Egg : గుడ్డు మొత్తం తింటున్నారా.. తెల్లసొన మాత్రమేనా.. ఏది మంచిదంటే..
ABN , Publish Date - Jan 21 , 2025 | 05:47 PM
గుడ్డులో తెల్లసొన మాత్రమే తింటున్నారా లేకపోతే మొత్తం తింటున్నారా.. ఈ రెండు పద్ధతుల్లో ఇదే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. అదేంటో తెలుసుకోండి.

పిడికెడంత కూడా ఉండని గుడ్డు పోషకాల గని. తక్కువ ధరలో ప్రొటీన్లు పుష్కలంగా అందించే ఏకైక ఆహారం ఇదే. అదీగాక చాలా మందికి ఎగ్ ఫేవరెట్. కానీ, ఒక్కొక్కరు ఒక్కోలా తినడానికి ఇష్టపడతారు. కొందరికి మొత్తం తినటం నచ్చితే.. ఇంకొంతమంది గుడ్డులోని తెల్ల భాగాన్ని మాత్రమే తింటారు. నిజానికి, గుడ్డులోని తెల్లసొన మరియు పచ్చసొన రెండూ మీ శరీరానికి మేలు చేస్తాయి. గుడ్డులోని పచ్చసొనలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని తినడం మానేస్తారు. మరి, గుడ్డు పూర్తిగా తినటం మంచిదా? తెల్లసొన మాత్రమే తినాలా? ఈ విషయం గురించి పోషకాహార నిపుణులు ఏమని చెబుతున్నారో తెలుసుకుందాం.
ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది తింటే శరీరానికి 72 కేలరీలు దక్కుతాయి. మొత్తం గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
మొత్తం గుడ్డులో విటమిన్ ఎ, డి, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కళ్లకు, ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి ఎంతో అవసరం.
ఇందులోని విటమిన్ B12, ఫోలేట్ లక్షణాలు ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి, మెదడు మెరుగైన పనితీరుకు సహాయపడతాయి.
ఐరన్, జింక్ గుడ్డులో సమృద్ధిగా ఉంటుంది. ఈ ఖనిజాలు ఆక్సిజన్ రవాణాలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మెదడు అభివృద్ధికి, కాలేయం సక్రమంగా పనిచేయడానికి గుడ్లలో ఉండే కోలిన్ చాలా అవసరం.
గుడ్డులోని ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి, కోలుకోవడానికి అద్భుతంగా పనిచేస్తాయి.
దీంట్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడి శరీర బలాన్ని పెంచుతాయి.
గుడ్డ తెల్లసొనలో ఫ్యాట్ శాతం దాదాపు సున్నా. ప్రొటీన్ 3.6 గ్రాములు. ఇది మాత్రమే తినేవారికి 17 కెలొరీలు లభిస్తాయి. ఎగ్ వైట్ తింటే కలిగే ప్రయోజనాలు..
విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు గుడ్డులోని తెల్లసొనలో తక్కువ పరిమాణంలో ఉంటాయి.
గుడ్డులోని తెల్లసొనలో రిబోఫ్లావిన్ ఉంటుంది. ఇది ఎనర్జీ లెవల్స్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
ఇందులో ఉండే సెలీనియం యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్యాలరీలను తక్కువగా తీసుకోవాలని కోరుకునేవారికి తెల్లసొన ఆరోగ్యకరమైన ఎంపిక.
తెల్లసొన మాత్రమే తినేవారికి ఇందులోని స్వచ్ఛమైన ప్రోటీన్లు అదనపు కొవ్వు లేకుండా మీ కండరాలను దృఢంగా చేస్తాయి.
గుడ్డులోని తెల్లసొనలో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని ప్రయత్నించే వారికి ఎగ్ బెస్ట్ ఛాయిస్.
మొత్తం గుడ్డు vs తెల్లసొన :
పోషకాలు, శక్తి అధికంగా ఉండే ఆహారాన్ని కోరుకునే వారికి సంపూర్ణ గుడ్లు ఆరోగ్యకరమైన ఎంపిక. మొత్తం గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అయితే, కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు తక్కువ ఫ్యాట్, అధిక ప్రోటీన్ కావాలంటే తెల్లసొన మాత్రమే తినండి.