Bypolls 2023 Results : కమల్ హాసన్ మద్దతిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి ఏంటంటే...!
ABN , First Publish Date - 2023-03-02T15:14:02+05:30 IST
ఐదు రాష్ట్రాల్లోని ఆరు శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల్లోని ఆరు శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మహారాష్ట్రలోని పుణే-కస్బా పేట్, చించ్‌వాడ్; తమిళనాడులోని తూర్పు ఈరోడ్, జార్ఖండ్‌లోని రామ్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌డిఘి, అరుణాచల్ ప్రదేశ్‌లోని లుమ్లా స్థానాలకు ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ఉప ఎన్నికలు జరిగాయి.
పుణే-కస్సాపేట్ ఎమ్మెల్యే ముక్త తిలక్ (బీజేపీ), చించ్‌వాడ్ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్‌తప్ (బీజేపీ) మరణించడంతో ఫిబ్రవరి 26న ఉప ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ తిరుమహన్ ఎవెరా మరణించడంతో తూర్పు ఈరోడ్ నియోజకవర్గంలో ఫిబ్రవరి 27న ఉప ఎన్నికలు జరిగాయి. రామ్‌గఢ్ ఎమ్మెల్యే (కాంగ్రెస్) మమత దేవి 2016నాటి కేసులో దోషిగా నిర్థరణ కావడంతో తన శాసన సభ్యత్వాన్ని కోల్పోయారు. సాగర్‌డిఘి టీఎంసీ ఎమ్మెల్యే సుబ్రత సాహా మరణించారు. దీంతో ఈ స్థానాల్లో ఫిబ్రవరి 27న ఉప ఎన్నికలు జరిగాయి.
రామ్‌గఢ్‌లో ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఏజేఎస్‌యూ అభ్యర్థి సునీత చౌదరి 19,500కుపైగా ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
కస్బాపేట్ నియోజకవర్గంలో మహా వికాస్ అగాఢీ కూటమి అభ్యర్థి ధంగేకర్ రవీంద్ర హేమ్‌రాజ్ విజయం సాధించారు. దీంతో ఆ కూటమి కార్యకర్తలంతా సంబరాలు చేసుకుంటున్నారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మార్పు వస్తుందనడానికి ఇది సంకేతమని తెలిపారు. ఎవరు నిజమైన శివసేన? అనే విషయం బీజేపీకి, ఢిల్లీలోని ఆ పార్టీ పెద్దలకు తెలిసి ఉంటుందన్నారు. ఇకపై బీజేపీ కంచుకోటలన్నీ ధ్వంసమైపోతాయన్నారు. 28 ఏళ్ల తర్వాత ఈ స్థానాన్ని బీజేపీ కోల్పోవడం విశేషం.
తూర్పు ఈరోడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇలంగోవన్ సుమారు 15 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ చీఫ్ కమల్ హాసన్ మద్దతిచ్చారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో ఎంఎన్ఎం కూడా చేరే అవకాశం ఉందని ఇటీవల ఊహాగానాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇలంగోవన్‌కు డీఎంకే కూడా మద్దతిచ్చింది.
సాగర్‌డిఘి నియోజకవర్గంలో అధికార పార్టీ టీఎంసీకి ఓటర్లు ఝలక్ ఇచ్చారు. వామపక్షాల మద్దతుతో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి బేరోన్ బిశ్వాస్ దాదాపు 2,814 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఎంసీ అభ్యర్థి దేబశిష్ బెనర్జీకి 19,420 ఓట్లు లభించగా, బిశ్వాస్‌కు 22,234 ఓట్లు లభించాయి. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థికి 6,305 ఓట్లు లభించాయి.
లుమ్లా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి త్షేరింగ్ ల్హము విజయం సాధించారు.
మహారాష్ట్రలోని చించ్‌వాడ్‌లో బీజేపీ అభ్యర్థి అశ్విని జగ్‌తప్ ఆధిక్యంలో కనిపిస్తున్నారు. ఎంవీఏ కూటమి అభ్యర్థి నానా కటే (ఎన్‌సీపీ) కన్నా దాదాపు 10 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Election Results 2023 : మూడు రాష్ట్రాల్లో కౌంటింగ్ సగం పూర్తయ్యే సరికి బీజేపీ పరిస్థితి...