World cup: సడెన్‌గా ఓ రోజు నేను చెత్త కెప్టెన్‌ను కావొచ్చు.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-11-02T14:56:13+05:30 IST
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా దుమ్ములేపుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా దుమ్ములేపుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో కూడా ఓడిపోని ఏకైక జట్టు భారత్ మాత్రమే కావడం గమనార్హం. దీంతో ఇదే ఊపులో టీమిండియా ఈ సారి ప్రపంచకప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా భారత జట్టు చివరగా 2011లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రోహిత్ శర్మకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా తన కెప్టెన్సీ గురించి వివరించమని అడినప్పుడు హిట్‌మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది కానీ, సడెన్‌గా ఓ రోజు తనపై చెత్త కెప్టెన్‌గా ముద్ర పడొచ్చని వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో తాను మైదానంలోని పరిస్థితులను అంచనా వేస్తానని రోహిత్ శర్మ చెప్పాడు. ఆట ఎటువైపు వెళ్తుందనే అంశం ఆధారంగానే తాను నిర్ణయాలు తీసుకుంటానని తెలిపాడు. అయితే కొన్ని సార్లు అనుకూల ఫలితాలు వస్తాయని, మరికొన్ని సార్లు మాత్రం అలా జరగదని చెప్పుకొచ్చాడు. కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండాలని చెప్పాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యర్థి జట్ల బలబలాల ఆధారంగా తాను నిర్ణయాలు తీసుకుంటానని తెలిపాడు. అయితే ఇదంతా కూడా జట్టు సమిష్టి నిర్ణయం అని, క్రెడిట్ మొత్తం టీం సభ్యులకే దక్కుతుందని రోహిత్ చెప్పాడు. ‘‘ఇదంతా జట్టు సమిష్టి నిర్ణయం. మ్యాచ్‌లో ఆడిన మిగతా 10 మందికి కూడా పూర్తి క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే ఇది నా ఆలోచన మాత్రమే కాదు. జట్టులోని అందరి ఆలోచనలు భాగమై ఉంటాయి. వికెట్ల కోసం వెళ్లడానికి ప్రయత్నించినప్పుట కొంచెం భిన్నమైన ఫీల్డ్ ప్లేస్‌మెంట్ సెట్ చేస్తానని తెలిపాడు. అలాంటి వాటితో బ్యాటర్లను ఔట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇది మ్యాచ్ వ్యూహాత్మక అంశంలో భాగం. అయితే ఇది అవసరమని అనిపించినప్పుడు చేస్తాను. అందుకు అనుగుణంగా కట్టుబడి ఉన్నందుకు ఆటగాళ్లకు హ్యాట్సాఫ్. పరిస్థితులు అనుకూలంగా ఉన్నంతసేపు అంత బాగానే ఉంటుంది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే సడెన్‌గా ఓ రోజు నాపై చెత్త కెప్టెన్ అని కూడా ముద్ర పడొచ్చు. నాకు ఆ విషయంపై అవగాహన ఉంది. అయితే జట్టు ప్రయోజనాల దృష్యా కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాను.’’ అని రోహిత్ చెప్పాడు.