Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం సిద్ధరామయ్యకే!
ABN , First Publish Date - 2023-05-18T09:19:35+05:30 IST
ఎట్టకేలకు కాంగ్రెస్ కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి నేతను ఎంపిక చేయగలిగింది. పోటీ పడుతున్న ఇద్దరు నేతల మధ్య రాజీ కుదర్చగలిగింది.
న్యూఢిల్లీ : ఎట్టకేలకు కాంగ్రెస్ కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి నేతను ఎంపిక చేయగలిగింది. పోటీ పడుతున్న ఇద్దరు నేతల మధ్య రాజీ కుదర్చగలిగింది. మొదటి రెండేళ్లు ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు ఆ పదవిని డీకే శివ కుమార్ నిర్వహించే విధంగా ఓ ఏర్పాటు చేయగలిగింది. దీంతో సిద్ధరామయ్య కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా ఈ నెల 20 మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డీకే కోరిన ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించడం మరో విశేషం.
డీకే శివ కుమార్ ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని కూడా నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో చర్చల అనంతరం ఈ ఫార్ములాకు అందరి ఆమోదం లభించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ఫార్ములాకు ఆమోదం తెలిపారు. దీంతో మూడు రోజులపాటు జరిగిన చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయి. కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను తెలిపింది.
డీకే శివ కుమార్ (DK Shiva Kumar) ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి అన్యమనస్కంగానే అంగీకరించినట్లు తెలుస్తోంది. దీని వెనుక కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఉన్నారని సమాచారం. అంతకుముందు తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందేనని శివ కుమార్ పట్టుబట్టారు.
సిద్ధరామయ్య (Siddaramaiah)కు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు చెప్తున్నారు. అయితే శివ కుమార్‌ను దారిలోకి తేవడానికి కాంగ్రెస్ పెద్దలు చాలా శ్రమించవలసి వచ్చింది. సిద్ధరామయ్య, శివ కుమార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పదవిని తనకు ఇవ్వాలంటే, తనకు ఇవ్వాలని వాదించారు.
ఇవి కూడా చదవండి :
Good New: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పిన సీఎం
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు