట్ ఏరియా) 30 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది.

గత ఏడాది కంటే కాస్త నయం
కానీ, వేసవితో మున్ముందు కష్టం
సాగర్, శ్రీశైలంలో తగ్గిన నీటిమట్టం
ప్రస్తుతం శ్రీశైలంలో 76 టీఎంసీలు
నాగార్జునసాగర్‌లో 169 టీఎంసీల నిల్వ
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఆశాజనకం
మరికొన్ని జిల్లాల్లో వట్టిపోతున్న వైనం
రిజర్వాయర్లలో తగ్గుతున్న నీరు
రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. గత ఏడాది నీటి వనరులతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితి కాస్త నయమనిపిస్తున్నా.. మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న వేసవి నేపథ్యంలో జల వనరుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి లభ్యత బాగానే ఉంది. కానీ, ఇదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో జలాశయాలు అడుగంటి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని వేసవిలో నీటి కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది.
అట్టడుక్కు వంశధార
శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన గొట్టా బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 38.10 మీటర్లు కాగా.. ప్రస్తుతం 35.45 మీటర్లు ఉంది. ఒడిశా కొండల నుంచి(క్యాచ్‌మెంట్ ఏరియా) 30 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. గత ఐదు నెలలుగా క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు కురవలేదు. దీంతో గొట్టా బ్యారేజీలో నీటి నిల్వ తగ్గుతోంది. హిరమండలం వద్ద వంశధార రిజర్వాయర్‌లో ప్రస్తుతం 2 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. స్థానికంగా కురిసిన వర్షాలకు 4 టీఎంసీలు రిజర్వాయర్‌లోకి చేరింది. అయితే గొట్టా బ్యారేజీ ఎడమ ప్రధాన కాలువ ద్వారా కొంతనీటిని సాగుకు విడిచి పెట్టారు. మరికొంత నీటిని ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుకు పంపిస్తున్నారు. దీంతో వంశధార రిజర్వాయర్‌లో నీరు అడుగంటుతోంది.
సాగర్‌లో ‘వారబందీ’
నాగార్జున సాగర్ కుడి కాల్వ ఆయకట్టులో ‘వారబందీ’ విధానం అమల్లోకి రానుంది. జలాశయంలో నీటి నిల్వలు తగ్గిన నేపథ్యంలో జలవనరుల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 9 రోజుల పాటు నీటి సరఫరా ఉంటుంది. తదుపరి 6 రోజులు నీటి సరఫరాను నిలిపివేస్తారు. జోన్-1 పరిధిలో ఆరు రోజులు నీటి సరఫరా నిలిపివేస్తారు. జోన్-2 పరిధిలో నీటి సరఫరాను కొనసాగిస్తారు. వారబందీ అమలుపై వరి రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆయకట్టు పరిధిలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వరి సాధారణ విస్తీర్ణం 1,05,695 ఎకరాలు కాగా 86,730 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. మిరపకు మార్చి నెలాఖరు వరకు నీటి అవసరం ఉంటుందని రైతులు తెలిపారు. వరికి ఏప్రిల్‌లో రెండు వారాల పాటు నీరు కావాలని చెబుతున్నారు.
ఏలేరుకు ఇబ్బందే?
కాకినాడ జిల్లా ఏలేరు రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం రెండో పంటకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో తాజాగా 80.32 మీటర్ల స్థాయిలో 13.82 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం అవసరాలకు ఇబ్బంది లేకపోయినా ఇదే తరహాలో వినియోగిస్తే వేసవిలో నీరు మరింత తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వ్యవసాయ అవసరాలకు 1200 క్యూసెక్కులు, విశాఖకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తోటపల్లితో కష్టమే!
పార్వతీపురం మన్యం జిల్లాలో తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు నుంచి రబీ పంటలకు పూర్తి స్థాయిలో నీరందించలేని పరిస్థితి. ప్రస్తుతం జలాశయంలో 2.534 టీఎంసీలకు గాను 1.676 టీఎంసీల నీరు ఉంది. తాగునీటికి ఇబ్బందులు లేకపోయినా రబీకి మాత్రం నీరందించలేని పరిస్థితి ఉంది.
జీడీపీలో ఆశాజనకంగా
కర్నూలు జిల్లాలో ఏకైక అతిపెద్ద జలాశయం గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) గరిష్ఠ నీటి మట్టం 377 మీటర్లు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 4.5 టీఎంసీలకు 2.62 టీఎంసీల నిల్వ ఉంది. సాగుకు పోను మరో 1 టీఎంసీ వేసవి అవసరాలకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. కర్నూలు నగరంతో పాటు కోడుమూరు, డోన్, క్రిష్ణగిరి, బండకట్టు సమగ్ర నీటి పథకాలకు ఇబ్బంది ఉండదని ఇంజనీర్లు అంటున్నారు. కాగా, తుంగభద్ర జలాశయంలో ఈ ఏడాది నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలకుగాను ప్రస్తుతం 32.49 టీఎంసీలు నీటి నిల్వ ఉంది.
ఇరు రాష్ట్రాలకు 29 టీఎంసీలు!
నాగార్జున సాగర్ జలాశయంలోని నీటిలో 29 టీఎంసీలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తాగు, సాగు అవసరాలకు కేఆర్‌ఎంబీ కేటాయించింది. వేసవిలో తాగునీటి అవసరాలకు 14 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉంది. ఇరు రాష్ట్రాల్లో పంటలు చేతికి వచ్చే వరకు 15 టీఎంసీల నీటిని పొదువుగా వాడుకోవాలి. 3 రోజుల క్రితం వరకు 10 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని కుడి కాల్వకు సరఫరా చేశారు. నీటి కేటాయింపులు జరగడంతో కుడి కాల్వకు సాగర్ నుంచి నీటి సరఫరాను 5 వేల క్యూసెక్కులకు తగ్గించారు.
మైదానంలా పంపా రిజర్వాయర్
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గమైన మెట్టప్రాంతం అన్నవరంలో పంపా రిజర్వాయర్ నీటిమట్టం తక్కువగా ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా టెండర్లు నిలుపుదల చేశారు. దీనివల్ల నీటి ఎద్దడి ప్రారంభమైంది. 105 అడుగుల గరిష్ఠ నీటిమట్టం కలిగిన రిజర్వాయర్‌లో ప్రస్తుతం 86 అడుగులు మాత్రమే ఉంది. దీంతో సాగునీరు ఎలా ఉన్నా భూగర్భ జలాలు అడుగింటిపోయి అన్నవరం పరిసర ప్రాంత వాసులకు నీటికష్టాలు తప్పేలా లేవు.
నెల్లూరు జిల్లాలో ఇలా..
నెల్లూరు జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో నీటిలభ్యత పుష్కలంగా ఉంది. సోమశిల డ్యాం పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలు కాగా ప్రస్తుతం 58.946 టీఎంసీలు ఉంది. గతేడాది ఆశించిన రీతిలో కృష్ణా జలాలు రావడం, ఆ తర్వాత కడప, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య జిల్లాలతోపాటు పెన్నా క్యాచ్‌మెంట్ ఏరియాలో సమృద్ధిగా వర్షాలు కురడంతో సోమశిలకు వరద చేరింది. చెరువులు, వంకలు, బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో నీటి ఇబ్బందులు లేకుండా మొదటి పంట సాగవుతోంది. తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా 5టీఎంసీలు కేటాయించారు. కండలేరు కూడా నిండుకుండలా ఉంది. స్థానికంగా తాగు, సాగు నీటితోపాటు తమిళనాడులోని చెన్నైకు కూడా నీటిని విడుదల చేసినా కొరత రాదని కండలేరు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
ప్రాజెక్టుల్లో నీటి లెక్కలివీ
రాష్ట్రంలోని మేజర్ జలాశయాల్లో 865.64 టీఎంసీల గరిష్ఠ నిల్వకుగాను.. 476,14(55%) టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. అంటే, 389.5 టీఎంసీల లోటు కనిపిస్తోంది.
మీడియం జలాశయాల్లో 716.27 టీఎంసీలకుగాను 466(56.8%) టీఎంసీలు నిల్వ ఉంది. 250.23 టీఎంసీల లోటు నమోదయింది.
శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో నీటి నిల్వలు బాగా తగ్గాయి. శ్రీశైలం జలాశయం గరిష్ఠ సామర్థ్యం 215.81 టీఎంసీలకుగాను కేవలం 35 శాతం మేర 76.49 టీఎంసీలు నిల్వ మాత్రమే ఉంది. 139.32 టీఎంసీల లోటుంది.
నాగార్జున సాగర్‌లో 312 టీఎంసీలకుగాను 54.45 శాతం మేర 169.91 టీఎంసీల నిల్వ ఉంటే.. 142.14 టీఎంసీల లోటు ఉంది.
పులిచింతలలో 45.77 టీఎంసీల గరిష్ఠ సామార్థ్యానికిగాను 75 శాతం మేర 34.54 టీఎంసీల నిల్వ ఉంది. లోటు 11.23 టీఎంసీలు ఉంది.
ప్రకాశం బ్యారేజీలో 3.07 టీఎంసీలకు గాను 96 శాతం మేర 2.96 టీఎంసీల నిల్వ ఉంది.
ప్రకాశం పరిస్థితి ఇదీ..
పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33 టీఎంసీల నిల్వ ఉంది. దీనికి దిగువున ఉన్న ప్రకాశం బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.09 టీఎంసీల నీరు ఉంది. బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టం 12 అడుగులు కాగా ఇక్కడ 11.07 అడుగుల నీటిమట్టం ఉంది. బ్యారేజ్ వద్ద నిల్వలు తగ్గుతుండడంతో పులిచింతల నుంచి విడుదల చేస్తున్నారు. పులిచింతలకు మాత్రం ఇన్‌ఫ్లో లేదు. ప్రకాశం బ్యారేజ్ కింద కృష్ణా డెల్టాలో 13.8 లక్షల ఎకరాలు సాగవుతోంది. కృష్ణా జిల్లాలో 6.79 లక్షలు, గుంటూరు జిల్లాలో 4.99 లక్షలు, ప్రకాశం జిల్లాలో 0.72 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో 0.58 లక్షల ఎకరాలు సాగవుతోంది. వేసవి మూడు నెలలకు సాగు, తాగునీటి అవసరాలకు మొత్తం 14 టీఎంసీల నీరు అవసరమవుతుంది.
కర్నూలుకు కష్టం లేనట్టే!
ఉమ్మడి కర్నూలు జిల్లా జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. పక్కా ప్రణాళిక, పొదుపుగా నీటిని వినియోగించుకుంటే రబీ ఆయకట్టుతో పాటు వేసవి తాగునీటి అవసరాలకు డోకా ఉండదని ఇంజనీర్లు చెబుతున్నారు. శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులతో కలిపితే 131.264 టీఎంసీల మేర నీరు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కేసీ కెనాల్ పరిధిలో 92,200 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. హంద్రీనీవా పరిధిలో దాదాపు 25వేల ఎకరాలు సాగులో ఉంది. ఈ నెలాఖరు వరకు నీటిని ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కాలువకు 674 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1,350 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు.
నంద్యాల జిల్లాలో..
రానున్న వేసవి నేపథ్యంలో నంద్యాల జిల్లాలో సాగు, తాగు నీటికి ఇబ్బందులు రాకుండా ఆయా రిజర్వాయర్లలో అధికారులు నీటి నిలువలను సిద్ధం చేశారు. జిల్లాలో గోరుకల్లు, వెలుగోడు, అవుకు ప్రధాన రిజర్వాయర్లు కాగా తెలుగు గంగ పరిధిలోని వెలుగోడు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 9.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎస్సార్బీసీ పరిధిలో ఉన్న గోరుకల్లు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 9.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో గోరుకల్లు, వెలుగోడు, అవుకు రిజర్వాయర్ల పరిధిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు లేవు.
కడప చెరువులు కళకళ!
కడప జిల్లాలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో 48 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గండికోటలో 22 టీఎంసీలు నిల్వ ఉండగా, బ్రహ్మంసాగర్‌లో 8.6 టీఎంసీలు, సీబీఆర్‌లో 7.5, పైడిపాలెంలో 4.2, మైలవరంలో 2.5, ఎస్‌ఆర్-1లో 1.2, ఎస్‌ఆర్-2లో 1.2, వామికొండలో 1.2, సర్వారాయసాగర్‌లో 2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బద్వేలు నియోజకవర్గంలో 75 చెరువులను కృష్ణాజలాలతో నింపారు. పులివెందుల 38, మైదుకూరు 20, జమ్మలమడుగు 10, ప్రొద్దుటూరులో 2 చెరువులకు నీళ్లు నింపారు. పండ్లతోటల కోసం 5 టీఎంసీలు, పరిశ్రమలు, సాగునీటి కోసం 4 టీఎంసీల నీరు సరిపోతుంది.
- ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్