Share News

World Cup: భారత్, న్యూజిలాండ్ పోరుకు వర్షం ముప్పు.. మ్యాచ్ జరుగుతుందా?.. లేదా?..

ABN , First Publish Date - 2023-10-22T09:09:03+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో నేడు జరగనున్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.

World Cup: భారత్, న్యూజిలాండ్ పోరుకు వర్షం ముప్పు.. మ్యాచ్ జరుగుతుందా?.. లేదా?..

ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో నేడు జరగనున్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. స్థానిక వాతావరణ నివేదిక ప్రకారం.. మ్యాచ్ జరిగే సమయంలో ధర్మశాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్ సమయంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయి. దీంతో మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడొచ్చు. ఇది భారీ వర్షంగా మారిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మ్యాచ్ సమయంలో స్థానిక ఉష్ణోగ్రతలు 18°సెల్సియస్‌గా ఉండనున్నాయి. దక్షిణం, నైరుతీ దిశగా గంటకు 9 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభమయ్యే మధ్యాహ్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయి. దీంతో టాస్ ఆసల్యమవొచ్చు. సాయంత్రం తర్వాత అంటే సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో కూడా వర్షం పలుమార్లు అడ్డుతగిలే అవకాశాలున్నాయి. వర్షం కారణంగా పూర్తి ఆటకు నష్టం కల్గకపోయినా కొంత వరకు ఆటంకం కల్గొచ్చు. అప్పుడు ఓవర్లు తగ్గించి మ్యాచ్‌ను నిర్వహించే అవకాశాలుంటాయి. దీంతో పూర్తి ఆట సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.


ఇక మ్యాచ్ జరిగే ధర్మశాల పిచ్ రిపోర్టు విషయానికొస్తే.. ఇక్కడ ఉండే చల్లటి వాతావరణం కారణంగా పరిస్థితులు పేసర్లకు అనుకూలిస్తుంటాయి. దీంతో ఈ పిచ్‌పై పేసర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రెండు జట్లలో మంచి పేసర్లు ఉండడంతో బ్యాటర్లకు సవాల్ తప్పకపోవచ్చు. శనివారం పిచ్‌పై పచ్చిక ఎక్కువగా కనిపించింది. కానీ అది మ్యాచ్ సమయానికి తగ్గిపోవచ్చు. అయినప్పటికీ ఆరంభంలో పేసర్లు ప్రభావం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పేసర్ల అంతా కాకపోయినా ఇక్కడ స్పిన్నర్లకు కూడా మంచి అవకాశాలుంటాయి. అయితే మొత్తంగా పేసర్ల ప్రభావమే ఎక్కువ కాబట్టి ఇద్దరు స్పిన్నర్లతోనే టీమిండియా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. దీంతో అశ్విన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే ఈ పిచ్‌పై బ్యాటింగ్ మరి అంత కష్టమేమి కాదు. క్రీజులో కుదురుకుంటే పరుగులు సాధించొచ్చు. మొత్తంగా ఇది సమతూకమైన పిచ్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ జరిగిన చివరి 10 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు సగటు స్కోరు 254. ఇక మంచు ప్రభావం ఉండడంతో టాస్‌ గెలిచిన టీమ్‌ ఛేజింగ్‌కు మొగ్గు చూపవచ్చు.

Updated Date - 2023-10-22T09:10:21+05:30 IST