World cup: విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్ కౌగిలింతపై గంభీర్ ఏమన్నాడో తెలుసా?..
ABN , First Publish Date - 2023-10-12T13:18:48+05:30 IST
బుధవారం భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శత్రువులుగా పేరొందిన టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆఫ్ఘానిస్థాన్ స్టార్ బౌలర్ నవీన్ ఉల్ హక్ ఒకటైపోయారు.
ఢిల్లీ: బుధవారం భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శత్రువులుగా పేరొందిన టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆఫ్ఘానిస్థాన్ స్టార్ బౌలర్ నవీన్ ఉల్ హక్ ఒకటైపోయారు. ఒకరినొకరు కరచాలనం చేసుకుని, చిరునవ్వులు చిందిస్తూ కౌగిలించుకున్నారు. ఈ ఘటన అందిరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. పరిస్థితి చూస్తుంటే ఇద్దరి మధ్య ఉన్న విబేధాలు సమసిపోయినట్లే ఉన్నాయి. పైగా నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో అతడిని ఉద్దేశించి ప్రేక్షకులు కామెంట్లు చేశారు. దీంతో వెంటనే కల్గ చేసుకున్న కోహ్లీ.. నవీన్‌ను ఏమి అనకూడదని సైగలతో అభిమానులకు సూచించాడు. కాగా గత ఐపీఎల్‌లో గౌతం గంభీర్-విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్ మధ్యనే గొడవ జరిగిన సంగతి తెలిసిందే.
లక్నోసూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరుగుతుండగా విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్ గొడవ పడ్డారు. మ్యాచ్ ముగిసిన తర్వాత గౌతం గంభీర్-విరాట్ కోహ్లీ గొడవపడ్డారు. ఈ వివాదం అప్పట్లో పెద్ద దుమారం లేపింది. కాగా లక్నోకు గంభీర్ మెంటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వరల్డ్ కప్ సందర్భంగా భారత్ తరఫున విరాట్ కోహ్లీ, అఫ్ఘానిస్థాన్ తరఫున నవీన్ ఉల్ హక్ బరిలోకి దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఎవరూ ఊహించని విధంగా మైదానంలో నవ్వుతూ ఇద్దరు ఒకటైపోయారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే గత ఐపీఎల్‌లో ఈ గొడవలో ఒకరైన గౌతం గంభీర్ ఈ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. దీంతో తాజాగా ఈ ఘటనపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కూడా స్పందించాడు.
“మీరు మైదానంలో పోరాడండి. మైదానం బయట కాదు. ప్రతి క్రీడాకారుకి తన జట్టు కోసం పోరాడటానికి, గౌరవం కోసం పోరాడటానికి, గెలవడానికి పోరాడటానికి హక్కు ఉంటుంది. మీరు ఏ దేశానికి చెందినవారు లేదా మీరు ఎంత మంచి ఆటగాడు అన్నది ముఖ్యం కాదు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్‌ను ఇలా చూడడం బాగుంది. ఎట్టకేలకు ఐపీఎల్ గొడవ ముగిసినట్టే. ఇదే సమయంలో క్రికెట్ ఫ్యాన్స్‌కు నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. మైదానంలోని కానీ, సోషల్ మీడియాలో కానీ ఏ ఆటగాడినైనా సరే ట్రోలింగ్ చేయడం, ఎగతాళి చేయడం వంటివి చేయకూడదని నేను అభిమానులను కోరుతున్నాను. మీరు మీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఉద్వేగభరితంగా ఉంటారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి తొలిసారిగా ఐపీఎల్‌లో ఆడడం నవీన్‌కు చాలా గొప్ప విషయం' అని భారత మాజీ ఓపెనర్ అన్నాడు. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్ మధ్య వివాదం ముగిసిపోయినందుకు అభిమానులు సంతోషిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే కెప్టెన్ రోహిత్ శర్మ(131) విధ్వంసకర సెంచరీతో అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు పాయింట్ల టేబుల్‌లో ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది(80), అజ్మతుల్లా ఒమర్‌జాయ్(62) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం లక్ష్యాన్ని టీమిండియా మరో 15 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించి 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ 84 బంతుల్లోనే 16 ఫోర్లు, 5 సిక్సులతో 131 పరుగులు చేశాడు. లోకల్ బాయ్ విరాట్ కోహ్లీ(55*) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు.