Nara Lokesh:ఎన్టీఆర్ అంటే ప్రభంజనం.. నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:29 AM
Nara Lokesh: సినిమాలు, రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. తెలుగు వాళ్లను గతంలో మద్రాసీలు అనేవారని.. వాళ్లందరికీ తెలుగు వారమని గర్వంగా చెప్పుకునేలా ఎన్టీఆర్ చేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.

హైదరాబాద్: తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళి అర్పించారు. అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఉందని అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని చెప్పారు. ఈనెలాఖరు నుంచి రాజధాని అమరావతి పనులు ఊపందుకుంటాయని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం చేస్తామని ఉద్ఘాటించారు. ఏపీ, తెలంగాణ సీనియర్ నేతల సూచనలతో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పారు. పార్టీని ఏ సంకల్పంతో ఏర్పాటు చేశారో.. అదే సంకల్పంతో ముందుకు తీసుకెళ్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఎన్టీఆర్ కేవలం మూడు అక్షరాలు కాదు.. అదొక ప్రభంజనమని అన్నారు. సినీ రంగంలో అన్ని రకాల సినిమాలు తీసి.. ఆయన మార్క్ చూపించారని చెప్పారు. రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ ఎన్నో సేవలు చేశారని గుర్తుచేశారు. రూ. 2లకే కిలో బియ్యం అందించారని తెలిపారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. తెలుగు వాళ్లను గతంలో మద్రాసీలు అనేవారని.. వాళ్లందరికీ తెలుగు వారమని గర్వంగా చెప్పుకునేలా ఎన్టీఆర్ చేశారని అన్నారు. ఏదైనా తప్పు జరిగితే.. దానిని సరిదిద్దడానికి పార్టీలో పెద్దలు ఉన్నారని అన్నారు. తన చిన్నతనంలో తాతయ్య ఆబిడ్స్‌లో ఉండేవారని గుర్తుచేసుకున్నారు. మనుమళ్లు, మనమరాళ్లను కారులో తీసుకుని స్వయంగా ఆయనే డ్రైవ్ చేస్తూ గండిపేట్ తీసుకెళ్లేవారని అన్నారు. అది తనకు ఎప్పుడూ గుర్తుండి పోయే మెమరీ అని చెప్పారు. తెలంగాణలోనూ టీడీపీపై ప్రజలకు ఎంతో ప్రేమ ఉందన్నారు. అందుకు ఉదాహరణ స్వచ్చందంగా లక్షా 60వేల సభ్యత్వాలు ప్రజలు తీసుకోవడమని గుర్తుచేశారు. ఆనాడు తెలుగు ప్రజలంతా కలిసి కొట్లాడి విశాఖ ఉక్కు కర్మాగారం తెచ్చుకున్నారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
NTR Death Anniversary:ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు: నందమూరి బాలకృష్ణ
Chandrababu's Achievements : జగన్ మాటలు.. బాబు చేతలు!
NTR Death Anniversary: తెలుగుదనానికి ప్రతిరూపం ఎన్టీఆర్ : మంత్రి నారా లోకేష్
Read Latest AP News and Telugu News