MLC Kavitha: వెకిలిగా మాట్లాడడం రేవంత్‌రెడ్డికే సాధ్యం
ABN , First Publish Date - 2023-08-22T16:59:30+05:30 IST
60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో, పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లుపై వారి అధిష్టానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా?. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో గౌరవ సోనియా గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ
బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యాక ఎమ్మెల్సీ కవిత-ప్రతిపక్ష పార్టీల మధ్య మహిళా రిజర్వేషన్‌పై డైలాగ్ వార్ నడుస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ (CM Kcr).. 115 మందితో కూడిన ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేశారు. ఇందులో ఆరుగురు మహిళలకే ప్రాధాన్యత కల్పించారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు.. ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ ఢిల్లీలో కవిత చేపట్టిన దీక్షను ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించారు. ఫస్ట్ లిస్టులో 33% రిజర్వేషన్ ఎక్కడా? అంటూ కవితను నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను కవిత (MLC Kavitha) తిప్పికొట్టారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత ట్వీట్..
‘‘60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో, పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లుపై వారి అధిష్టానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా?. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో గౌరవ సోనియా గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ, గాంధీ భవన్ గాడ్సే అయిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదు..? ఉత్తరప్రదేశ్‌లో 33% సీట్లను మహిళలకు కేటాయించామని సొల్లు కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారన్నది గుర్తుంచుకోవాలి. గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే.. ముగ్గురు గెలవగా, 18 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చింది. తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు నీతులు చెబుతున్నారు. తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలనే మా డిమాండ్‌ను కూడా వెకిలిగా మాట్లాడడం రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యం. ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రం అయినా, మహిళలకు దక్కాల్సినన్ని స్థానాలు దక్కడం లేదనదే మహిళల ఆవేదన. రాజ్యంగ పరంగానే మహిళల హక్కులు అమలు కావాలి. దానికి చిత్తశుద్దితో అన్ని పార్టీలు కలిసి రావాలి. నేను ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపాను. కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదు.. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు.’’ అని కవిత ధ్వజమెత్తారు.