Maharashtra : ఆ మూడు గ్రామాల్లో.. బట్టతల వైరస్..
ABN , Publish Date - Jan 09 , 2025 | 02:37 PM
జుట్టు అంటే అందరికీ అపురూపమే. కాస్త హెయిర్ ఫాల్ కనిపించినా అస్సలు తట్టుకోలేరు. కానీ, మీకు కారణం లేకుండా ఉన్నపళంగా జుట్టంతా రాలిపోతే.. అదీ వారం రోజుల్లో. ఇలా ఒకరు లేదా ఇద్దరికి జరిగితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఒకే సమయంలో వందలమందికి ఇలాంటి సమస్యే ఎదురైతే.. అది వింతే. ఇలాంటి విచిత్రమైన ఘటనే మహారాష్ట్రలో జరిగింది.
జుట్టు అంటే అందరికీ అపురూపమే. అందమైన, ఒత్తైన జుట్టు కోసం రకరకాల ప్రయత్నాలు చేయడం మామూలే. కాస్త హెయిర్ ఫాల్ కనిపించినా అస్సలు తట్టుకోలేరు. ఆందోళనతో రకరకాల ఆయిల్స్, షాంపూలు మార్చేస్తూ జుట్టు కాపాడుకునే చిట్కాల కోసం వెతుకుతారు. నిజానికి వెంట్రుకలు రాలిపోవడానికి, పల్చబడటానికి లైఫ్‌స్టైల్, కాలుష్యం, ఒత్తిడి లాంటి ఎన్నో కారణాలున్నాయి. వంశపారంపార్యంగా చాలా మంది బట్టతల సమస్యతో బాధపడుతూ ఉంటారు. కానీ, మీకు పై సమస్యలేవీ లేకపోయినా ఉన్నపళంగా జుట్టంతా రాలిపోతే.. అదీ వారం రోజుల్లో. ఇలా ఒకరు లేదా ఇద్దరికి జరిగితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఒకే సమయంలో వందలమందికి ఇలాంటి సమస్యే ఎదురైతే.. అది వింతే. ఇలాంటి విచిత్రమైన ఘటనే మహారాష్ట్రలో జరిగింది. స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా మూడు గ్రామాల్లో నివసించే ప్రజలందరికీ విపరీతంగా జుట్టురాలిపోతోంది. ఒక వ్యక్తికి అయితే, ఏకంగా వారంలోనే బట్టతల వచ్చేసింది. ఈ ఉదంతం చూసి అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందో తెలీక టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ, ఆ 3 గ్రామాల ప్రజలకు హఠాత్తుగా జుట్టు ఎందుకు రాలిపోతోంది. బట్టతల వైరస్‌లా ఎందుకు వ్యాపిస్తోందంటే..
మహారాష్ట్ర బుల్దానా జిల్లాలోని మూడు గ్రామాల్లోని ప్రజల్లో అకస్మాత్తుగా జుట్టు రాలే సమస్య మొదలైంది. గత కొన్నాళ్లుగా అక్కడ నివసించే ప్రతి ఒక్కరినీ ఈ సమస్య పట్టి పీడిస్తోంది. ఒక వ్యక్తికి వారంలోనే ఉన్న జుట్టంతా ఊడిపోయి బట్టతల వచ్చేసింది. దీంతో బోర్గావ్, కల్వాడ్, హింగ్నా ప్రజల్లో భయం నెలకొంది. ఎందుకిలా వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా మారి విపరీతంగా రాలిపోతున్నాయో అక్కడి వారికి అర్థం కాక ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంట్రుకలు రాలే సమస్య అందరిలో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దీన్ని 'బట్టతల వైరస్' అని పిలుస్తున్నారు స్థానికులు.
ప్రజల అభ్యర్థన మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. వారంలోనే బట్టతల వచ్చిన వ్యక్తిని, ఇదే సమస్యతో బాధతో పడుతున్న మరో 50 మందిని పరిశీలించారు. ఈ ఘటనపై ఆరోగ్య బృందంలో షెగావ్ ఆరోగ్య అధికారి డాక్టర్ దీపాలి రహేకర్ మాట్లాడుతూ.. ఈ సమస్య మరికొందరికి వచ్చే ప్రమాదముందని తెలిపారు. బహుశా ఎరువుల వల్ల కలుషితమైన నీరు, ఆరోగ్య సమస్యలు ఇందుకు కారణం కావచ్చని వెల్లడించారు. బాధితుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. ఈ ఫలితాలు ఆధారంగా త్వరమైన కచ్చితమైన కారణాన్ని గుర్తించి తెలియజేస్తామని అన్నారు.