Share News

Devineni Uma: దొంగ, నేరస్తుడు సీఎం అయితే పోలీస్ యంత్రాంగం కూడా ముద్దాయిగానే మారుతుంది

ABN , First Publish Date - 2023-12-01T20:11:03+05:30 IST

దొంగ, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే పోలీస్ యంత్రాంగం కూడా ముద్దాయిగా మారుతుందనడానికి నాగార్జున సాగర్ నీటి వివాదమే నిదర్శనంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) వ్యాఖ్యానించారు.

Devineni Uma: దొంగ, నేరస్తుడు  సీఎం అయితే పోలీస్ యంత్రాంగం కూడా ముద్దాయిగానే మారుతుంది

అమరావతి: దొంగ, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే పోలీస్ యంత్రాంగం కూడా ముద్దాయిగా మారుతుందనడానికి నాగార్జున సాగర్ నీటి వివాదమే నిదర్శనంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘మంత్రి రాంబాబు మాలలో ఉండి ఇంగితం లేకుండా అబద్ధాలు చెబుతూ మీసాలు తిప్పుతున్నాడని చెప్పారు. భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే జరగబోయే పరిణామాలకు జగన్‌రెడ్డే బాధ్యుడని అన్నారు. చంద్రబాబు హాయాంలో రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత ఖర్చుపెట్టి ఎన్ని ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామో ధైర్యంగా చెప్పగలమని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

54 నెలల్లో జగన్‌రెడ్డి ఇరిగేషన్ రంగానికి ఏం వెలగబెట్టాడో చెబుతూ, వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయగలడా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఖర్చుపెట్టామంటున్న రూ.25వేల కోట్లలో రూ.10 వేలకోట్లు జీతభత్యాలకు పోతే.. 15వేలకోట్లు తన మంత్రులు.. తన బినామీల కంపెనీలకు జగన్‌రెడ్డి దోచిపెట్టాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేసుల్లో వాదనలు వినిపించడానికి ఢిల్లీ లాయర్లకు వందలకోట్లు ఖర్చుపెట్టే జగన్‌రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన కృష్ణాజలాలపై అపెక్స్ కౌన్సిల్లో వాదనలకోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. జగన్‌రెడ్డి అసమర్థత చేతగానితనం వల్లే శ్రీశైలం డ్యామ్ నుంచి పక్క రాష్ట్రం నీళ్లు తరలించుకుపోయిందని మండిపడ్డారు. శ్రీశైలం నుంచి నీళ్లు దొంగిలిస్తున్నా, రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా నోరెత్తని జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి కాడా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై ఉన్న కుళ్లుబోతుతనంతోనే జగన్‌రెడ్డి పట్టిసీమ పంపులు ఆన్ చేయలేదని పేర్కొన్నారు. అయిపోయిన పెళ్లికి మంగళవాయిద్యాలు వాయించినట్టు అవుకు టన్నెల్‌ను జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేసి సాక్షి పత్రికలో తప్పుడు రాతలు రాయించాడని దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవ చేశారు.

Updated Date - 2023-12-01T20:11:05+05:30 IST