Share News

World Cup2023: స్టార్ స్పోర్ట్స్‌కు పిచ్చి పట్టిందా..? పాపం రోహిత్ శర్మ.. భగ్గుమంటున్న సోషల్ మీడియా

ABN , First Publish Date - 2023-11-14T11:25:28+05:30 IST

వన్డే ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్ పోరుకు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే సెమీస్ పోరులో ఫైనల్ బెర్త్ కోసం అతిథ్య జట్టు టీమిండియా, గత ప్రపంచకప్ రన్నరఫ్ న్యూజిలాండ్ చావోరేవో తేల్చుకోనున్నాయి. సెమీస్ పోరు కోసం ఐసీసీ, మ్యాచ్ ప్రసారకర్తలు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్ ప్రచారాన్ని కూడా మొదలెట్టేశాయి. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య.

World Cup2023: స్టార్ స్పోర్ట్స్‌కు పిచ్చి పట్టిందా..? పాపం రోహిత్ శర్మ..  భగ్గుమంటున్న సోషల్ మీడియా

ముంబై: వన్డే ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్ పోరుకు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే సెమీస్ పోరులో ఫైనల్ బెర్త్ కోసం అతిథ్య జట్టు టీమిండియా, గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ చావోరేవో తేల్చుకోనున్నాయి. రెండు జట్లకు ఈ ప్రపంచకప్ గెలవడం ఎంతో ముఖ్యం. బలమైన జట్టుగా ఉన్నప్పటికీ టీమిండియా ప్రపంచకప్ గెలిచి దశాబ్దకాలం దాటిపోయింది. న్యూజిలాండ్ అయితే ఇప్పటివరకు ఒకసారి కూడా ప్రపంచకప్‌ను గెలవలేకపోయింది. దీంతో రెండు జట్లు ఈ సెమీస్‌లో గెలిచి ఫైనల్ చేరడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. క్రికెట్ ప్రేమికులు కూడా వెయ్యి కళ్లతో ఈ సెమీస్ పోరు కోసం ఎదురుచూస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానున్న ఈ సెమీస్ పోరు కోసం ఐసీసీ, మ్యాచ్ ప్రసారకర్తలు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్ ప్రచారాన్ని కూడా మొదలెట్టేశాయి. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రసారం కోసం విడుదల చేసిన ప్రోమోలో, పోస్టర్లలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ నుంచి కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫోటోలను వాడారు.


సాధారణంగా ఇలాంటి పోస్టర్లలో, ప్రోమోల్లో జట్ల కెప్టెన్ల ఫోటోలను వాడుతుంటారు. ఆ లెక్కన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫోటోలను వాడాలి. కానీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దీనికి విరుద్ధంగా రోహిత్ శర్మ స్థానంలో విరాట్ కోహ్లీ ఫోటోను వాడుతోంది. దీంతో రోహిత్ శర్మ అభిమానులు, క్రికెట్ ప్రేమికులు, మాజీ క్రికెటర్లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ తీరుపై మండిపడుతున్నారు. జట్టు కెప్టెన్ అయినా రోహిత్ శర్మకు క్రెడిట్ ఇవ్వకుండా కోహ్లీకి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జట్టు విజయాల క్రెడిట్ మొత్తాన్ని ఒక్క విరాట్ కోహ్లీకే అపాదిస్తున్నారని అంటున్నారు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ జట్టును బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తున్నాడు. ఓపెనర్‌గా జట్టుకు అద్భుత ఆరంభాలను అందిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో అత్యంత విజయవంతమైన ఓపెనర్‌గా ఉన్నాడు. ముఖ్యంగా సొంత రికార్డు కోసం కాకుండా పూర్తిగా జట్టు కోసం ఏమాత్రం స్వార్థం లేని ఆట ఆడుతున్నాడు. ఇక కెప్టెన్‌గా తన అద్భుత నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ టోర్నీ లీగ్ దశలో టీమిండియా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా 9కి 9 గెలవడంతో హిట్‌మ్యాన్ కీలకపాత్ర పోషించాడు. అలాంటిది రోహిత్ శర్మను కాదని కోహ్లీ ఫోటో పెట్టడంపై తీవ్ర అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. పైగా సాధారణంగా ఉండాల్సిన కెప్టెన్ ఫోటో స్థానంలో కోహ్లీ పోటోను పెట్టి రోహిత్‌ను అవమానిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

దీంతో ఎక్స్‌ (ట్విట్టర్‌)లో షేమ్ ఆన్ స్టార్ స్పోర్ట్స్ (SHAME ON STAR SPORTS) అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్టార్ స్పోర్ట్స్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. స్టార్ స్పోర్స్‌కు పిచ్చి పట్టిందని రాసుకొస్తున్నారు. అనేక మంది అభిమానులు పాపం రోహిత్ శర్మ అంటూ హిట్‌మ్యాన్‌పై జాలి చూపిస్తున్నారు. స్టార్ స్పోర్స్ కావాలని రోహిత్‌ను కించపరుస్తుందని అంటున్నారు. రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గొడవపెట్టాలని చూస్తోందని పలువురు సోషల్ మీడియాలో భగ్గుమంటున్నారు. పలువురు అభిమానులు మరోసారి ప్రపంచకప్‌లో జట్టు విజయాల క్రెడిట్‌ను ఒక్కరికే అపాదించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 2011 ప్రపంచకప్‌ను గుర్తు చేస్తున్నారు. ఆ ప్రపంచకప్‌ను టీమిండియా గెలవడంలో జట్టులోని ఆటగాళ్లంతా కీలక పాత్ర పోషించారని, కానీ చివరకు క్రెడిట్ మాత్రం ధోని ఒక్కడికే వెళ్లిందని అంటున్నారు. ఈ ప్రపంచకప్‌లోనూ అలాంటిదే జరిగేలా ఉందని పలువురు మండిపడుతున్నారు.

నిజానికి 2011 ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచినప్పటికీ క్రెడిట్ అంతా ధోనికే వెళ్లిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ వంటి వాళ్లు నేరుగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ధోని స్వార్థపరుడని క్రెడిట్ మొత్తం ఒక్కడే తీసుకున్నాడని ఘాటు విమర్శలు చేసిన వారు కూడా ఉన్నారు. అయితే స్టార్ స్పోర్ట్స్‌కు పలువురు కోహ్లీ అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ ఐకాన్ అని, అతని ఫోటో వాడడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సాధారణంగా ఉండాల్సిన కెప్టెన్ స్థానంలో రోహిత్ శర్మ ఫోటోనే వాడడం మంచిదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. జట్టు కెప్టెన్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందేనని అంటున్నారు.

Updated Date - 2023-11-14T11:55:44+05:30 IST