Congress : భారత్-చైనా సంబంధాలపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-06-01T16:19:51+05:30 IST
భారత దేశం-చైనా మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా సంక్లిష్టంగా ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) అన్నారు.
న్యూఢిల్లీ : భారత దేశం-చైనా మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా సంక్లిష్టంగా ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) అన్నారు. భారత్‌ను చైనా వెనుకకు నెట్టివేయజాలదన్నారు. రష్యాపై భారత దేశ వైఖరిని సమర్థించారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా స్పందించారు.
రాహుల్ గాంధీ కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో (స్థానిక కాలమానం ప్రకారం) బుధవారం రాత్రి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్-చైనా మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? రానున్న ఐదు నుంచి పదేళ్ళలో ఈ సంబంధాలు ఏ విధంగా మారుతాయి? అని ప్రశ్నించినపుడు, రాహుల్ బదులిస్తూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం సంక్లిష్టంగా ఉన్నాయన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్నారు. ఇది అంత తేలికైన విషయం కాదన్నారు. భారత దేశాన్ని చైనా (China) వెనుకకు నెట్టజాలదన్నారు. అది జరగదని చెప్పారు.
2020 మే నెల నుంచి భారత్ (India), చైనా మధ్య లడఖ్ ప్రాంతంలో ఘర్షణ నెలకొన్న సంగతి తెలిసిందే. గాల్వన్ లోయలో 2020 జూన్ నెలలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో శాంతి నెలకొనని పక్షంలో చైనాతో సత్సంబంధాలు సాధారణ స్థితికి చేరబోవని భారత దేశం స్పష్టం చేసింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా పట్ల భారత ప్రభుత్వం అనుసరిస్తున్న తటస్థ వైఖరిపై ప్రశ్నించినపుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రష్యాతో భారత దేశానికి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. రష్యాపై భారత్ కొంత వరకు ఆధారపడుతోందన్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సమర్థించారు. భారత్ తన స్వప్రయోజనాలను చూసుకోవాలన్నారు. భారత దేశం సువిశాలమైనదని, సహజంగానే ఇతర దేశాలతో సంబంధాలు ఉంటాయని చెప్పారు. ఒక దేశంతోనే సంబంధాలు పెట్టుకుని, ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోకుండా ఉండేటంత చిన్న దేశం కాదన్నారు. ఇటువంటి సంబంధాలు మనకు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు కొందరితో మనకు మెరుగైన సంబంధాలు ఉంటాయని, మరికొందరితో సంబంధాలు పరిణామం చెందుతూ ఉంటాయని చెప్పారు. అటువంటి సమతా స్థితి ఉంటుందన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా చర్యలను ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలోని వివిధ వ్యవస్థలు ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాలపై ఓటింగ్ నుంచి భారత్ గైర్హాజరైన సంగతి తెలిసిందే.
అమెరికాలోని మూడు నగరాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. మంగళవారం నుంచి ఈ పర్యటన ప్రారంభమైంది. ఆయన అమెరికన్ ప్రజా ప్రతినిధులతోనూ, భారతీయ మూలాలుగల ప్రజలతోనూ మాట్లాడతారు. ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శాం పిట్రోడా తెలిపిన వివరాల ప్రకారం, ఉమ్మడి విలువలను ప్రోత్సహించడం, నిజమైన ప్రజాస్వామిక దార్శనికతను అభివృద్ధి చేయడం లక్ష్యంగా రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Chanchalguda Jail: చంచల్‌గూడ గేట్.. తాడేపల్లిలో రిమోట్
Gujarat : సముద్రంలో మునిగిపోతున్న ముగ్గుర్ని కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే