PM Kisan Scheme : 6 వేలు కాదు.. 10 వేలు
ABN , Publish Date - Jan 01 , 2025 | 04:28 AM
దేశవ్యాప్తంగా రైతులు, పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు.
అన్నదాతలకు మోదీ కొత్త సంవత్సర కానుక
కిసాన్ నిధి కింద ఏటా ఇస్తున్న మొత్తం పెంపు
వచ్చే బడ్జెట్‌లో వెల్లడించకముందే ప్రధాని ప్రకటన
ఏడాదికి ఇస్తున్న రూ.6 వేలను పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 31: దేశవ్యాప్తంగా రైతులు, పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే చేయాలని నిర్ణయించారు. 2019 నుంచి మోదీ సర్కారు ఏటా రైతులకు రూ.6 వేలు పెట్టుబడి సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.10 వేలకు పెంచుతున్నట్లు మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా రూ.10 వేలు జమ చేయనున్నట్లు ప్రకటించారు. కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని.. ఆర్థిక మంత్రి నిర్మల త్వరలో ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు ఇదివరకే పేర్కొన్నాయి. అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రధాని స్వయంగా వెల్లడించడం గమనార్హం. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆరేళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. రైతులకు పంట సాయం కింద బాగా ఉపయోగపడుతోంది. ఇప్పటి వరకు కేంద్రం 18 వాయిదాలు చెల్లించింది. కొత్త ఏడాది ఫిబ్రవరిలో 19వ వాయిదా జమ కోసం రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో ప్రధాని ప్రకటన వారిలో ఆనందోత్సాహాలు రేపింది.
మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణంపై సర్వే
దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్లను నిర్మించే విషయంపై సర్వే జరిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ప్రధాని మోదీ తరఫున నూతన సంవత్సర కానుకగా ఈ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31లోపు ఈ సర్వేను పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాధాన్య ప్రాతిపదికన ఈ సర్వేను మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ డిసెంబరు 27న కేంద్రం అన్ని రాష్ట్రాలకూ లేఖ రాసింది. ‘ఆవాస్ 2024’ పేరిట రూపొందించిన యాప్‌లో ప్రజలు స్వయంగా సర్వేలో పాల్గొనేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. గత సెప్టెంబరులోప్రధాని మోదీ ఈ యాప్‌ను ప్రారంభించారు. ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా ప్రజలు సర్వేలో పాల్గొనే అవకాశం కల్పించారు. కాగా పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని బీజేపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే రాబోయే నాలుగేళ్లలో అదనంగా 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. మొత్తం 3.33 కోట్ల ఇళ్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించగా, అందులో 3.22 కోట్ల ఇళ్లు మంజూరయ్యాయని.. 2.68 కోట్ల ఇళ్లు నిర్మించారని తెలిపింది. పీఎంఏవై గ్రామీణ లబ్ధిదారులను గుర్తించేందుకు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఫేస్ టెక్నాలజీని రూపొందించామని, దీనివల్ల మోసాలకు అవకాశం ఉండదని వెల్లడించింది.
మోదీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు
ఆకాంక్షల భారతావనికి ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘అంతరిక్షం నుంచి భూమి వరకు.. రైల్వేస్ నుంచి రన్‌వేస్ దాకా.. సంస్కృతి నుంచి ఆవిష్కరణ వరకు.. 2024లో భారత్ గణనీయ పురోగతిని, పరివర్తనను సాధించింది. ప్రగతి దిశగా నా భారత్ వడివడిగా అడుగులేస్తోంది. మేరా భారత్ బఢ్ రహా’’ అని ‘ఎక్స్’లో తెలిపారు. 2025లోకి విశ్వాసంతో అడుగుపెడుతున్న తరుణంలో తన ట్వీట్‌ను కవితా వేడుకగా అభివర్ణించారు. 2024లో భారత విజయాలను, చేరుకున్న మైలురాళ్లను వివరించే 2.41 నిమిషాల వీడియోను ఈ సందర్భంగా ఆయన పోస్టు చేశారు. ఇందులో అంతరిక్ష ప్రయోగాల విజయాలు, సూపర్-కంప్యూటింగ్, రక్షణ ఉత్పత్తుల పెంపు, పౌరవిమానయాన పరిశ్రమ వృద్ధి, హౌరా మైదాన్ అండర్‌వాటర్ మెట్రో, రామేశ్వరం రైలు వంతెన, వందే భారత్ రైళ్లు, దేశవ్యాప్తంగా వైద్యకళాశాలల పెంపు, ఆరోగ్య సౌకర్యాల మెరుగుదల, అటల్ పెన్షన్ స్కీం, పీఎం ఆవాస్ యోజన, అబుదాబిలో దేవాలయ ప్రతిష్ఠ, మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలు మొదలైనవాటి ప్రస్తావన ఉంది. 2024లో తన ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు కార్డు ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 70 వేల కోట్ల డాలర్లకు చేరుకోవడం సహా ఆర్థిక రంగానికి సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని కూడా అందులో పొందుపరిచారు. ఆసియాలో మూడో అతిపెద్ద శక్తిగా భారత్ ఆవిర్భవించడం.. ఉపాధి కల్పన రంగంలో 4.1 కోట్ల మంది యువతకు రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ అందించడం, క్రీడల రంగంలో.. పారా-ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించడం.. పర్యావరణహితం కోరి ‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటుదాం (ఏక్ పేడ్ మా కే నామ్)’ అన్న సందేశం.. గ్రీన్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం మొదలైనవాటిని కూడా వివరించారు. సమష్టి కృషితో 2024లో అనేక విజయాలు అందుకున్నామన్నారు. 2025లో మరింత కష్టించి ‘వికసిత్ భారత్’ కలను సాకారం చేసుకుందామని తెలిపారు. కొత్త సంవత్సరం అందరికీ పురోగతి, శాంతి, ఆరోగ్యం అందిస్తుందన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తంచేశారు.