BJP Vs JDU : మమత చెలిమితో నితీశ్ మారిపోయారు : బీజేపీ
ABN , First Publish Date - 2023-07-14T11:40:35+05:30 IST
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (West Bengal chief minister Mamata Banerjee)తో స్నేహం చేసినప్పటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Bihar chief minister Nitish Kumar) చాలా మారిపోయారని బీజేపీ ఆరోపించింది.
పాట్నా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (West Bengal chief minister Mamata Banerjee)తో స్నేహం చేసినప్పటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Bihar chief minister Nitish Kumar) చాలా మారిపోయారని బీజేపీ ఆరోపించింది. వీరిద్దరూ మిత్రులైనప్పటి నుంచి ఆమె బాటలోనే ఆయన పయనిస్తున్నారని దుయ్యబట్టింది. తమ పార్టీ నేతను పోలీసులు కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయిన సంఘటన దీనికి నిదర్శనమని తెలిపింది.
బిహార్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ పాలసీ, మరికొన్ని అంశాలపై బీజేపీ గురువారం నిరసన ప్రదర్శన చేసింది. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులపై తీవ్రంగా విరుచుకుపడి, లాఠీఛార్జి చేశారు. బీజేపీ జెహానాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ సింగ్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీనిపై బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ స్పందిస్తూ, పోలీసు దుశ్చర్యలను ఖండించారు. పోలీసులు కొట్టడం, తొక్కిసలాట వల్ల తమ పార్టీ నేత ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్ పోలీసులు బిహార్‌లో బీజేపీ కార్యకర్తలపై జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. ‘‘నితీశ్ కుమార్ గారూ, మీరు మమత బెనర్జీతో స్నేహం చేసినప్పటి నుంచి, మీరు ఆమె పద్ధతులనే అవలంబిస్తున్నారు’’ అని దుయ్యబట్టారు.
‘‘పోలీసులు కొట్టడం, తొక్కిసలాట వల్ల మా పార్టీ కార్యకర్తలు మరణించారు. వారి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. వాళ్లు డిమాండ్ చేస్తున్నదేమిటి? ఓ కుంభకోణంలో ఛార్జిషీటులో పేరు ఉన్న తేజస్వి యాదవ్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతున్నారు’’ అన్నారు. అలాంటివారిపై పోలీసుల దాడిని ఖండించారు. ప్రజలే మీకు సమాధానం చెబుతారని చెప్పారు.
బీజేపీ ఆరోపణల్లో వాస్తవం లేదు : పోలీసులు
పాట్నా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, వేర్వేరు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను తాము పరిశీలించామని, బీజేపీ కార్యకర్త విజయ్ కుమార్ సింగ్ లాఠీఛార్జి జరిగిన ప్రదేశానికి వెళ్లలేదని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందని చెప్పారు. ఆయన శరీరంపై గాయాలు కనిపించలేదన్నారు.
ఇవి కూడా చదవండి :
Kosovo Parliament : కొసావో పార్లమెంటులో కొట్లాట.. పిడిగుద్దులతో తలపడిన ఆడ, మగ సభ్యులు..