Women: తల్లితో పాటూ స్కూటీలో వెళ్లి.. నది ఒడ్డున రాత్రంతా గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారి.. ఉదయం స్థానికులు వెళ్లి చూడగా..
ABN , First Publish Date - 2023-10-20T08:39:51+05:30 IST
చాక్లెట్ కొనిస్తానని స్కూటీలో తీసుకెళ్లిన తల్లి.. ఉలుకూపలుకూ లేకుండా నది ఒడ్డున పడిఉండడం చూసి ఆ చిన్నారికి ఏమీ అర్థం కాలేదు. మరోవైపు చుట్టూ చిమ్మచీకటి. ఎక్కడున్నాడో, ఏం జరుగుతోందో అర్థం కాని ఆ చిన్నారి..
చాక్లెట్ కొనిస్తానని స్కూటీలో తీసుకెళ్లిన తల్లి.. ఉలుకూపలుకూ లేకుండా నది ఒడ్డున పడిఉండడం చూసి ఆ చిన్నారికి ఏమీ అర్థం కాలేదు. మరోవైపు చుట్టూ చిమ్మచీకటి. ఎక్కడున్నాడో, ఏం జరుగుతోందో అర్థం కాని ఆ చిన్నారి.. ‘‘అమ్మా! అమ్మా!’’.. అంటూ రాత్రంతా గుక్కపట్టి ఏడుస్తూనే ఉన్నాడు. ఉదయం చిన్నారి ఏడుపులు విని చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది. తాజాగా, మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటనకు సబంధించిన వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర (Maharashtra) చంద్రపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఆదిత్య ప్లాజా బామ్నీ ప్రాంతానికి చెందిన పవన్ కాకడే అనే వ్యక్తికి భార్య సుష్మ, నాలుగేళ్ల చిన్నారి ఉన్నారు. పవన్ బ్యాంకులో పని చేస్తూ కుటుబాన్ని పోషిస్తుండేవాడు. ప్రస్తుతం సుష్మ మూడు నెలల గర్భిణి. సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలో ఇటీవల ఎవరూ ఊహించని విషాద ఘటన చోటు చేసుకుంది. బుధవారం పవన్ యథావిధిగా బ్యాంక్‌కు వెళ్లిపోయాడు. ఆ సమయంలో భార్య, కుమారుడు ఇంట్లోనే ఉన్నారు. అయితే పిల్లాడికి చాక్లెట్ కొనివ్వాలనే ఉద్దేశంతో సుష్మ స్కూటీలో కొడుకుతో పాటూ సాయంత్రం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజూర అనే ప్రాంతానికి బయలుదేరింది. మార్గ మధ్యలో బామ్ని- రాజురా రహదారిపై ఉన్న వార్ద నది వంతెన వద్దకు చేరుకునేసరికి ఉన్నట్టుండి (Scooty fell from top of the bridge) స్కూటీ అదుపుతప్పి 30అడుగుల కిందకు పడిపోయింది.
ఈ ప్రమాదంలో సుష్మ అక్కడికక్కడే (woman died) మృతి చెందింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారి తల్లి మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. చుట్టూ చీకటి కావడంతో పాటూ మనుషులు ఎవరూ లేకపోవడంతో రాత్రంతా ఎవరూ గుర్తించలేదు. మరోవైపు సుష్మ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాత్రంతా వెతికినా సుష్మ జాడ కనిపించలేదు. అయితే గురువారం ఉదయం వంతెన వద్ద కొందరు స్థానికులకు చిన్నారి ఏడుపులు వినిపించాయి. దగ్గరికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎత్తు నుంచి పడడంతో సుష్మ మెడ, చేయి విరిగినట్లు వైద్యులు తెలిపారు. చాక్లెట్ కొనుక్కునేందుకు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.