Rahul Gandhi : పరువు నష్టం కేసులో నాకే అత్యధిక శిక్ష పడింది : రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2023-06-01T11:04:09+05:30 IST
పరువు నష్టం కేసులో గరిష్ఠ శిక్షను బహుశా తనకే విధించి ఉంటారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) అన్నారు.
న్యూఢిల్లీ : పరువు నష్టం కేసులో గరిష్ఠ శిక్షను బహుశా తనకే విధించి ఉంటారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) అన్నారు. తన పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారన్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్నదానిని 2004లో తాను రాజకీయాల్లోకి వచ్చినపుడు ఊహించలేదన్నారు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ అమెరికా పర్యటన మంగళవారం ప్రారంభమైంది. ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోలో భారతీయ మూలాలుగలవారితో బుధవారం మాట్లాడుతూ, దేవుడి పక్కన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూర్చోబెడితే, ఈ విశ్వం ఎలా పని చేస్తోందో దేవుడికి మోదీ వివరిస్తారన్నారు. తాను సృష్టించినదేమిటి? అని దేవుడు అయోమయంలో పడతాడన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ విదేశాల్లో ఉంటే జిన్నా ఆత్మ ఆవహిస్తుందని దుయ్యబట్టింది. మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజనకు కారకుడనే సంగతి తెలిసిందే.
రాహుల్ గురువారం స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్నదానిని తాను 2004లో రాజకీయాల్లో చేరినపుడు ఊహించలేదన్నారు. పరువు నష్టం కేసులో గరిష్ఠ శిక్ష బహుశా తనకు మాత్రమే విధించి ఉంటారన్నారు. ఇలాంటి చర్యలు సాధ్యమవుతాయని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. అయితే తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం వల్ల పార్లమెంటులో కూర్చోవడం కన్నా గొప్ప అవకాశం తనకు లభించిందని చెప్పారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) గురించి ప్రస్తావించారు.
భారత దేశంలో ప్రతిపక్షాలు ఘర్షణపడుతున్నాయన్నారు. వ్యవస్థలను బీజేపీ కబ్జా చేసిందని ఆరోపించారు. తాము బీజేపీతో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నామని చెప్పారు. వ్యవస్థలు తమకు సహాయపడటం లేదని గుర్తించిన తర్వాత తాము రోడ్లపైకి వచ్చామని, భారత్ జోడో యాత్ర నిర్వహించామని చెప్పారు. స్వదేశంలో పరిస్థితులను చక్కదిద్దడానికి విదేశీ సాయం కోరుతున్నారా? అని అడిగినపుడు రాహుల్ స్పందిస్తూ, తాను ఎవరి సహకారాన్ని కోరడం లేదన్నారు. మన పోరాటం మనదేననే స్పష్టత తనకు ఉందన్నారు. అయితే భారత దేశం నుంచి వచ్చిన యువ విద్యార్థులు అమెరికాలో ఉన్నారని, వారికి ఈ వివరాలను చెప్పాలను తాను అనుకుంటున్నానని, అది తన హక్కు అని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కూడా ప్రజలతో మాట్లాడాలని, కఠిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పరువు నష్టం కేసు
కర్ణాటకలో 2019లో జరిగిన ఓ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దొంగల ఇంటిపేరు మోదీ ఎందుకు అవుతోందని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీ దోషి అని నిర్థరించి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం రద్దు చేసింది. ఆయన కేరళలోని వయనాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా 2019లో గెలిచిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Chanchalguda Jail: చంచల్‌గూడ గేట్.. తాడేపల్లిలో రిమోట్
Gujarat : సముద్రంలో మునిగిపోతున్న ముగ్గుర్ని కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే