Minister KTR : రేవంత్‌రెడ్డి గెలిచాక బీజేపీలోకి జంప్ అవుతాడు

ABN , First Publish Date - 2023-10-07T15:29:55+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)గెలిచాక బీజేపీలోకి జంప్ అవుతాడని మంత్రి కేటీఆర్(Minister KTR) ఆరోపించారు.

Minister KTR : రేవంత్‌రెడ్డి గెలిచాక బీజేపీలోకి జంప్ అవుతాడు

కామారెడ్డి : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)గెలిచాక బీజేపీలోకి జంప్ అవుతాడని మంత్రి కేటీఆర్(Minister KTR) ఆరోపించారు. శనివారం నాడు కామారెడ్డిలో పర్యటించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘కేసీఆర్ కామారెడ్డిని ఎందుకు ఎంచుకున్నారని రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. 2001లో మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం గెలుచుకున్నాం. 2004లో పొత్తులో భాగంగా ఇక్కడ షబ్బీర్ అలీ కామారెడ్డి సీటు తీసుకున్నారు. నాడు షబ్బీర్ అలీ బతిమిలాడితేనే కేసీఆర్ ప్రచారానికి వచ్చారు. కామారెడ్డితో కేసీఆర‌్‌కు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. బీబీపేట మండలంలోని పోసానిపల్లి మా నానమ్మ ఊరు. గంపగోవర్ధన్ కోరిక మేరకే కేసీఆర్ ఇక్కడ పోటీకి సిద్ధమయ్యారు. నెర్రెలు బారిన, నెత్తురు పారిన ఈ నేల సస్యశ్యామలం కావాలని కేసీఆర్ ఇక్కడ పోటీకి చేయబోతున్నారు. కేసీఆర్ ఏది చేసినా సంచలనమే.

కేసీఆర్ పేరు ప్రకటించిన మరుక్షణమే గెలుపు ఖరారైంది. ఎమ్మెల్యే టికెట్లు రాని కులాల వారికి నామినేటెడ్ పదవులు కల్పిస్తాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది మా సిద్ధాంతం. తెలంగాణలో గెలవగానే మహారాష్ట్రలో గెలిచేలా ప్లాన్ చేసుకుంటున్నాం. దమ్మున్న నాయకుడు కావాలని మహారాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. కామారెడ్డిలో మెజార్టీ రికార్డు బద్దలు కొట్టాలి.. దేశం నివ్వెర పోయి చూడాలి. మన పంచాయతీలు పక్కన పెట్టాలి.. అందరూ ఒక్కటి కావాలి.. పాత పగలను పట్టించుకోవద్దు. కామారెడ్డి మేనిఫెస్టో ప్రత్యేకంగా తయారు చేస్తాం. మీరు కోరినవన్నీ తీరుస్తాం. కాంగ్రెస్, బీజేపీ నేతలను తక్కువ అంచనా వేయద్దు. కాంగ్రెస్ నేతలకి కర్ణాటక నుంచి డబ్బులు వస్తాయి. అదానీ పంపే డబ్బులు మోదీ దగ్గర బాగా ఉన్నాయి. బీజేపీది ఉత్త మేకప్.. కాంగ్రెస్ పాకప్. రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి తెలంగాణాకు తీరని ద్రోహం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వేగాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నాడు నోటుకు ఓటు.. ఇప్పుడు సీటుకు రేటు. మేము ఎవ్వరికీ బీ టీమ్ కాదు.. ఆ ఖర్మ మాకు పట్టలేదు. ఆరు గ్యారంటీలని ప్రజలె నమ్మరు’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-07T15:29:55+05:30 IST