Rahul Vs Varun : ‘‘నా తల తెగిపోవాలి’’ : వరుణ్ గాంధీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-01-17T16:10:54+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) భావజాలం, తన భావజాలం పూర్తి విరుద్ధమని చెప్పారు. తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యాలయానికి వెళ్లే ప్రసక్తే లేదని, అది జరగాలంటే తన తల తెగిపోవాలని అన్నారు.
వరుణ్ గాంధీ కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఇటీవల ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో బీజేపీని వదిలిపెట్టి, కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారమవుతోంది. మరోవైపు ఆయన బీజేపీ పరిపాలనలోని వైఫల్యాలను ఎండగడుతున్నారు.
రాహుల్ గాంధీ మంగళవారం వరుణ్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘వరుణ్ గాంధీ బీజేపీలో ఉన్నారు. ఆయన ఇక్కడికి వస్తే, ఆయనకు అదొక సమస్య కావచ్చు. ఆయన భావజాలంతో నా భావజాలం సరిపోలదు. నేను ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లను. అది జరగాలంటే అంతకుముందే నా తల తెగిపడాలి. నా కుటుంబానికి ఓ సిద్ధాంతం, భావజాలం ఉన్నాయి. వరుణ్ మరొకదానిని అనుసరిస్తున్నారు. ఆయన అనుసరిస్తున్న సిద్ధాంతాన్ని నేను అంగీకరించలేను’’ అని చెప్పారు.
బీజేపీ, ఆరెస్సెస్ దేశంలోని అన్ని వ్యవస్థలను కబళిస్తున్నాయన్నారు. మీడియా, ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థలపై ఒత్తిడి ఉందని ఆరోపించారు. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేతృత్వంలోని ప్రభుత్వంపై కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. పంజాబ్‌ను పంజాబ్ నుంచే పరిపాలించాలని, ఢిల్లీ నుంచి కాదని చెప్పారు.