World cup: టీమిండియా మ్యాచ్ కాకపోయినా స్టేడియానికి పోటెత్తిన ఫ్యాన్స్.. ఎన్ని వేల మంది వచ్చారంటే..?
ABN , First Publish Date - 2023-10-24T22:01:09+05:30 IST
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ క్రికెట్ ప్రేమికులను అలరిస్తోంది. ముఖ్యంగా పసికూనలుగా భావించిన పలు జట్లు పెద్ద టీంలకు షాకిస్తూ సాధిస్తున్న సంచలన విజయాలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడడానికి అభిమానులు స్టేడియాలకు భారీగా హాజరవుతున్నారు.
ముంబై: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ క్రికెట్ ప్రేమికులను అలరిస్తోంది. ముఖ్యంగా పసికూనలుగా భావించిన పలు జట్లు పెద్ద టీంలకు షాకిస్తూ సాధిస్తున్న సంచలన విజయాలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడడానికి అభిమానులు స్టేడియాలకు భారీగా హాజరవుతున్నారు. అయితే ఇది కేవలం ఇండియా మ్యాచ్‌లకే పరిమితం అవుతోంది. టీమిండియా ఆడే మ్యాచ్‌లకు ప్రేక్షకులు భారీగా హాజరవుతున్నప్పటికీ ఇతర జట్లు ఆడే మ్యాచ్‌లను చూడడానికి స్టేడియాలకు రావడం లేదు. భారత్ ఆడే మ్యాచ్‌లకు స్టేడియాలు దాదాపు నిండుతున్నప్పటికీ ఇతర జట్లు ఆడే మ్యాచ్‌లకు 30 శాతం కూడా నిండడం లేదు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. టోర్నీ సాగే కొద్దీ ప్రపంచకప్‌పై ఆసక్తి పెరుగుతుండడంతో క్రమంగా ఇతర జట్ల మ్యాచ్‌లను చూడడానికి కూడా ప్రేక్షకులు స్టేడియాలకు తరలివస్తున్నారు. ఈ విషయంలో ముంబై ప్రేక్షకులు ముందున్నారు.
ఈ నెల 21న వాంఖడే వేదికగా జరిగిన సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్ చూడడానికి స్టేడియానికి ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఏకంగా 28 వేలకుపైగా ప్రేక్షకులు ఈ మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వచ్చారు. సాధారణంగా వాంఖడే స్టేడియం సిట్టింగ్ సామర్థ్యం 33 వేలుగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌కు ఏకంగా 80 శాతం పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. రెండు పెద్ద జట్లు కావడం.. దీనికి తోడు వీకెండ్ కూడా కావడంతో స్టేడియానికి ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌లో భారత్ ఆడిన మ్యాచ్‌లకు కాకుండా ఇతర మ్యాచ్‌లకు అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైంది ఈ మ్యాచ్‌కే కావడం గమనార్హం. ఇదే వాంఖడే స్టేడియం వేదికగా మంగళవారం సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఈ మ్యాచ్‌కు 16 వేలకు పైగా అభిమానులు హాజరయ్యారు. మొత్తంగా స్టేడియం కెపాసిటీలో ఇది దాదాపు సగంగా ఉంది. పైగా మంగళవారం వర్కింగ్ డే అయినప్పటికీ ప్రేక్షకులు ఈ స్థాయిలో స్టేడియానికి రావడం గమనార్హం. దీంతో క్రికెట్‌పై ముంబై ప్రేక్షకులకు ఉన్న అభిమానంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురైతే ముంబై వాళ్ల అభమానం సల్లగుండ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.