Share News

World Cup: టీమిండియాను భయపెడుతున్న 40 ఏళ్ల రికార్డులు.. ప్రపంచకప్‌ చరిత్రలో సెమీస్‌‌లో మన ప్రదర్శన ఎలా ఉందంటే..?

ABN , First Publish Date - 2023-11-14T09:33:08+05:30 IST

India vs New Zealand: చూస్తుండగానే వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ పోటీలు ముగిశాయి. ఈ నెల 15, 16న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో, నాలుగో స్థానంలో నిలిచిన భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫామ్, బలబలాల పరంగా చూస్తే కివీస్‌ను ఓడించడం టీమిండియాకు పెదగా కష్టం కాదు.

World Cup: టీమిండియాను భయపెడుతున్న 40 ఏళ్ల రికార్డులు.. ప్రపంచకప్‌ చరిత్రలో సెమీస్‌‌లో మన ప్రదర్శన ఎలా ఉందంటే..?

ముంబై: చూస్తుండగానే వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ పోటీలు ముగిశాయి. ఈ నెల 15, 16న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో, నాలుగో స్థానంలో నిలిచిన భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫామ్, బలబలాల పరంగా చూస్తే కివీస్‌ను ఓడించడం టీమిండియాకు పెదగా కష్టం కాదు. కానీ గత రికార్డులు మన జట్టును భయపెడుతున్నాయి. గతంలో మన జట్టు లీగ్ దశలో ఎంత అద్భుతంగా ఆడిన సెమీస్‌లో అనేక సార్లు బోల్తా పడింది. లీగ్ దశలో ఈ సారి కప్ మనదే అనే స్థాయిలో విజృంభించి ఆడిన జట్టు సెమీస్ గండాన్ని చాలా సార్లు దాటలేకపోయింది. ఇది ఈ మధ్య కాలంలో మరి ఎక్కువైపోయింది.

2011 ప్రపంచకప్ తర్వాత నాకౌట్ దశలో మన జట్టు తీవ్రంగా తడబడుతోంది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోయింది. అందులో ముఖ్యంగా న్యూజిలాండ్ గండాన్ని దాటలేకపోతుంది. ఆ జట్టు చేతిలోనే రెండు సార్లు ఓడింది. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా గత సెమీస్ రికార్డులు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం.

India-semifinal-2023-ODI-WC.webp

48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్ జట్టు 7 సార్లు సెమీ ఫైనల్ చేరింది. అందులో మూడు సార్లు మాత్రమే సెమీస్‌లో నెగ్గి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఏకంగా 4 సార్లు ఓడిపోయింది. అంటే మనం ఇప్పటివరకు సెమీస్‌లో గెలిచిన దాని కన్నా ఓడిందే ఎక్కువ. వన్డే ప్రపంచకప్ మొదలయ్యాయ తొలి రెండు ఎడిషన్‌లో అంటే 1975, 1979లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. తొలి సారి 1983లో సెమీస్ చేరింది. ఆ సెమీస్‌లో అతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి తొలి సారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన 1987 ప్రపంచకప్‌లోనూ టీమిండియా సెమీస్ చేరింది. కానీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్ పోరులో టీమిండియా 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. 1992 ప్రపంచకప్‌లో టీమిండియా రౌండ్ రాబిన్ దశను కూడా దాటలేకపోయింది. 1996లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా మరోసారి సెమీస్ చేరింది. కానీ మన జట్టుకు ఈ సారి కూడా భంగపాటు ఎదురైంది. కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఇక 1999 ప్రపంచకప్‌లో అయితే భారత జట్టు లీగ్ దశను కూడా దాటలేకపోయింది.

సౌతాఫ్రికా వేదికగా జరిగిన 2003 ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొట్టింది. ఆ ప్రపంచకప్ సెమీస్‌లో కెన్యాపై 91 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా ఫైనల్‌లో అడుగుపెట్టింది. జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆ సెమీస్‌లో సెంచరీతో చెలరేగాడు. కానీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. 2007 ప్రపంచకప్‌లో అయితే మన జట్టు తీవ్రంగా నిరాశపరించింది. లీగ్ దశను కూడా దాటలేకపోయింది. ఇక సొంతగడ్డపై జరిగిన 2011లో ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుతంగా ఆడింది. నాకౌట్ దశలో వరుస ఓటములకు బ్రేక్ వేస్తూ సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఫైనల్‌లోనూ శ్రీలంకను ఓడించి ప్రపంచకప్‌ను రెండో సారి గెలిచింది.

104427926.webp

ఇక 2015 ప్రపంచకప్ సెమీస్‌లో అతిథ్య జట్టు ఆస్ట్రేలియా చేతిలో మన జట్టు ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 95 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన గత 2019 ప్రపంచకప్‌లోనూ సెమీస్‌లో టీమిండియాకు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ముందు ఉన్నది 240 పరుగుల మోస్తారు లక్ష్యమే అయినప్పటికీ మన బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 18 పరుగుల తేడాతో ఓటమి ఎదురైంది. మొత్తంగా1983 నుంచి టీమిండియా గత 40 ఏళ్లలో 7 సార్లు సెమీ ఫైనల్ చేరింది. అందులో 3 సార్లు గెలవగా.. 4 సార్లు ఓడిపోయింది. 1983, 2003, 2011 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో గెలవగా.. 1987, 1996, 2015, 2019 సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయింది. కాగా టీమిండియా సెమీస్ చేరడం ఇది 8వ సారి. అయితే 4 దశాబ్దాలుగా ఉన్న గత రికార్డులు ఎలా ఉన్న ప్రస్తుత ఫామ్ ముఖ్యం కాబట్టి వాటి గురించి పెదగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సారి సెమీస్ గండాన్ని దాటి వరుసగా నాకౌట్ పోటీల్లో ఎదురవుతున్న పరాభవాలకు టీమిండియా బ్రేక్ వేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Updated Date - 2023-11-14T09:33:10+05:30 IST