BCCI: బీసీసీఐకి భారీగా బొక్క పెట్టిన స్టార్ బ్యాటర్.. ఖర్చు తడిసి మోపెడు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:56 PM
Team India: భారత క్రికెట్ బోర్డుకు కొందరు స్టార్లు భారీగా బొక్క పెట్టారనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బోర్డుకు ఖర్చు తడిసి మోపెడు అయ్యేలా చేశారట. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

భారత క్రికెట్ ఎన్నడూ లేనంతగా ఈ మధ్య తెగ వార్తల్లో నిలిచింది. దానికి వరుస ఓటములు ఒక కారణమైతే, మరొకటి ఆటగాళ్ల వ్యవహార శైలి అనే చెప్పాలి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో భారత్ దారుణ పరాభవాలు మూటగట్టుకుంది. ఈ రెండు సిరీస్‌ల్లో అట్టర్ ఫ్లాప్ అయిన కొందరు సీనియర్లు జట్టులో నుంచి తప్పుకోకుండా పట్టుకొని వేలాడటం కూడా వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కంగారూ సిరీస్ ఓటమితో టెస్టుల్లో టీమిండియా ప్రతిష్ట మసకబారింది. ఎన్నో డిస్కషన్స్, కాంట్రవర్సీలకు దారితీసిన ఈ సిరీస్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఇష్టానుసారం..
భారత క్రికెట్ బోర్డుకు కొందరు సీనియర్లు భారీగా బొక్క పెట్టారనే ప్రచారం నడుస్తోంది. బోర్డుకు ఖర్చు తడిసి మోపెడు అయ్యేలా చేశారట బడా స్టార్లు. ఆసీస్ టూర్‌లో అవసరం లేకపోయినా కొందరు ఆటగాళ్లు భారీగా లగేజీలు తీసుకెళ్తూ బోర్డు ఖజానాకు లక్షల్లో నష్టం కలిగించారట. ఒక ఆటగాడైతే ఏకంగా 250 కిలోల విలువైన లగేజీని ఆ టూర్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చాడట. ఆ పర్యటనలో 27 బ్యాగుల్ని తనతో ఉంచుకున్నాడట. అందులో కొన్ని బ్యాగులు అతడి ఫ్యామిలీకి చెందినవైతే, మరికొన్ని అసిస్టెంట్స్‌వని తెలుస్తోంది. ఇందులో అతడి సొంత లగేజీ 17 బ్యాగులు అని సమాచారం.
ఒక్కడు చేసిన తప్పుకు..!
ఆస్ట్రేలియాలో 5 టెస్టులు ఆడింది భారత్. అందులో భాగంగా ప్రతి మ్యాచ్‌కు ఒక సిటీ నుంచి మరో సిటీకి ప్రయాణించారు ఆటగాళ్లు. ఈ సమయంలో వాళ్ల లగేజీని కూడా తమతో పాటే తీసుకెళ్లారు. సదరు స్టార్ ప్లేయర్ కూడా తన భారీ లగేజీని క్యారీ చేశాడట. భారీ మొత్తంలో ఉన్న అతడి లగేజీ కోసం బీసీసీఐ లక్షల్లో చార్జీలు కట్టిందని సమాచారం. అప్పట్లో ఏ రూల్ లేకపోవడంతో బోర్డుకు డబ్బులు కట్టడం తప్ప వేరే మార్గం లేకపోయిందని.. ఖర్చు తడిసి మోపెడు అయ్యిందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అతడితో పాటు పలువురు స్టార్లు ఇలా భారీగా లగేజీని తీసుకెళ్తూ బోర్డుకు పంగనామం పెట్టారట. దీంతో అలర్ట్ అయిన బీసీసీఐ పెద్దలు ఈ సిరీస్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పలు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఇక మీదట ఏ ఆటగాడైనా 150 కిలోల కంటే ఎక్కువ లగేజీ తీసుకెళ్లొద్దు. ఒకవేళ తీసుకెళ్తే అతడే ఆ డబ్బుల్ని భరించాలని ఆదేశించింది. ఒక్కడు చేసిన పని వల్లే ఇప్పుడు మొత్తం జట్టు కొత్త రూల్‌కు తలవంచక తప్పలేదని వినిపిస్తోంది.
ఇవీ చదవండి:
‘చాంపియన్స్’ విజేతకు రూ.19.40 కోట్లు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి