Saudi Arabia: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన తెలుగు ప్రవాసీ.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి!
ABN , First Publish Date - 2023-10-01T07:59:54+05:30 IST
అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా క్రికెట్ ఆడిన ఆ ప్రవాస భారతీయుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. సహచరులు ఆస్పత్రికి తరలించేలోపే ఆ హైదరాబాదీ ప్రాణాలు కోల్పోయాడు. సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్‌లోని రాఖా ప్రాంతంలో ఈ విషాదం జరిగింది.
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా క్రికెట్ ఆడిన ఆ ప్రవాస భారతీయుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. సహచరులు ఆస్పత్రికి తరలించేలోపే ఆ హైదరాబాదీ ప్రాణాలు కోల్పోయాడు. సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్‌లోని రాఖా ప్రాంతంలో ఈ విషాదం జరిగింది. దమ్మాంలోని వివిధ క్రికెట్ క్లబ్‌ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నాయి. శుక్రవారం ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ అతీఫ్ ఖాన్(52) ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. నొప్పితో కుప్పకూలిపోయిన అతడిని సహచరులు వెంటనే సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి అల్ ఖోబర్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా..
అప్పటికే అతీఫ్ చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. గుండె నొప్పి వచ్చిన వారికి ప్రతి క్షణం అమూల్యమైందని అల్ ఖోబర్‌లోని ప్రముఖ వైద్యుడు అభిజిత్ వర్గీస్ తెలిపారు. అతీఫ్ ఖాన్‌కు సకాలంలో సి.పి.ఆర్ చేస్తే ప్రాణాలు దక్కేందుకు మెరుగైన అవకాశాలు ఉండేవని చెప్పారు. ప్రతి ఒక్కరూ సి.పి.ఆర్ చేయడం నేర్చుకోవాలని సూచించారు. సి.పి.ఆర్ నేర్చుకుంటే గుండెపోటు వచ్చిన సమయంలో వ్యక్తుల ప్రాణాలు కాపాడేందుకు పనికి వస్తుందని ఖతర్‌లోని ప్రముఖ తెలుగు ప్రవాసీ సామాజిక సేవకురాలు, ఐడబ్య్లూడబ్ల్యూవో అధ్యక్షురాలు శ్రీమతి రజని మూర్తి అన్నారు. తాము ఖతర్‌లో సి.పి.ఆర్ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఆపద సమయాల్లో జీవితాలను కాపాడే సి.పి.ఆర్ శిక్షణకు తాము కూడ ఏర్పాట్లు చేస్తున్నామని సౌదీ అరేబియా తెలుగు సంఘం(సాటా) ప్రధాన కార్యదర్శి ముజ్జమీల్ శేఖ్ తెలిపారు.