Shubman Gill vs Mohammed Siraj: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో సిరాజ్, గిల్

ABN , First Publish Date - 2023-10-10T12:56:11+05:30 IST

సెప్టెంబర్ నెలకు గాను టీమిండియా యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

Shubman Gill vs Mohammed Siraj: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో సిరాజ్, గిల్

సెప్టెంబర్ నెలకు గాను టీమిండియా యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. సిరాజ్, గిల్‌తోపాటు ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్‌ను కూడా ఈ అవార్డు రేసులో ఉన్నాడు. దీంతో ఈ ముగ్గురిలో ఈ అవార్డు ఎవరికి దక్కుతుందనేది చూడాలి. ప్రధానంగా భారత ఆటగాళ్లు సిరాజ్, గిల్ మధ్యనే పోటీ ఉండే అవకాశాలున్నాయి. కాగా సెప్టెంబర్ నెలలో శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, డేవిడ్ మలాన్ అదరగొట్టారు. ది ప్రిన్స్‌గా పిలిచే శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది మొత్తం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెలలో అదరగొట్టాడు. ఏకంగా 80 సగటుతో 480 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలున్నాయి.


సెప్టెంబర్ నెలలో జరిగిన ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను టీమిండియా గెలుచుకోవడంలో గిల్ కీలకపాత్ర పోషించాడు. ఆసియా కప్‌లో 302 పరుగులు చేసిన గిల్ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 74 పరుగులు, రెండో మ్యాచ్‌లో 104 పరుగులు చేశాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా గత నెలలో అదరగొట్టాడు. ఆసియా కప్ మొత్తంలో కేవలం 17.27 సగటుతో సిరాజ్ 11 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అయితే అద్భుతమే చేశాడు. ఒకే ఓవర్లో నాలుగో వికెట్లు తీయడంతోపాటు మ్యాచ్‌ మొత్తంలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. దీంతో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. అటు ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ కూడా గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చెలరేగాడు. రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో సత్తా చాటాడు. 54, 96, 127 పరుగులతో అదరగొట్టాడు.

Updated Date - 2023-10-10T12:56:11+05:30 IST