Share News

CM Revanth Reddy: ట్రిపుల్ ఆర్‌ భూసేకరణపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Jan 03 , 2025 | 08:56 PM

CM Revanth Reddy: గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించిందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశామని ఉద్ఘాటించారు..

CM Revanth Reddy: ట్రిపుల్ ఆర్‌ భూసేకరణపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
CM Revanth Reddy

హైదరాబాద్: రీజనల్​ రింగ్​ రోడ్డు, ఆర్ అండ్​బీ, నేషనల్​ హైవే ప్రాజెక్టులపై అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రీజనల్​ రింగ్​ రోడ్‌కు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాగ్ పూర్-విజయవాడ కారిడార్‌కు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీశాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అటవీశాఖ, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, రెండు శాఖల్లో ఒక్కో అధికారిని ఇందుకు ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. రెండు శాఖలు సమావేశమై సంబంధిత శాఖల పరిధిలోని భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డు వెడల్పు ఉండే విధంగా డిజైన్ చేయాలని సూచించారు. కొత్త గ్రామపంచాయతీలతో సహా ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాల్సిందేనని ఆదేశించారు. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏ గ్రామానికి రోడ్డు లేదనే మాట వినబడొద్దని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు.


కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించింది..

గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించిందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశామని ఉద్ఘాటించారు.. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం కష్టకాలంలో బాధ్యతలు చేపట్టిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలుసునని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప అవకాశం తమ ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల మొదటి తేదీన జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. తమ ప్రభుత్వంపై ఆధారపడి ప్రజల కోసం పనిచేసే వారికి ప్రతీ నెలా మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నామన్నారు. అక్కడక్కడా కొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు.


ఆదాయం సరిపోవడంలేదు..

‘‘ప్రతీ నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.18500 కోట్లు. ఇది ప్రభుత్వ అవసరాలకు సరిపోవడం లేదు. అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే రూ.30వేల కోట్లు కావాలి. వచ్చే ఆదాయంలో రూ.6500కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నాం. మరో రూ. 6500 కోట్లు ప్రతీ నెల అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి. మిగిలిన రూ. 5500 కోట్లలో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి. కనీస అవసరాలకు ప్రతీ నెల రూ. 22500 కోట్లు కావాలి. వచ్చిన ఆదాయంతో పోలిస్తే రూ.4000 కోట్లు తక్కువ పడుతోంది. సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులే. మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చాం. ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం

‘‘ప్రభుత్వ ఆదాయం ప్రతీ నెలా మరో రూ.4000 కోట్లు పెంచుకోవాలి. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం మనది…ఆదాయాన్ని పెంచాలన్నా, పెంచిన ఆదాయం పంచాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీ సమస్యలు చెప్పండి… పరిష్కారానికి కార్యాచరణ చేపడతాం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తుంది. సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలే చేయాల్సిన అవసరం లేదు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారు. వారి ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది మీరే. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మాకు ఉన్నా చేయలేని పరిస్థితి. సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్. ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవకాశం లేకపోయినా రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మీ సహకారం కావాలి. మీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. మిమ్మల్ని కష్టపెట్టి మీకు నష్టం కలిగే పనులు మా ప్రభుత్వం చేయదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందే: ఎమ్మెల్సీ కవిత డిమాండ్..

Bhatti Vikramarka: ఆ ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుంది: డిప్యూటీ సీఎం భట్టి..

TG News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 09:10 PM