Share News

World cup: IND vs PAKలలో ఎవరి బలమెంత? బలహీనతలేంటి? గెలిచే సత్తా ఉన్నా టీం ఏది?

ABN , First Publish Date - 2023-10-14T09:53:27+05:30 IST

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది.

World cup: IND vs PAKలలో ఎవరి బలమెంత? బలహీనతలేంటి? గెలిచే సత్తా ఉన్నా టీం ఏది?

అహ్మాదాబాద్: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచకప్ ప్రారంభమై 10 రోజులు కావొస్తున్నప్పటికీ, 11 మ్యాచ్‌లు కూడా పూర్తైనప్పటికీ.. అసలు మజా మాత్రం భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌తోనే రానుంది. ఈ ప్రపంచకప్‌లో రెండు జట్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నాయి. రెండు జట్లు తమ గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. అత్యధిక మంది ఈ మ్యాచ్‌లో భారత జట్టునే ఫెవరేట్‌గా పరిగణిస్తున్నప్పటికీ పాకిస్థాన్‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే పాకిస్థాన్ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేం. తనదైన రోజు ఎంతటి బలమైన జట్టునునైనా ఓడిస్తుంది. కానీ అంతలోనే చిన్న జట్ల చేతిలో ఓడి అందరిని ఆశ్చర్యపరుస్తుంటుంది. పాకిస్థాన్ గురించిన గత చరిత్ర ఇదే చెబుతుంది. అయితే గతం ఎలా ఉన్న ప్రస్తుత మ్యాచ్‌కు ముందు రెండు జట్ల బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయో ఒక సారి పరిశీలిద్దాం.


ఆసియా కప్ నుంచి భారత జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆటగాళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తూ అదరగొడుతున్నారు. మన ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా మన ఓపెనర్లు కనుక క్రీజులో కుదురుకుంటే దాదాపు ఓవర్లన్నీ వాళ్లే ఆడేయగలరు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మకు తోడుగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లలో ఎవరు ఆడతారనేది తెలియాల్సి ఉంది. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటేనే పునకాలు వచ్చినట్టుగా రెచ్చిపోతాడు. పాకిస్థాన్‌పై ఆడిన 8 ప్రపంచకప్ మ్యాచ్‌లలో ఒకసారి మాత్రమే 50 పరుగుల లోపు ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలతో మిడిలార్డర్‌ బలంగా కనిపిస్తోంది.గాయం తర్వాత రాహుల్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు భారీ ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపిస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా గతంలో పలుమార్లు ఇలాంటి ఇన్నింగ్స్‌లే ఆడాడు. ముఖ్యంగా క్రీజులో కుదురుకున్నాడంటే అతడిని ఆపడం కష్టం. ఇక ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రాణించడంతోపాటు డెత్ ఓవర్లలో ధాటిగా ఆడి పరుగులు రాబడుతాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో మన జట్టు త్వరగా వికెట్లు కోల్పోయినప్పటికీ ఇషాన్ కిషన్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

బౌలింగ్‌లో పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పవర్ ప్లేలోనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కష్టాల్లోకి నెడుతున్నారు. ఈ సంవత్సరం పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసింది సిరాజే కావడం గమనార్హం. అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ కంగారు పడాల్సిన అవసరం లేదు. గాయం తర్వాత కూడా బుమ్రా స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ చేస్తుండడం విశేషం. ముగిసిన రెండు మ్యాచ్‌ల్లోనూ చక్కగా బౌలింగ్ చేశాడు. వీరికి తోడు శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా సత్తా చాటుతున్నారు. కాకపోతే ఈ మ్యాచ్‌లో వీరిద్దరిలో ఒకరికే చోటు దక్కుతుంది. ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ చేతికి బంతి ఇచ్చిన ప్రతిసారి వికెట్ తీసి ఆకట్టుకుంటున్నాడు. పిచ్ కాస్త అనుకూలించిందంటే అతడిని ఆపడం కష్టం. అతనికి బాబర్‌పై మంచి రికార్డు కూడా ఉంది. కుల్దీప్‌కు తోడు జడేజా కూడా అదరగొడుతున్నాడు. వీరికి తోడు అశ్విన్‌ ఉండనే ఉన్నాడు. ఫీల్డింగ్‌లోనూ మన ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ అద్భుత క్యాచ్‌లను అందుకున్నారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రోహిత్ రెండు క్యాచ్‌లను నేలపాటు చేసినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొత్తానికి మన జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మైదానంలోని ప్రేక్షకుల మద్దతు అంతా కూడా మన జట్టుకే లభించనుంది. ఇది మన ఆటగాళ్లకు మరింత జోష్ ఇవ్వనుంది.

ఇక పాకిస్థాన్ జట్టు విషయానికొస్తే ఆటగాళ్ల ఫామే ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ఫామ్‌లో లేడు. గత 5 మ్యాచ్‌ల్లో కలిపి 71 పరుగులు మాత్రమే చేశాడు. పైగా భారత్‌తో మ్యాచ్‌ల్లో అతను రాణించింది తక్కువ సందర్భాలే ఉన్నాయి. అలా అని ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న బాబర్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఓపెనింగ్‌లో భారత్‌తో పోల్చుకుంటే పాకిస్థాన్ బలహీనంగానే ఉంది. కానీ గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన అబ్దుల్లా షఫీక్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే పాక్ మిడిలార్డర్ బ్యాటర్ మహ్మద్‌ రిజ్వాన్‌ నిలకడగా రాణిస్తున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో కీలక సమయాల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో అయితే భారీ లక్ష్య చేధనలో అజేయ సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు. అయితే రిజ్వాన్‌ను మినహాయిస్తే పాకిస్థాన్ జట్టులోని మిగతా మిడిలార్డర్ బ్యాటర్లు అంత బలంగా ఏమి లేరనే చెప్పుకోవాలి. ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్ వంటి బ్యాటర్లు కీలక సమయాల్లో రాణించిన సందర్బాలు తక్కువే. షహీన్ ఆఫ్రిదీ, హరీస్ రౌఫ్, అసన్ అలీతో పేపర్‌పై పాక్ పేస్ బౌలింగ్ బలంగా కనిపిస్తున్నప్పటికీ వారు ప్రస్తుతం సరైన ఫామ్‌లో లేరు. ముఖ్యంగా అసన్ అలీ వికెట్లు తీసిన భారీగా పరుగులు ఇస్తుంటాడు. అయితే షహీన్ ఆఫ్రిదీ నుంచి భారత టాపార్డర్‌కు మాత్రం ప్రమాదం పొంచి ఉంది. గతంలో అతను పలుమార్లు భారత టాపార్డర్‌ను కూల్చాడు. ఆ జట్టు స్పిన్ బౌలింగ్ అయితే బలహీనంగా ఉంది. స్పిన్నర్లు షాదాబ్‌, నవాజ్‌ ప్రభావం చూపడం లేదు. గత రికార్డులు కూడా పాకిస్థాన్‌కు ఏ మాత్రం అనుకూలంగా లేవు. గతంలో ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ భారతే గెలిచింది. పైగా ప్రేక్షకుల నుంచి పాక్ జట్టుకు ఏ మాత్రం మద్దతు లభించే అవకాశం లేదు. ఇది ఆ జట్టును మరింత ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. మొత్తానికి ప్రస్తుత ఫామ్ పరంగా చూస్తే భారత్ కన్నా పాకిస్థాన్ బలహీనంగా ఉంది. అద్భుతంగా ఆడితే తప్ప భారత్‌ను ఓడించే అవకాశాలు లేవు. అనేక మంది క్రికెట్ విశ్లేషకులు సైతం ఈ మ్యాచ్‌లో భారతే గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2023-10-14T11:06:05+05:30 IST