Maharashtra : రెండు స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-26T10:11:49+05:30 IST

కస్బా పేట్ ఎమ్మెల్యే ముక్త తిలక్, పింప్రి చించ్‌వాద్ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తప్ మరణించడంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

Maharashtra : రెండు స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Maharashtra Bypolls Voting

ముంబై : మహారాష్ట్ర (Maharashtra)లోని కస్బా పేట్, పింప్రి చించ్‌వాద్ శాసన సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన-బీజేపీ కూటమి, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) మద్దతుగల మహా వికాస్ అఘాడీ (MVA) మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది.

కస్బా పేట్ ఎమ్మెల్యే ముక్త తిలక్, పింప్రి చించ్‌వాద్ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తప్ మరణించడంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్‌లకు 100 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను మూసివేయించారు. సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నారు.

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్‌సీపీ నేత అజిత్ పవార్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే తదితరులు ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ముమ్మరంగా ప్రచారం చేశారు.

కస్బా పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హేమంత్ రసనే, కాంగ్రెస్ నేత రవీంద్ర ధంగేకర్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. రవీంద్రకు ఎంవీఏ మద్దతు ఉంది.

చించ్‌వాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అశ్విని జగ్తప్, ఎన్‌సీపీ అభ్యర్థి నానా కటే పోటీ పడుతున్నారు. పుణే నగరానికి సమీపంలోని పారిశ్రామికవాడలో ఈ నియోజకవర్గం ఉంది.

ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీ ఈ రెండు స్థానాల్లోనూ పోటీ చేయడం లేదు. అయినప్పటికీ ఎంవీఏ అభ్యర్థుల తరపున ఆదిత్య థాకరే రోడ్ షోలను నిర్వహించి ప్రచారం చేశారు.

ఇవి కూడా చదవండి :

Hyderabad: అమ్మాయి గురించి స్నేహితుడిని పొట్టనపెట్టుకున్న హరిహరకృష్ణ కేసులో ఊహించని ట్విస్ట్..

Ram Miriyala: ‘చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా’

Updated Date - 2023-02-26T10:13:07+05:30 IST