Share News

Miss World:తెలంగాణ గురించి ప్రపంచానికి చాటి చెప్పేలా మిస్ వరల్డ్ పోటీలు: మంత్రి జూపల్లి కృష్ణారావు

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:11 PM

Minister Jupally Krishna Rao: మిస్ వరల్డ్ పోటీల ద్వారా నిరంతరంగా పర్యాటక రంగానికి సంబంధించి రాబడి పెరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ పోటీలతో ప్రపంచ పర్యాటకులను ఆకర్షించగలమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Miss World:తెలంగాణ గురించి ప్రపంచానికి చాటి చెప్పేలా మిస్ వరల్డ్ పోటీలు: మంత్రి జూపల్లి కృష్ణారావు
Miss World 2025 Hyderabad

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా 72వ అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ అందాల పోటీల్లో సుమారు 140 దేశాలకు సంబంధించిన అందాల భామలు పాల్గొననున్నారు. ఈక్రమంలో బేగంపేట్ టూరిజం ప్లాజాలో ఇవాళ(గురువారం) మిస్ వరల్డ్ పోటీలకు చెందిన ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి అందాల భామలు వస్తారని తెలిపారు.


ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా..

తెలంగాణ గురించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇది మంచి అవకాశమని మంత్రి జూపల్లి కృష్ణారావు అభివర్ణించారు. ఈ పోటీల్లో పాల్గొనే వారితో పాటు వేలాది మంది దేశ విదేశాలకు చెందిన వారు తెలంగాణకు వస్తారని అన్నారు. ఈ వేదిక వల్ల నిరంతరంగా పర్యాటక రంగానికి సంబంధించి రాబడి పెరుగుతుందని తెలిపారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించగలమని అన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.54 కోట్లు పెట్టుబడి పెట్టామని చెప్పారు. అందులో సగమే ప్రభుత్వం కేటాయిస్తుందని..మరో సగం ప్రమోటర్‌ల నుంచి సేకరిస్తామని స్పష్టం చేశారు. ఇది చరిత్రాత్మక కార్యక్రమమని.. సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ నెలవు అని వ్యాఖ్యానించారు. మహిళల అంతః సౌందర్యాన్ని సెలబ్రేట్ చేయడం మిస్ వరల్డ్ పోటీల ఉద్దేశమని అన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర గొప్పదని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.


తెలంగాణలో మహిళలకు అన్ని రంగాల్లో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, పర్యాటక అందాలను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పుకొచ్చారు. సౌత్ కొరియా స్క్విడ్ గేమ్, బీటీఎస్ బ్యాండ్ లాంటివి దేశ ఎకానమీకి ఎంతో ఉపయోగపడ్డాయని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ పెరు ప్రఖ్యాతులతో పాటు ఆర్ధికంగానూ వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ఈ అందాల పోటీలను మహిళా సాధికారతకు ప్రతీకగా చూడాలని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు, రాజకీయ కోణంలో ఈ పోటీలను చూడటం సరికాదని మంత్రి జూపల్లి కృష్ణారావు హితవు పలికారు.


భారతదేశానికి చాలా ప్రాధాన్యత ఉంది: క్రిస్టినా పిజ్కోవా

బేగంపేట్ టూరిజం ప్లాజాలో ఇవాళ జరిగిన ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పాల్గొని సందడి చేశారు. నమస్తే ఇండియా అంటూ 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పలకరించింది. అతిథులు చాలా గొప్పగా స్వాగతం చెప్పారని అన్నారు. తన ప్రయాణంలో, తన హృదయంలో భారతదేశానికి చాలా ప్రాధాన్యత ఉందని తెలిపారు. భారత కల్చర్, ఆర్ట్స్ చాలా గొప్పగా ఉంటాయని వివరించారు. భారతదేశం చాలా ఇన్‌స్పైరింగ్ అని తెలిపారు. భారత్ విలువలను బోధిస్తుందని.. భిన్నత్వంలో ఏకత్వానికి ఎంతో గొప్ప భావన ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నో భాషలు ఉన్నా అంత ఒక్కటిగా ఉండటం భారతదేశం స్ఫూర్తి అని తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలు కూడా అంతే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని చెప్పారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించడం మంచి అనుభూతిని ఇచ్చిందని క్రిస్టినా పిజ్కోవా పేర్కొన్నారు.


తెలంగాణలో గొప్ప కట్టడాలు: స్మితా సభర్వాల్‌‌

1smitha.jpg

తెలంగాణ త్రిలింగ దేశంగా ప్రాముఖ్యత కలిగిందని సీనియర్ ఐఏఎస్, తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌‌ తెలిపారు. ఈ ప్రాంతానికి 2500 ఏళ్ల చరిత్ర ఉందని ఉద్ఘాటించారు. రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్లలో ఎంతో వృద్ధి సాధించామని చెప్పారు. రామప్ప, వేయి స్థంభాల ఆలయం, చార్మినార్, గోల్కొండ కోట లాంటి ఎన్నో గొప్ప కట్టడాలు ఇక్కడ ఉన్నాయని అన్నారు. మే నెలలో జరుగనున్న మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ సంస్కృతి ప్రతిభింభించేలా నిర్వహించనున్నామని చెప్పారు. మెడికల్ టూరిజంలో తెలంగాణకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. సినిమా, ఆహార రంగాల్లో తెలంగాణకు పెట్టింది పేరని చెప్పారు. అత్యంత సురక్షిత పర్యాటక ప్రాంతం తెలంగాణ అని స్మితా సభర్వాల్‌‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vishnupriya Questioned By Police: పోలీసుల విచారణకు విష్ణుప్రియ.. ఏం అడిగారంటే

Medak: దొంగ బాబా అరెస్టు.. మహిళలకు మత్తుమందు ఇస్తూ.. వీడి అరాచకం మాములుగా లేదు..

Harish Rao Big Relief: హరీష్‌రావుకు భారీ ఊరట.. కేసు కొట్టివేత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 20 , 2025 | 03:27 PM