Minister Ponnam Prabhakar: ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాయి.. మంత్రి పొన్నం ధ్వజం
ABN , Publish Date - Jan 06 , 2025 | 08:19 AM
Minister Ponnam Prabhakar: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు.
సిద్దిపేట జిల్లా: రైతు రుణమాఫీపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అబద్ధాలు చెబుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ కాని రైతులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంలోపే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ(సోమవారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఉపాధి హామీకి సంబంధించి కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీపై ఉమ్మడిగా దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతుల చావుకు కారణం అయింది బీజేపీ కాదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
బీజేపీ నేతలకు ఛాలెంజ్ చేస్తున్న తాము అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని నిలదీశారు. రైతు భరోసా రూ. 12000 ఇస్తామంటే బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తాము ఇచ్చిన హామీలు క్రమ క్రమంగా అమలు చేస్తున్నామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు, రాష్ట్ర ప్రజలు దయచేసి తమ ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు తాము చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీల్లోని నేతలు తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా చేసుకున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం రూ.12000 రైతు భరోసాకు ఇస్తుందని గుర్తుచేశారు. రైతులపై ప్రేమ ఉంటే ఇంకేమైనా డబ్బులు కలిపి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తాం..
హుస్నాబాద్‌లో క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో ఇవాళ(సోమవారం) మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. పట్టణ ప్రజలతో కలిసి పలు వీధుల గుండా నడుస్తూ ఎల్లమ్మ చెరువు వరకు మార్నింగ్ వాక్ చేశారు. పిల్లలు, వృద్ధులతో ముచ్చటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం నడక అలవాటు చేసుకోవాలని సూచించారు. పిల్లలు ఉదయమే లేవడం అలవాటు చేసుకుంటే సమయ పాలన పాటించడం ,క్రమశిక్షణ లక్ష్య సాధనలో ఉపయోగపడుతుందని అన్నారు. అక్కడే ఉన్న క్రీడాకారులు స్విమ్మర్స్‌తో ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రతి క్రీడలో హుస్నాబాద్ విద్యార్థులే రాణించాలని ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని. క్రీడాకారులు తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఏపీ, తెలంగాణ కలిసి ప్రపంచంతో పోటీ పడాలి
KTR: నమ్మక ద్రోహం కాంగ్రెస్ నైజం
Bhatti Vikramarka: గురుకుల విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం
Read Latest Telangana News and Telugu News