Share News

MANDA KRISHNA MADIGA: చంద్రబాబు ఆ పదవి ఆఫర్ చేశారు.. మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 05 , 2025 | 09:18 PM

MANDA KRISHNA MADIGA: సాధించిన వర్గీకరణను అమలు కాకుండా కొంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. రాజకీయ పార్టీల ప్రధాన నాయకులతో తనకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయని తెలిపారు . తన జాతి బిడ్డల కోసమే తన వ్యక్తిగత సంబంధాలు ఉపయోగపడ్డాయని మంద కృష్ణ మాదిగ అన్నారు.

MANDA KRISHNA MADIGA: చంద్రబాబు ఆ పదవి ఆఫర్ చేశారు.. మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు
MANDA KRISHNA MADIGA

సిద్దిపేట జిల్లా: బీసీ వర్గీకరణ జరిగినప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగడం న్యాయమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఇవాళ(ఆదివారం) గజ్వేల్ పట్టణంలో ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ , ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. సాధించిన వర్గీకరణను అమలు కాకుండా కొంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 30 ఏళ్లుగా అలుపెరగకుండా పోరాటం చేసి సాధించుకున్న వర్గీకరణను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీల ప్రధాన నాయకులతో తనకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయని తెలిపారు . తన జాతి బిడ్డల కోసమే తన వ్యక్తిగత సంబంధాలు ఉపయోగపడ్డాయన్నారు. 1998లోనే తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపీగా చేసే అవకాశం కల్పించిన.. తాను నిరాకరించానని మంద కృష్ణ మాదిగ గుర్తుచేశారు.


30 ఏళ్ల పోరాటంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కోని ముందుకెళ్లామని చెప్పారు. ఏపీలోనీ మాదిగ పల్లెలో సీఎం చంద్రబాబు పర్యటనలో చిన్న పిల్లలతో మాట్లాడుతూ బాగా చదువుకోండి త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నానని చెప్పారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో తాను లేను.. కానీ అందరితో సంబంధాలు ఉన్నాయని అన్నారు. తన జాతి బాగుకోసమే తాను సంబంధాలు ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. జనాభాలో మాదిగలు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారన్నారు. 30 ఏళ్లలో తాను ఏ రాజకీయ పార్టీ కండువా వేసుకోలేదని స్పష్టం చేశారు. తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు.. సానుకూలం కాదని అన్నారు. పదవులు ముఖ్యం కాదని తన ప్రయాణం కొనసాగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే తన జాతికి న్యాయం జరుగుతుందనే తాను పోరాటం చేస్తున్నానని అన్నారు. నాలుగేళ్లు వర్గీకరణ అమలు జరిగినప్పుడే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. 1997లో వర్గీకరణ జరిగిందని.. రెండు నెలల్లోనే దానిని రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత మళ్లీ ఐదేళ్లు వర్గీకరణ అమలు జరిగితే దానిని 2004లో మళ్లీ రద్దు చేయించారని మంద కృష్ణ మాదిగ వాపోయారు.


2023లో ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆనందం ఆవిరి చేసే కుట్రలు ఇప్పుడు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా అంతిమ విజయం తమదేనని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. ఇచ్చిన మాట నిలుపుకోకుండా కమిషన్‌ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా వర్గీకరణ అంశం ఉందని తెలిపారు. మాలల ఒత్తిడితోనే వర్గీకరణ అమలు జరగడం లేదన్నారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులను తెరచాటున ఉన్న వాళ్లు నేడు ముందుకు వచ్చి అడ్డుకుని తీరుతామని ప్రకటిస్తున్నారని అన్నారు. వచ్చే నెల 2వ తేదీన లక్ష డప్పులతో హైదరాబాద్ దద్దరిల్లెలా భారీ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. డప్పు మాదిగల సంస్కృతికి వాయిద్యమని.. తమకు ఎస్సీ వర్గీకరణ అనివార్యమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: సీఎం రేవంత్ పచ్చి అబ్బద్దాలు మాట్లాడుతున్నారు.. కేటీఆర్ ధ్వజం

Dr. Lakshman: కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వం..: ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

KTR: మోసానికి మారు పేరు కాంగ్రెస్: కేటీఆర్

HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 05 , 2025 | 09:25 PM