Sankranti 2025: సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే రోజున వచ్చేది ఇందువల్లే..
ABN , Publish Date - Jan 14 , 2025 | 10:44 AM
భారతదేశంలో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో మకర సంక్రాంతి ప్రధానమైనది. ఆసేతు హిమాచలం ఒక్కో రాష్ట్రం వారు ఒక్కో పేరుతో జరుపుకుంటారు. తెలుగువారికైతే మరీ ప్రత్యేకం. అయితే, సంక్రాంతి ఇతర పండగల మాదిరిగా కాకుండా ప్రతి ఏడాదిలో ఒకే సమయంలో ఎందుకు వస్తుందో తెలుసా.. అందుకు కారణమిదే..
భారతదేశంలో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో మకర సంక్రాంతి ప్రధానమైనది. ఆసేతు హిమాచలం ఒక్కో రాష్ట్రం వారు ఒక్కో పేరుతో జరుపుకుంటారు. తెలుగువారికైతే మరీ ప్రత్యేకం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయణం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దీనిని కొత్త ఏడాదిలో తొలి వేకువగా భావిస్తారు. ఈ శుభసందర్భంగా అందరూ పాత వస్తువులను భోగి మంటల్లో తగలబెట్టి కొత్త ఆశయాలు, ఆలోచనలకు స్వాగతం పలుకుతారు. మకర సంక్రాంతి సమయంలోనే పంట కోతలు పూర్తయి ధన్యరాశులు రైతుల ఇళ్లకు చేరతాయి. అందుకు కృతజ్ఞతగా సూర్యుడితో పాటు ప్రకృతిని, పాడిపశువులను పూజిస్తారు కర్షకులు. అయితే, సంక్రాంతి ఇతర పండగల మాదిరిగా కాకుండా ప్రతి ఏడాదిలో ఒకే సమయంలో ఎందుకు వస్తుందో తెలుసా.. అందుకు కారణమిదే..
మకర సంక్రాంతి చరిత్ర
సంవత్సరంలో సూర్యుడి నెలకో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. జనవరిలో మకరరాశిలోకి అడుగుపెట్టడంతో ఉత్తరాయణ కాలం ఆరంభమవుతుంది. ఇది ఆరునెలల వరకూ ఉంటుంది. తర్వాతి ఆరు నెలలు దక్షిణాయన కాలం ఉంటుంది. నెలకో సంక్రాంతి ఉన్నా మకర సంక్రాంతినే ప్రత్యేకంగా గుర్తించడానికి కారణం..ఈ మాసం నుంచే వసంతకాలం మొదలవుతుంది. అప్పటివరకూ ఉన్న చీకట్లన్నీ తొలగిపోయి కొత్త ఆశలు, ఆశయాలు చిగురిస్తున్నాయని చెప్పేందుకు ఇదొక సూచికగా భావిస్తారు. ఇప్పటి నుంచే చాంద్రామానం అనుసరించి మాఘమాసం ఆరంభమవుతుంది.
మకర సంక్రాంతి ప్రాముఖ్యత
సూర్యుడు మకరరాశిలోకి మారడాన్ని జ్ఞానోదయం, సానుకూలతకు ప్రతీకగా నమ్ముతారు. ఈ రోజున సూర్యకిరణాలు పడేలా ఆరుబయట పొంగళ్లు చేయడం, గాలిపటాలు ఎగరేయడం, దానం, ధాతృత్వాలు, ప్రయాగ వంటి తీర్థాల్లో పుణ్యస్నానాలు చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. చీమలు, పక్షులకు ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఇంటి ముందు కల్లాపి చల్లి బియ్యపు పిండితో ముగ్గులు పెడతారు. పాతవస్తువులను భోగి మంటల్లో పడేయడం ద్వారా ఇంటిని శుభ్రపరుచుకుంటారు. బంధువులు, కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేయడం, రకరకాల పిండివంటలు చేసుకుని ఉల్లాసంగా గడుపుతారు. సంబరాలను, సంతోషాలను అందించే సంక్రాంతి ఆచారాల వెనక ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి.
ప్రతి ఏడాది అవే తేదీల్లో వచ్చేది ఇందుకే..
చలికాలం ముగింపుకు వచ్చి సూర్యకిరణాల వెచ్చదనం మొదలయ్యేద సంక్రాంతి నుంచే. ఈ సమయంలో లేలేత భానుడి కిరణాలు శరీరాన్ని తాకితే ఆయురారోగ్యాలు సొంతమవుతాయని నమ్మిక. సాధారణంగా అన్ని భారతీయ పండుగలు చాంద్రమాన క్యాలెండర్‌ను అనుసరించే నిర్ణయించబడుతాయి. అందుకే తేదీలు మారుతూ వస్తాయి. కానీ, మకర సంక్రాంతి మాత్రం సౌరమాన క్యాలెండర్ ప్రకారం వస్తుంది. అందువలన, ప్రతి సంవత్సరం నిర్ణీత తేదీలోనే జరుపుకుంటారు.