IPL 2025: ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్‌కు బిగ్ షాక్.. ఇక ట్రోఫీ గురించి మర్చిపోవాల్సిందే
ABN , Publish Date - Feb 04 , 2025 | 08:30 AM
Rajasthan Royals: ఐపీఎల్-2025కు సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెలలోనే కొత్త సీజన్ షురూ కానుంది. ఈ తరుణంలో పాపులర్ ఫ్రాంచైజీల్లో ఒకటైన రాజస్థాన్ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

భారత ఆటగాళ్లు వరుస టోర్నీలతో బిజీ అవుతున్నారు. రీసెంట్‌గా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడిన టీమిండియా క్రికెటర్లు.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత తక్కువ గ్యాప్‌లో చాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్‌కు పయనమవుతారు. ఆ టోర్నీ అనంతరం ఐపీఎల్ ఫ్రాంచైజీలతో జాయిన్ అవనున్నారు భారత స్టార్లు. క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్ వచ్చే నెలలోనే స్టార్ట్ కానుంది. మార్చి 21వ తేదీన మొదలయ్యే మెగా లీగ్.. మే 25వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఎక్కువ టైమ్ లేకపోవడంతో చాలా జట్లు ప్రిపరేషన్స్ మొదలుపెట్టేశాయి. కప్పు కొట్టడమే టార్గెట్‌గా వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ తరుణంలో పాపులర్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
అసలైనోడే దూరం!
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్‌లో ఆడటం అనుమానంగా మారింది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొన్న సంజూ.. ఆఖరి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. అతడి చూపుడు వేలికి ఇంజ్యురీ అయింది. ఇంగ్లీష్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి వచ్చి బలంగా తాకడంతో సంజూ చూపుడు వేలు విరిగిపోయినట్లు సమాచారం. సుమారుగా 150 కిలోమీటర్ల భీకర వేగంతో వచ్చిన బంతి శాంసన్ కుడి చేతి గ్లవ్‌కు గట్టిగా తాకింది. దీంతో వెంటనే ఫిజియో గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చి అతడికి ట్రీట్‌మెంట్ అందించాడు. నొప్పి తగ్గకపోయినా అలాగే బ్యాటింగ్ కంటిన్యూ చేసిన శాంసన్.. మరో సిక్స్, ఫోర్ కొట్టి పెవిలియన్ బాట పట్టాడు.
రీఎంట్రీ అప్పుడే..
ఆర్చర్ బౌలింగ్‌లో తాకిన దెబ్బకు ఫిజియో ట్రీట్‌మెంట్ అందించినా సంజూ కోలుకోలేదని తెలుస్తోంది. గాయం తగ్గకపోగా చేతికి వాపు పెరిగిందట. స్కానింగ్‌లో అతడి వేలు ఫ్రాక్చర్ అయినట్లు తేలిందని సమాచారం. దీంతో తిరువనంతపురంలోని తన ఇంటికి అతడు వెళ్లిపోయాడట. ఇంజ్యురీ నుంచి కోలుకొని కమ్‌బ్యాక్ ఇవ్వడం కోసం త్వరలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్‌కు శాంసన్ వెళ్లనున్నాడని తెలుస్తోంది. కంప్లీట్‌గా రికవర్ అయ్యాకే అతడు తిరిగి ప్రాక్టీస్ మొదలుపెడతాడని వినిపిస్తోంది. అతడు కోలుకునేందుకు కనీసం 5 నుంచి 6 వారాలు పట్టొచ్చని బీసీసీఐ వర్గాల సమాచారం. ఐపీఎల్ ఆరంభానికి ఇంకా నెలన్నర టైమ్ ఉంది. ఈలోపు అతడు రికవర్ అయితే ఓకే. ఒకవేళ గాయం తీవ్రత మరింత పెరిగినా.. ఫిట్‌నెస్ సాధించడంలో ఆలస్యం అయినా, బ్యాటింగ్ రిథమ్ పోయినా రాజస్థాన్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు.
ఇదీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి