World Cup 2023: IND vs AUS హెడ్ టూ హెడ్ రికార్డులు.. వెదర్, పిచ్ రిపోర్టు ఇదిగో!
ABN , First Publish Date - 2023-10-08T11:27:47+05:30 IST
నేడు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ద్వారా ప్రపంచకప్‌లో భారత్ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. తొలి మ్యాచ్‌లోనే బలమైన ఆస్ట్రేలియాను ఓడించి తగిన ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
చెన్నై: నేడు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ద్వారా ప్రపంచకప్‌లో భారత్ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. తొలి మ్యాచ్‌లోనే బలమైన ఆస్ట్రేలియాను ఓడించి తగిన ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. రెండు జట్లు వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు 149 సార్లు తలపడ్డాయి. ఇందులో అత్యధికంగా ఆస్ట్రేలియా 83 మ్యాచ్‌ల్లో గెలిచింది. టీమిండియా 56 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. వన్డే ప్రపంచకప్‌లో రెండు జట్లు ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో పోటీపడ్డాయి. ఆస్ట్రేలియా 8, భారత్ 4 మ్యాచ్‌ల్లో గెలిచింది.
మ్యాచ్ జరిగే చెన్నై చెపాక్ పిచ్ రిపోర్టు విషయానికొస్తే.. ఇది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా పేరు తెచ్చుకుంది. చెపాక్ పిచ్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. ఆట సాగే కొద్ది స్పిన్ బౌలర్లకు గణనీయమైన పట్టు లభిస్తుంది. నేడు జరిగే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లొ కూడా ఇదే పరిస్థితులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇక్కడ జరిగే మ్యాచ్‌ల్లో ఆయా జట్లు ఎక్కువగా స్పిన్నర్లతో బరిలోకి దిగుతాయి. అలాగే ఈ పిచ్‌పై టాస్ గెలిచిన జట్లు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే ఈ పిచ్‌పై చేజింగ్ కష్టం. ఓపికతో క్రీజులో కుదురుకుని, సరైన టైమింగ్‌తో ఆడే బ్యాటర్లు మాత్రమే ఈ పిచ్‌పై పరుగులు రాబట్టగలరు. ఇక్కడ సాధారణంగా 260-270 స్కోర్లు నమోదవుతుంటాయి. ప్రస్తుతం భారత జట్టు నుంచి ఈ పిచ్‌పై విరాట్ కోహ్లీ ఒక్కడే ఇప్పటివరకు సెంచరీ చేశాడు.
ఈ పిచ్‌పై ఇప్పటివరకు 23 వన్డే మ్యాచ్‌లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 14 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 8 సార్లు గెలిచాయి. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 233 పరుగులుగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 205గా ఉంది. అత్యధిక స్కోర్ 337గా ఉంది. అత్యల్ప స్కోర్ 69గా ఉంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్లు 16 మ్యాచ్‌లు గెలవగా.. టాస్ ఓడిన జట్లు 6 సార్లు మాత్రమే గెలిచాయి. దీంతో ఈ పిచ్‌పై టాస్ కీలకం అని అర్థం అవుతోంది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చెన్నైలో నేడు వాతావరణం ఎలా ఉండబోతుందంటే.. ఇక్కడ శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నేడు ఆకాశం మేఘావృతమై ఉండనుంది. నేడు చెన్నైలో పగటిపూట ఉష్ణోగ్రత 34° సెల్సియస్, రాత్రి 27° సెల్సియస్‌గా ఉండనుంది. వర్షం పడే అవకాశం పగటిపూట 24%, రాత్రి పూట 15% మాత్రమే ఉంది. దీంతో మ్యాచ్ సాగేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చు. తేమ పగటిపూట 75% , రాత్రి 87% వరకు ఉంటుంది.