Share News

JC Diwakar Reddy: రైతుల పొట్టకొడుతున్న వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-10-27T17:20:37+05:30 IST

వైసీపీ ప్రభుత్వం రైతుల పొట్టకొడుతోందని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ( JC Diwakar Reddy ) అన్నారు.

JC Diwakar Reddy:  రైతుల పొట్టకొడుతున్న వైసీపీ ప్రభుత్వం

అనంతపురం: వైసీపీ ప్రభుత్వం రైతుల పొట్టకొడుతోందని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ( JC Diwakar Reddy ) అన్నారు. శుక్రవారం నాడు హెచ్ఎల్‌సీకి రావాల్సిన నీటి కేటాయింపులపై ఎస్.ఈ రాజశేఖర్‌ను కలిసి సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా జేసీ దివాకర‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘ Hlc కాలువల్లో నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జలవనరుల శాఖ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. నీరు లేకపోతే ఇసుక అమ్ముకోవచ్చని జగన్‌రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం కోసం వైసీపీ నేతలు రైతులను నాశనం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వాన్ని నీరు అడగడం లేదు. వేసిన పంటల్లో పెట్టుబడి కూడా రైతులకు రావడం లేదు. రైతులు అప్పులు చేసి పంటలు వేశారు. వర్షాలు పడినప్పుడు ఉన్న నీరుని పై అధికారులు చెప్పితేనే నీళ్లు వదిలామని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. టీడీపీ హయాంలో అధికారులతో మీటింగ్ పెట్టుకొని మాట్లాడేవాళ్లం.. కర్ణాటక ప్రభుత్వంతో సమావేశం ఏర్పాటు చేసి నీరు వచ్చేలా అధికారులతో మాట్లాడేవాళ్లం. నేను రాజకీయంగా అడగడం లేదు.. ఎన్నికల్లో నిలబడటం లేదు.. రైతుల అవస్థలు చూసి అధికారుల వద్దకు వచ్చా. సీఎం జగన్మోహన్‌రెడ్డికి నీటి సమస్యను తీసుకెళ్లే నాయకుడు వైసీపీలో లేరు. తాము అధికారంలో ఉన్నపుడు సీఎంకి నేరుగా చెప్పి రైతుల సమస్యలు పరిష్కరించేవాళ్లం. రైతుల కోసం వారు పడుతున్న ఇబ్బందులు చూసి నడవడానికి శక్తి లేకపోయినా అధికారుల వద్దకు వచ్చా’’ అని జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-27T17:20:37+05:30 IST