Amit Shah: డీఎంకే అవినీతికి అడ్డుకట్ట.. రాష్ట్రంలో ఉగ్రవాద సంస్థలను పెకలించాల్సిందే
ABN , Publish Date - Feb 27 , 2025 | 11:33 AM
రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాద సంస్థలను కూకటి వేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) పేర్కొన్నారు.

- ఇవన్నీ జరగాలంటే రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అవసరం
- కోయంబత్తూరులో అమిత్‌షా
చెన్నై: రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాద సంస్థలను కూకటి వేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) పేర్కొన్నారు. ఇవన్నీ జరగాలంటే రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం రావాల్సిన అవసరముందన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రాత్రి కోయంబత్తూరు చేరుకున్న అమిత్‌షా బుధవారం ఉదయం పీలమేడు ఎల్లై గార్డెన్ లో కొత్తగా నిర్మించిన బీజేపీ(BJP) కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hero Vijay: హీరో విజయ్ ధీమా.. అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర
తిరువణ్ణామలై, రామనాథపురం జిల్లాలోని పార్టీ స్థానిక శాఖ కార్యాలయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో అమిత్‌షా మాట్లాడుతూ... కోయంబత్తూరు ప్రజలకు, తమిళ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ప్రారంభించినవి పార్టీ కార్యాలయాలు కావని, స్థానిక ప్రజలకు సేవలందించే ఆలయాలని అభివర్ణించారు. అత్యంత ప్రాచీనమైన తమిళభాషలో మాట్లాడలేకపోతున్నానని, అందుకు తనను క్షమించాలని కోరారు.
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఉందని, కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒడిశా(Andhra Pradesh, Odisha)ల్లో కూటమి ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. 2025 ఆరంభమే దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిందని, ఆ కోవలోనే 2026లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం తమిళనాట అధికారంలోకి వచ్చితీరుతుందని అమిత్‌షా శపథం చేశారు.
తమిళనాట శాంతిభద్రతలు అధ్వానం
శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని, ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయం వంటి కీలకమైన ప్రాంతాల్లోనే మహిళలకు భద్రత కరువైందని అమిత్‌షా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి వెళ్లిన యువతులు తిరిగొచ్చే పరిస్థితులు ఇక్కడ లేవన్నారు. వేంగైవయల్ ఘటన జరిగిన 700 రోజులు గడిచినా నిందితులను పట్టుకోలేకపోతున్నారని, సారా ఏరులై పారుతోందన్నారు.
కల్తీసారా వ్యాపారులను విడిచిపెట్టి, ఆ వ్యాపారుల సమాచారం అందించినవారిని అరెస్టు చేసిన ఘనత డీఎంకే(DMK) ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 1998లో కోయంబత్తూరులో జరిగిన బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఇంకా దోషులను అరెస్టు చేయకపోవడం కూడా శోచనీయమర్కొన్నారు. అవినీతిలో డీఎంకే నేతలందరికీ మాస్టర్ డిగ్రీలు ప్రదానం చేయవచ్చన్నారు. తమ అవినీతి బండారం ఎక్కడ బయపడుతుందోననే భయంతో ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి రోజుకో అసత్య ప్రచారం సాగిస్తున్నారని చెప్పారు.
తాజాగా నియోజకవర్గాల పునర్విభజన పేరుతో రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు తగ్గించనున్నట్లు అసత్యమాడుతున్నారని అన్నారు. స్టాలిన్‌కు తాను సుస్పష్టంగా చెబుతున్నానని, తమిళనాటే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ ఎంపీల సంఖ్యను తగ్గించే ప్రసక్తేలేదన్నారు. ఈ సభలో కేంద్రమంత్రి ఎల్.మురుగన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఎమ్మెల్యేలు వానతి శ్రీనివాసన్, నయినార్ నాగేంద్రన్ తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?
ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ
ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!
Read Latest Telangana News and National News