Share News

IND vs SA: కోహ్లీ కాదు, జడేజా కాదు.. ఈ సారి బెస్ట్ ఫీల్డర్ మెడల్ గెలుచుకున్న టీమిండియా ప్లేయర్ ఎవరంటే..?

ABN , First Publish Date - 2023-11-06T14:09:14+05:30 IST

సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో మన వాళ్లు దుమ్ములేపుతున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టు అందరి కంటే ముందుగానే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

IND vs SA: కోహ్లీ కాదు, జడేజా కాదు.. ఈ సారి బెస్ట్ ఫీల్డర్ మెడల్ గెలుచుకున్న టీమిండియా ప్లేయర్ ఎవరంటే..?

కోల్‌కతా: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో మన వాళ్లు దుమ్ములేపుతున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టు అందరి కంటే ముందుగానే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అయితే ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లో మన ఆటగాళ్లకు బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో ఉత్తమ ఫీల్డింగ్ ప్రతిభ కనబర్చిన ఆటగాడికి ఈ మెడల్‌ను అందిస్తున్నారు. ఈ విధానాన్ని ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ప్రవేశపెట్టారు. ఈ ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌లో ఉత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన కనబర్చిన ఫీల్డర్‌కు ఈ మెడల్‌ను ఇస్తూ వస్తున్నారు. అయితే మెడల్ మ్యాచ్ మ్యాచ్‌కు చేతులు మారుతుంటుంది. ఒక మ్యాచ్‌లో మెడల్‌ ఒక ఆటగాడు గెలుచుకుంటాడు. మరో మ్యాచ్‌లో మరో ఆటగాడు గెలుచుకుంటాడు. అప్పుడు అంతకుముందు మెడల్ గెలుచుకున్న ఆటగాడే స్వయంగా ఆ మెడల్‌ను తర్వాతి మ్యాచ్‌లో గెలిచిన ఆటగాడి మెడలో వేస్తాడు. అయితే ప్రతి మ్యాచ్‌లో ఉత్తమ ఫీల్డర్ ఎవరనేది మాత్రం ఫీల్డింగ్ కోచ్ దిలీప్ నిర్ణయిస్తాడు.


ఇలా ఈ అవార్డును ఇప్పటివరకు శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తదితరులు గెలుచుకున్నారు. అయితే మొదటి సారి ఈ మెడల్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ గెలుచుకున్నాడు. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఉత్తమ ఫీల్డింగ్ చేసినందకుగాను ఫీల్డింగ్ కోచ్‌ దిలీప్ రోహిత్‌ను విజేతగా ప్రకటించాడు. దీంతో గత మ్యాచ్‌లో మెడల్ గెలుచుకున్న శ్రేయస్ అయ్యర్ స్వయంగా స్వయంగా మెడల్‌ను తీసుకొచ్చి రోహిత్ శర్మ మెడలో వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియలో కనిపిస్తున్న దాని ప్రకారం బెస్ట్ ఫీల్డర్ మెడల్ విజేతగా రోహిత్ శర్మ పేరు ప్రకటించగానే ఇతర టీమిండియా ఆటగాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. ఆనందంతో అరుస్తూ హిట్‌మ్యాన్ మీద పడి గోల గోల చేశారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ రోహిత్‌ను గట్టిగా కౌగిలించుకుని సంబరాలు చేసుకున్నారు.

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే దక్షిణాఫ్రికాతో పోరులో టీమిండియాదే గెలుపు అనుకున్నారు కానీ.. ప్రత్యర్థి మరీ ఇంత దారుణంగా ఆడుతుందని ఎవరూ భావించలేదు. తొలుత బ్యాటింగ్‌లో ఆపై బౌలింగ్‌లో టీమిండియా అదిరే ప్రదర్శన చేయడంతో సఫారీలతో మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షమైంది. ఛేదనలో తమ బలహీనతను పునరావృతం చేస్తూ 243 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. ఆదివారంనాటి మ్యాచ్‌లో తొలుత భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్‌) శతక్కొట్టగా, శ్రేయాస్‌ (87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) ధనాధన్‌ ఆరంభం ఇవ్వగా, జడేజా (15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 29 నాటౌట్‌), సూర్యకుమార్‌ (14 బంతుల్లో 5 ఫోర్లతో 22) విజృంభించారు. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. జాన్సెన్‌ (14) టాప్‌ స్కోరర్‌. డ్యూసెన్‌, బవుమా, మిల్లర్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జడేజా (5/33) ఐదు వికెట్లతో వణికించగా, కుల్దీప్‌ (2/7), షమి (2/18) చెరో రెండు వికెట్లతో ప్రత్యర్థి పనిబట్టారు. కోహ్లీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

Updated Date - 2023-11-06T14:13:12+05:30 IST