Somireddy: మద్యం అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోంది
ABN , First Publish Date - 2023-10-08T22:26:09+05:30 IST
మద్యం అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(Somireddy Chandramohan Reddy) ఆరోపించారు.
అమరావతి: మద్యం అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. ఆదివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ మద్యం అమ్మకాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భారీగా మద్యాన్ని దోపిడీ చేస్తూ.. నాసిరకం మద్యం ద్వారా ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ప్రాణాలు తీస్తూ.. దోపిడీ చేస్తూ జగనన్న సురక్షా అంటూ ప్రజల వద్దకు వెళ్తారా..? ఏపీలో జరుగుతోన్న మద్యం కుంభకోణంపై విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిని కోరారు. మోదీ డిజిటల్ ఇండియా అంటుంటే.. జగన్ క్యాష్ ఏపీ.. క్యాష్ ఏపీ అంటున్నారు. ప్రతేడాది మద్యం అమ్మకాల్లో ఏడు వేల కోట్లకు లెక్కలు ఉండడం లేదు. నాలుగేళ్లల్లో రూ. 28 వేల కోట్ల మేర మద్యం అమ్మకాలకు లెక్కలు లేవు. ఏపీ ఎక్సైజ్ లిక్కర్ సేల్స్ వెబ్‌సైట్ ఎందుకు మూసేశారు..? ఢిల్లీ మద్యం కుంభకోణం రూ. 100 కోట్లు.. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా సహా చాలా మంది జైళ్లల్లో మగ్గుతున్నారు.
ఏపీలో రూ. 1000 కోట్ల మేర మద్యం కుంభకోణం జరుగుతోంది. ఈడీ, సీబీఐలకు ఏపీలోని మద్యం కుంభకోణం కన్పించదా..? ఒక్కో మందుబాబు రూ.3.50 లక్షలు ప్రభుత్వానికి కొంత.. జగనుకు కొంత ఇస్తున్నాడు. కంటైనర్లల్లో మద్యం అవినీతి డబ్బులు జగనుకు చేరుతున్నాయి. పురంధేశ్వరి మద్యం కుంభకోణంపై విచారణ జరిపించేలా చూడాలి. రాజకీయాలు పక్కన పెట్టి మద్యం దోపిడీని.. నాసిరకం మద్యాన్ని అరికట్టాలి. భిక్షగాళ్లు కూడా క్యూఆర్ కోడ్ పెట్టుకుని యాచిస్తున్నారు. ఈ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లకు ఎందుకు ఆస్కారం ఇవ్వడం లేదు. నాసిరకం బ్రాండ్లను తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
నాసిరకం మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ జగనన్న ఆరోగ్య సురక్షా అంటారా..? గుంటూరు జీజీహెచ్‌లో నాసిరకం మద్యం వల్ల వచ్చే అనారోగ్యం బారిన పడే వారి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో నాసిరకం మద్యం తాగడం వల్ల రోగుల సంఖ్య పెరుగుతోంది. మందు తాగి తన భర్త చనిపోయాడని ఓ బాధితురాలు చెబితే ఎండ్రిన్ తాగి చనిపోయారేమో అనుకున్నాను. జగన్ బ్రాండ్ తాగి చనిపోయాడని పక్కనున్న వారు చెప్పారు. రూ. 5తో మద్యం తయారు చేస్తున్నారు.. నాణ్యత ఉంటుందా..? జగన్ పేదల ప్రాణాలతో ఆడుకుంటూ.. జగనన్న ఆరోగ్య సురక్షా పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. తన ఎన్నికల పబ్లిసిటి కోసం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఆశా వర్కర్లతో పని చేయిస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్షా అని ప్రజల ముందుకు వెళ్లే వైసీపీ నేతలకు అర్హత ఉందా..? చాలా ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ పథకాన్ని వద్దంటున్నాయి’’ అని సోమిరెడ్డి చంద్రామోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.