Share News

World cup: పూల దండలు వేసి, పూలు చల్లి.. లక్నో చేరుకున్న భారత జట్టుకు ఘనస్వాగతం

ABN , First Publish Date - 2023-10-26T09:03:16+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 5 విజయాలతో జోరు మీదున్న భారత్ తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ నెల 29న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

World cup: పూల దండలు వేసి, పూలు చల్లి.. లక్నో చేరుకున్న భారత జట్టుకు ఘనస్వాగతం

లక్నో: వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 5 విజయాలతో జోరు మీదున్న భారత్ తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ నెల 29న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఓటమెరుగని ఏకైక జట్టుగా ఉన్న టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ పరంగా చూస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియానే హాట్ ఫెవరేట్‌గా కనిపిస్తోంది. అయితే ఇంగ్లండ్‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీళ్లేదు. మ్యాచ్ విన్నర్లతో కూడిన ఆ జట్టును ఓడించడం అంత తేలిక కాదు. పైగా గత వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో ఈ సారి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది.


అయితే ఈ మ్యాచ్ కోసం భారత జట్టు బుధవారం రాత్రి లక్నో చేరుకుంది. టీమిండియా ఆటగాళ్లు హోటల్లోకి అడుగుపెట్టే సమయంలో వారికి ఘనస్వాగతం లభించింది. బస్సు దిగి వస్తున్న ఆటగాళ్లకు హోటల్ సిబ్బంది సాంప్రదాయ పద్దతిలో ఆహ్వానం పలికింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం బస్సు దిగి వస్తున్న ఆటగాళ్లందరిని హోటల్ సిబ్బంది పూలదండలతో సన్మానించింది. ఆటగాళ్లు నడిచి వస్తుంటే వారిపై పూల వర్షం కురిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, శార్డూల్ ఠాకూర్ బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-10-26T09:12:43+05:30 IST