Maharashtra : వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని.. మేనకోడలి రిసెప్షన్‌లో ఏం చేశాడంటే..!
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:30 PM
మేనకోడలు వేరే వాళ్లని పెళ్లి చేసుకోవడంతో రగిలిపోయిన ఓ మేనమామ.. దుర్మార్గానికి తెగబడ్డాడు. పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగొచ్చిన యువతి కోసం కుటుంబసభ్యులు ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో నానా హంగామా సృష్టించాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కసితో మేనకోడలి రిసెప్షన్‌లో ఏం చేశాడంటే..!
పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన కూతురు చెప్పాపెట్టకుండా ఎవరినో పెళ్లి చేసుకుంటే పెద్దవాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. కొందరు ఎలాగు జరిగిపోయినదాన్ని మార్చలేం అని దగ్గరకు తీసుకుంటే.. ఇంకొందుకు పరువు పోయిందని దాడి చేయడంలాంటి ఘటనలు ఎక్కడోక చోట జరుగుతూనే ఉంటాయి. ఇంచుమించూ ఇలాంటి ఘటనే ఒకటి ఇటీవల మహారాష్ట్రలో జరిగింది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన మేనకోడలు వేరే వాళ్లని పెళ్లి చేసుకోవడంతో రగిలిపోయిన ఓ మేనమామ.. దుర్మార్గానికి తెగబడ్డాడు. పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగొచ్చిన యువతి కోసం కుటుంబసభ్యులు ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో నానా హంగామా సృష్టించాడు. కోపంలో సహనం, విచక్షణ కోల్పోయి అతిథుల కోసం తయారు చేస్తున్న ఆహారంలో విషం కలిపి సామూహిక హత్యకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి అనుకోకుండా ఈ దృశ్యం చూడటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఉట్రే గ్రామంలోని మేనమామ మహేశ్ పాటిల్ ఇంట్లో పెరిగిన ఆ యువతి చెప్పా పెట్టకుండా వేరే వ్యక్తితో పారిపోయి పెళ్లిచేసుకుంది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నా కుటుంబసభ్యులు అయిష్టంగానే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహేష్ మేనకోడలు వివాహ రిసెప్షన్‌లో అల్లకల్లోలం సృష్టించాడు. కళ్యాణమండపానికి గేట్లు పడగొట్టి లోపలికి వెళ్లి ఆమె వివాహాన్ని వ్యతిరేకిస్తూ కేకలు వేశాడు. తర్వాత అతిథుల కోసం సిద్ధం చేసిన భోజనాల్లో విషం కలుపుతుండగా.. దూరం నుంచి చూసిన కొందరు వ్యక్తులు చూసి గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఇది తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, " పాటిల్ ఇంట్లో పెరిగిన యువతి గ్రామానికి చెందిన వేరే వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఇది మేనమామ పాటిల్‌కు నచ్చక కళ్యాణమండపం వద్ద వివాహ రిసెప్షన్ వేడుకను గేట్ క్రాష్ చేసాడు. అతిథుల కోసం వండిన ఆహారంలో విషాన్ని కలిపాడు. కోపంతో ఈ అరాచకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సమయానికి అసలు విషయం తెలియడంతో విషపూరితమైన ఆహారాన్ని ఎవరూ తినలేదు. వ్యక్తుల ప్రాణాలకు హాని కలిగించారనే ఆరోపణలపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.