World Cup: మరింత ముదిరిన వివాదం.. మా దేశానికి వస్తే రాళ్లతో కొడతాం.. షకీబ్‌కు మాథ్యూస్ బ్రదర్ వార్నింగ్
ABN , First Publish Date - 2023-11-09T13:13:15+05:30 IST
Mathews Brother Warns to Shakib: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్‌డ్ ఔట్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ వివాదం మరింతగా ముదిరింది. ఈ వివాదంలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతోపాటు రెండు దేశాల అభిమానుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. అయితే ఈ వివాదంలో మెజారిటీ మంది మాథ్యూస్‌కు అండగా నిలుస్తున్నారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను తప్పుబడుతున్నారు.
శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్‌డ్ ఔట్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ వివాదం మరింతగా ముదిరింది. ఈ వివాదంలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతోపాటు రెండు దేశాల అభిమానుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. అయితే ఈ వివాదంలో మెజారిటీ మంది మాథ్యూస్‌కు అండగా నిలుస్తున్నారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను తప్పుబడుతున్నారు. షకీబ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని అంటున్నారు. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 6న బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏంజెలో మాథ్యూస్ టైమ్‌డ్ ఔట్‌గా ఒక బంతి కూడా ఆడకుండానే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో టైమ్‌డ్ ఔట్‌గా పెవిలియన్ చేరిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.
దీంతో అప్పటి నుంచి బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై శ్రీలంక అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదం షకీబ్‌కు వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లింది. షకీబ్ తమ దేశంలోకి వస్తే రాళ్లతో కొడతామని స్యయంగా మాథ్యూస్ సోదరుడు హెచ్చరించడం గమనార్హం. ఈ హెచ్చరికలతో ఈ వివాదం తీవ్ర దుమారంగా మారుతోంది. షకీబ్ చర్యల పట్ల మాథ్యూస్ సోదరుడు ట్రెవిస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. షకీబ్‌పై విమర్శలు వర్షం కురిపించిన ట్రెవిస్ అతడిని శ్రీలంకలోకి రానివ్వబోమని హెచ్చరించాడు. ఒకవేళ అంతర్జాతీయ క్రికెట్ ఆడడంలో భాగంగా షకీబ్ శ్రీలంకలోకి అడుగుపెడితో అతడిపై రాళ్లతో దాడి చేస్తామని అన్నాడు. ‘‘మేము చాలా నిరాశకు గురయ్యాము. బంగ్లాదేశ్ కెప్టెన్‌కు క్రీడా స్ఫూర్తి లేదు. అతను జెంటిల్‌మన్ గేమ్‌లో మానవత్వం చూపలేదు. ఇలాంటివి షకీబ్‌తోపాటు అతని జట్ట నుంచి వస్తాయని మేము కూడా ఆశించలేదు. షకీబ్‌ను శ్రీలంకలోకి రానివ్వం. ఒకవేళ షకీబ్ ఏదైనా అంతర్జాతీయ మ్యాచ్ లేదా శ్రీలంక ప్రీమియరల్ లీగ్‌లో పాల్గొనడానికి వస్తే అతనిపై అభిమానులు రాళ్లు విసురుతారు. దీంతో అతను దానికి సిద్ధంగా ఉండాలి. లేదంటే అభిమానుల నుంచి వేధింపులు తప్పవు.’’ అని ట్రెవిస్ అన్నాడు.
అసలు ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ అనూహ్యంగా అవుటయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘టైమ్‌డ్ అవుట్’ అయిన తొలి ఆటగాడిగా మాథ్యూస్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఇంతకీ అతడి నిష్క్రమణకు కారణం హెల్మెట్. అవును..హెల్మెటే! సదీర సమరవిక్రమ అవుట్ కావడంతో ఆరో నెంబర్ బ్యాటర్‌గా మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. షకీబ్ అల్ హసన్ బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతూ హెల్మెట్ స్ట్రాప్‌ను సరిచేసుకుంటుండగా.. ఆ స్ట్రాప్ కాస్తా తెగి పోయింది. దాంతో అతడు మరో హెల్మెట్ కోసం సంజ్ఞ చేశాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన మరో బ్యాటర్ మూడు నిమిషాల్లోగా బంతిని ఎదుర్కోవాలి. లేదంటే అతడు ‘టైమ్‌డ్ అవుట్’ అవుతాడు. అయితే వరల్డ్‌కప్ కోసం ఈ నిబంధనను రెండు నిమిషాలకు మార్చారు. దాంతో అప్పటికే మాథ్యూస్ వచ్చి రెండు నిమిషాలు దాటడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ‘టైమ్‌డ్ అవుట్’ కోసం అప్పీల్ చేశాడు. దానిని పరిగణనలోకి తీసుకున్న ఫీల్డ్ అంపైర్లు మాథ్యూ్‌సను ఆ మేరకు అవుట్‌గా ప్రకటించారు. కానీ తన హెల్మెట్‌తో సమస్య ఎదురైందని, అందువల్లే ఆలస్యమైందని ఏంజెలో వాదించాడు. దీంతో నిర్ణయాన్ని బంగ్లా కెప్టెన్ ఇష్టానికి వదిలేశారు. అయితే అవుట్ ఇవ్వాల్సిందేనని కెప్టెన్ షకీబల్ చెప్పడంతో మాథ్యూస్ తీవ్ర అసహనంతో వెనుదిరిగాడు. పురుషులు, మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది తొలి ఘటన కావడం గమనార్హం. ఈ ఘటన క్రికెట్ స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం ఇలాంటి ఘటనలు ఆరుసార్లు చోటుచేసుకున్నాయి.