Revanth Reddy: ‘సరూర్‌నగర్‌లో భారీ సభ.. ముఖ్య అతిథిగా ప్రియాంకా గాంధీ’
ABN , First Publish Date - 2023-04-18T14:02:48+05:30 IST
టీఎస్‌పీఎస్సీ కేసు విచారణ రాష్ట్ర అధికారులు చేపడితే కేసులో నిజానిజాలు నిగ్గు తేలవని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ కేసు (TSPSC Leakage Case) విచారణ రాష్ట్ర అధికారులు చేపడితే కేసులో నిజానిజాలు నిగ్గు తేలవని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వంలో పెద్దలను కాపాడుకునేందుకే ప్రభుత్వం సిట్‌ను ఉపయోగించుకుందన్నారు. ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ (PM Modi) నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. 22 కోట్ల 6 లక్షల దరఖాస్తులు వస్తే 7,22,311 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్‌లో ప్రధాని సమాధానం ఇచ్చారని.. అంటే పార్లమెంటు (Parliament) సాక్షిగా నిరుద్యోగులను మోసం చేసినట్లు ప్రధాని అంగీకరించారన్నారు. తెలంగాణ (Telangana)లో అధికారంలోకి వస్తే ఒకే రోజులో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) చెబుతున్నారని.. బండి మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామన్నారు... ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారన్నారు. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో బండికి తెలుసా? అని రేవంత్ ప్రశ్నించారు.
ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్, ఒకే రోజు 2 లక్షల ఉద్యోగాలని బండి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రం నుంచి పార్లమెంట్ వరకు నిరుద్యోగుల కోసం కొట్లాడింది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ మోదీ ఇంటి దగ్గర చేయాలని హితవుపలికారు. ఈ నెల 21న నల్గొండలో మాహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న ఖమ్మం జిల్లాలో, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. మే 4 లేదా 5న సరూర్‌నగర్‌లో నిరుద్యోగుల సమస్యలపై భారీ సభ నిర్వహిస్తామన్నారు. ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి.. సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళతామని అన్నారు. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొంటారని టీపీసీసీచీఫ్ పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదని.. నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటమని స్పష్టం చేశారు. అన్ని నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలపాల్సిందిగా కోరారు. మే 9 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో విడత కార్యక్రమం ఉంటుందని.. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.