Share News

World Cup: భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్‌కు హాజరుకానున్న కేంద్ర హోమంత్రి అమిత్ షా

ABN , First Publish Date - 2023-10-31T08:17:57+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు కేంద్ర హోమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా నవంబర్ 5న జరిగే ఈ మ్యాచ్‌కు గౌరవ అతిథిగా హాజరుకావాలని హోంమంత్రి అమిత్ షాను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) కోరింది.

World Cup: భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్‌కు హాజరుకానున్న కేంద్ర హోమంత్రి అమిత్ షా

కోల్‌కతా: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు కేంద్ర హోమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా నవంబర్ 5న జరిగే ఈ మ్యాచ్‌కు గౌరవ అతిథిగా హాజరుకావాలని హోంమంత్రి అమిత్ షాను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) కోరింది. ఇందుకు ఆయన అంగీకరించారు. దీంతో ఆయన నేరుగా మైదానానికి వచ్చి భారత జట్టుకు మద్దతు తెలపనున్నారు. కాగా అమిత్ షా క్రికెట్ మ్యాచ్‌లకు హాజరు కావడం ఇది కొత్తేంకాదు. గతంలోనూ పలుమార్లు స్టేడియానికి వచ్చి టీమిండియాకు మద్దతు తెలిపారు. భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా రావాల్సి ఉంది. కానీ అనారోగ్య కారణాల రీత్యా ఆయన హాజరు కావడం లేదు. మరోవైపు మ్యాచ్ జరిగే నవంబర్ 5న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు కావడంతో మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. కోహ్లీ పుట్టిన రోజు కావడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కోహ్లీ ముఖంతో కూడిన 70,000 ఫేస్ మాస్క్‌లను పంపిణీ చేయాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ యోచిస్తోంది. సాధారణంగా ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం సిట్టింగ్ సామర్థ్యం 66,000గా ఉంది. దీంతో స్టేడియం మొత్తం కోహ్లీ పేస్ మాస్కులతో నిండిపోనుంది. అలాగే కోహ్లీతో బౌండరీ లైన్ వెలుపల బర్త్‌డే కేక్‌ను కూడా కట్ చేయించనున్నారు. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రముఖ గాయని శిల్పా రావు సంగీత ప్రదర్శన కూడా ఉండనుంది.


ఇక టోర్నీలో వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్ సెమీ ఫైనల్‌కు చేరువైంది. మిగిలిన 3 మ్యాచ్‌ల్లో కనీసం ఒక మ్యాచ్‌ గెలిచినా సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా 6 మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే భారత జట్టు సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందే శ్రీలంకతో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నవంబర్ 2న ఈ మ్యాచ్ జరగనుంది. కాగా భారత్, శ్రీలంక జట్లు 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగానే జరిగింది. 2న జరగబోయే మ్యాచ్ కూడా వాంఖడేలోనే జరగనుండడంతో ఆసక్తి నెలకొంది.

Updated Date - 2023-10-31T08:17:57+05:30 IST