ఆ 8 మంది పరిస్థితి ఆశాజనకంగా లేదు
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:39 AM
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల భయానక పరిస్థితి ఉంది. సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని ప్రాణాలతో క్షేమంగా తీసుకొచ్చే విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదు’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

చిక్కుకున్న వారిని పేర్లతో పిలిచినా వారి నుంచి స్పందన రావడం లేదు
టన్నెల్ లోపల భయానక పరిస్థితి.. 23-25 అడుగుల మేర శిథిలాలు
ఆ 42 మంది అదృష్టవంతులు.. నీళ్లతో సహాయక చర్యలకు ఆటంకాలు
ప్రధాని మోదీ, రాహుల్, సీఎం రేవంత్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు
ప్రమాదాన్ని బీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలకు వాడొద్దు: ఉత్తమ్, జూపల్లి
నాగర్‌కర్నూలు/అచ్చంపేట/దోమలపెంట/హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల భయానక పరిస్థితి ఉంది. సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని ప్రాణాలతో క్షేమంగా తీసుకొచ్చే విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదు’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయానికి ప్రమాదస్థలికి 100 అడుగుల సమీపానికి వెళ్లారని, చిక్కుకున్న వారిని పేర్లతో పిలిచినా.. స్పందన లేదన్నారు. ‘‘సొరంగంలో అంతా భయంకరంగా ఉంది. శిథిలాలు 23-25 అడుగుల మేర ఉన్నాయి. కేవలం 4-5 అడుగుల మేర పైభాగం మిగిలి ఉంది. చిక్కుకుపోయిన వారి పరిస్థితి ఏమిటనేది ఇప్పుడప్పుడే చెప్పలేం. ఓ ఆశతో ఉన్నాం. కానీ, పరిస్థితులు ఆశాజనకంగా లేవు. లోపలికి వెళ్లి చూసిన నాకు ఒక్కటే అనిపించింది. బయటకు వచ్చిన 42మంది కార్మికులు అదృష్టవంతులు అని. వారంతా నీటిలో ఈదుతూ బయటకు వచ్చారు’’ అని వివరించారు. ఆదివారం స్వయంగా టన్నెల్‌లోనికి వెళ్లిన జూపల్లి.. అక్కడ ఏడెనిమిది గంటలపాటు ఉన్నారు. బయటకు వచ్చాక ఎక్సైజ్ కమిషనర్ ఇ.శ్రీధర్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా పరిస్థితిని మీడియాకు వివరించారు. టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడడానికి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోందని మంత్రులిద్దరూ చెప్పారు.
ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఇతర ఏజెన్సీలు సమష్టిగా సహాయక చర్యలు చేపడుతున్నాయని వివరించారు. ‘‘నీటిని తొలగించే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. కార్మికుల కోసం ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి, తెలుసుకుంటున్నారు. సీఎం రేవంత్, సీఎస్ శాంతికుమారి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా శనివారం రాత్రి నుంచి ఎప్పటికప్పుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రమాద స్థలంలో పరిస్థితి గంభీరంగా ఉంది. నీటి నిల్వలను, ఊటను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నీటి తీవ్రత ధాటికి టన్నెల్ బోరింగ్ మెషీన్ కొట్టుకొచ్చింది. టన్నెల్‌లో మట్టి దిబ్బలను తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం. ప్రమాద స్థలికి భారీ యంత్రాలను తీసుకెళ్లడం కుదరడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. టన్నెల్ ప్రమాదాన్ని బీఆర్‌ఎస్ నాయకత్వం రాజకీయం చేస్తోందని, పదేళ్లుగా ఆ పార్టీ ఎస్‌ఎల్‌బీసీని నిర్లక్ష్యం చేయడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్వహణ కంటే.. కమీషన్లపై ఆలోచన చేసే బీఆర్‌ఎస్ ఇప్పుడు చిల్లర రాజకీయాలకు ప్రమాదాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. టన్నెల్ నిర్మాణంలో లీకేజీల ప్రమాదం ఎప్పుడూ ఉంటుందని, వారి హయాంలో కూడా లీకేజీలు జరిగాయన్నారు. ఈ ఘటనపై జూపల్లి కృష్ణారావు వేరుగా ఓ పత్రికాప్రకటనను విడుదల చేశారు. ‘‘ఎస్‌ఎల్‌బీసీ పనులు 2007లో ప్రారంభమయ్యాయి. బీఆర్‌ఎస్ తన పదేళ్ల పాలనలో కనీసం 10 మీటర్ల సొరంగాన్ని కూడా తవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే.. ఎస్‌ఎల్‌బీసీపై దృష్టి సారించాం. ఇప్పుడు ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం’’అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మానవ తప్పిదం గానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం గానీ లేవన్నారు. నీటిని తోడి, బురదను తొలగించేవరకు సహాయక చర్యలకు ఇబ్బందులు కొనసాగుతాయన్నారు. ఈ సమయంలో బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.