Uddhav Thackeray : ‘శివసేన’ పేరును మా తాత గారు సూచించారు : ఉద్ధవ్ థాకరే
ABN , First Publish Date - 2023-07-10T15:52:19+05:30 IST
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) విదర్భ పర్యటనలో రెండో రోజు అత్యంత భావోద్వేగంతో మాట్లాడారు. శివసేన పార్టీ పేరును తన తాత గారు కేశవ్ థాకరే సూచించారని, ఆ పేరును ఎన్నికల కమిషన్ (EC) ఇతరులకు ఇవ్వకూడదని అన్నారు. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం తీసుకోవచ్చునన్నారు.
ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) విదర్భ పర్యటనలో రెండో రోజు అత్యంత భావోద్వేగంతో మాట్లాడారు. శివసేన పార్టీ పేరును తన తాత గారు కేశవ్ థాకరే సూచించారని, ఆ పేరును ఎన్నికల కమిషన్ (EC) ఇతరులకు ఇవ్వకూడదని అన్నారు. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం తీసుకోవచ్చునన్నారు. తాను ముఖ్యమంత్రి పదవిని పొందాలని ఎన్నడూ కోరుకోలేదని, అయితే శివసేన పార్టీకి ఆ పదవి లభించాలని కోరుకున్నానని చెప్పారు. తన తండ్రి బాలా సాహెబ్ థాకరేకు తాను ఇచ్చిన హామీకి అనుగుణంగానే శివసేనకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకున్నానని చెప్పారు.
ఉద్ధవ్ థాకరే మహారాష్ట్రలోని విదర్భలో ఆదివారం నుంచి పర్యటిస్తున్నారు. ఆయన సోమవారం అమరావతిలో జరిగిన సభలో మాట్లాడారు. పార్టీలను చీల్చడం కొత్త విషయం కాదని, ఇప్పడు మాత్రం ఏకంగా వాటిని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. శివసేన పార్టీ పేరును ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గానికి కట్టబెడుతూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ, శివసేన పార్టీ పేరును తన తాత గారు కేశవ్ థాకరే సూచించారని, ఆ పేరును ఇతరులకు ఇచ్చే అధికారం ఈసీకి లేదని అన్నారు. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం తీసుకోవచ్చునన్నారు.
శివసేన పేరు, ఎన్నికల గుర్తు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి చెందుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉద్ధవ్ థాకరే వర్గం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు దీనిని సోమవారం విచారణకు స్వీకరించింది. ఈ నెల 31న విచారణ జరుపుతామని తెలిపింది.
శివసేన మాదిరిగానే ఎన్‌సీపీ కూడా చీలిపోయిన సంగతి తెలిసిందే. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీని ఆయన సమీప బంధువు అజిత్ పవార్ చీల్చి, తన వర్గంలోని ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరారు. శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందనే భయంతోనే అజిత్ పవార్ వర్గాన్ని ప్రభుత్వంలో చేర్చుకున్నారని కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై ఉద్ధవ్ ఆదివారం స్పందిస్తూ, 2019లో శాసన సభ ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల చొప్పున బీజేపీ, శివసేన పంచుకోవాలని నిర్ణయం జరిగిందని, ఈ మేరకు అమిత్ షా హామీ ఇచ్చారని చెప్పారు. ఎన్నికల అనంతరం బీజేపీ ఈ హామీని నిలబెట్టుకుని ఉంటే, ఇప్పుడు ఇతర పార్టీల తివాచీలను మోయవలసిన అవసరం వచ్చేది కాదన్నారు. కొత్త తలనొప్పులను బీజేపీ ఎలా నిభాయించగలదో చూస్తానన్నారు.
ఇవి కూడా చదవండి :
Unusual heavy rains : ఉత్తరాదిలో ఎందుకు ఈ అసాధారణ భారీ వర్షాలు?
Panchayat Polls : మమత బెనర్జీని ఏకిపారేసిన దిగ్విజయ సింగ్