Karnataka Assembly Elections: ముగిసిన ప్రచారం.. ష్ గప్‌చుప్...
ABN , First Publish Date - 2023-05-08T17:02:47+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం ముగిసింది.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం ముగిసింది. కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు ఈ నెల పదిన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2613 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల సంఘం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎన్నికలు జరగనున్నాయి.
మరోవైపు వివిధ పార్టీలకు చెందిన నేతలు చివరి క్షణం వరకూ ప్రచారం సాగించారు. అధికార బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi), అస్సాం సీఎం బిశ్వశర్మ, కర్ణాటక మాజీ సీఎం యెడ్యూరప్ప, సీఎం బొమ్మైతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. పీఎం మోదీ ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. భారీ బహిరంగసభలు, మెగా రోడ్ షోలు నిర్వహించారు.
బీజేపీ తరపున కన్నడ సినిమా హీరో కిచ్చా సుదీప్ ప్రచారం చేశారు.
మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య తదితరులు ప్రచారం చేశారు.
జేడీఎస్ తరపున పార్టీ అధినేత హెచ్‌డీ దేవెగౌడతో పాటు మాజీ సీఎం కుమార స్వామి ప్రచారం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో మిగతా అంశాలు ఎలా ఉన్నా భజరంగదళ్ అంశాన్ని ప్రస్తావించడం దుమారం రేపింది. బీజేపీ మిగతా అంశాలన్నింటినీ వదిలిపెట్టి భజరంగ్‌దళ్ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చింది. వాడవాడలా హనుమాన్ చాలీసా కార్యక్రమాలు చేపట్టింది. భజరంగదళ్ అంశం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపడంతో ప్రచార సరళి పూర్తిగా మారిపోయింది. అటు కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తాము భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని చెప్పలేదని వివరణ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా హనుమంతుడి ఆలయాలు కట్టిస్తామని, హనుమంతుడి జీవన విలువలు ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
అటు బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుంది. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, అదే రిజర్వేషన్లను లింగాయత్‌లకు, ఒక్కలిగలకు పంచుతున్నట్లు ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పునరుద్ధిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కర్ణాటకలో ఇటీవల సాగిన మూడున్నరేళ్ల బీజేపీ పాలన అవినీతిమయమైందని కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం చేశారు.
మరోవైపు జేడీఎస్ తమకు పట్టున్న ప్రాంతాల్లో సైలెంట్‌గా ప్రచారం చేసుకుంటూ వెళ్లింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని జేడీఎస్ నేతలు హామీ ఇచ్చారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ మాటలు కూడా నమ్మశక్యం కానివని ఒవైసీ ముస్లిం ఓటర్లకు చెప్పారు.
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 5.24 కోట్లకు పైగా ఉండగా.. వీరిలో 2.6 కోట్ల మంది మహిళా ఓటర్లు, 4,751మంది ట్రాన్స్‌జెండర్లు. 58,282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5.24 కోట్ల ఓటర్లలో 5.60 లక్షల మంది దివ్యాంగులు. 80 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 12.15 లక్షలు కాగా.. వీరిలో వందేళ్ల వయసు పైబడిన ఓటర్లు 16 వేల మంది వరకున్నారు. 80 ఏళ్లుపైబడిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటేసే సౌకర్యం కల్పిస్తున్నారు.
1985 నుంచి ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారం కట్టబట్టే సంప్రదాయం కన్నడనాట లేకపోవడంతో అన్ని పార్టీల నేతల్లోనూ గుబులు నెలకొంది. ఈ నెల పదిన ఎన్నికలు, ఈ నెల 13న ఫలితాలు వెలువడనున్నాయి.