Revanth Reddy: ‘కేసీఆర్ భూతం లాంటోడు... సీసాలో బంధించాలి... లేకపోతే’

ABN , First Publish Date - 2023-02-08T11:12:38+05:30 IST

ప్రగతిభవన్‌ను కూల్చివేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.

Revanth Reddy: ‘కేసీఆర్ భూతం లాంటోడు... సీసాలో బంధించాలి... లేకపోతే’

మహబూబాబాద్: ప్రగతిభవన్‌‌ను (Bragathi Bhavan) కూల్చివేయాలన్న తన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు (BRS Leader) ఫిర్యాదు చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) స్పందించారు. ‘‘నేను కేసులకు భయపడను.. నాకు కేసులు కొత్త కాదు. కేసీఆర్ భూతం లాంటివారు... పట్టి సీసాలో బంధించాలి.... లేకపోతే తట్టుకోలేం’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ కాంగ్రెస్‌కు (Congress) సపోర్టు చేయాలని పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు అనమతి లేని ప్రగతిభవన్ ఎందుకని మరోసారి నిలదీశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) సిద్ధాంతం మంచిదే అని... ఆయన ఎంచుకున్న బీజేపీ విధానం సరైంది కాదన్నారు. పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాని (KCR Government)కి రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. తెలంగాణ ద్రోహులకే మంత్రి వర్గంలో 90 శాతం పదవులు అప్పజెప్పారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రేవంత్ ఏమన్నారంటే....

ములుగు జిల్లాలో ‘‘హాత్‌ సే హాత్ జోడో’’ యాత్ర (Hath se Hath Jodo Yatra) భాగంగా ప్రగతిభవన్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పేదలకు ఉపయోగం లేని ప్రగతిభవన్ ఎందుకని ప్రశ్నించారు. ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చేయాలని అన్నారు. ఆనాడు దొరల గడీలను పేల్చేసిన నక్సలైట్లు నేడు ప్రగతి భవన్‌ను లేకుండా చేసినా అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రేవంత్ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి.

బీఆర్‌ఎస్ నేతల కేసులు...

మరోవైపు రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు (BRS Leaders) తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రగతిభవన్‌ను కూల్చివేయాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యల వెనుక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ ములుగు, నర్సంపేట పోలీస్‌స్టేషన్లలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ప్రగతిభవన్‌ను డైనమేట్లు పెట్టి పేల్చాలన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రేవంత్‌ను జైల్లో పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader Batti Vikramarka), జానారెడ్డి (Janareddy) సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ (Mahatma Ganthiji) మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా అని నిలదీశారు. పక్కనే ఉన్న ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని... అక్కడ ప్రభుత్వ ఆఫీస్‌లపై పేల్చాలని డిమాండ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న పీసీసీలు అందరూ రేవంత్ తరహా కామెంట్స్ చేస్తారా అంటూ పెద్దసుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2023-02-08T12:05:52+05:30 IST